ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంటేనే తమిళులు మండిపడుతున్న తరుణంలో ఏపీ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి.
అగ్నికి ఆజ్యం పోసేలా టీవీ ఇంటర్య్వూలో మంత్రి వ్యాఖ్యలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంటేనే తమిళులు మండిపడుతున్న తరుణంలో ఏపీ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఒక ప్రముఖ తమిళ టీవీలో సోమవారం ప్రసారం అయిన బొజ్జల ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన తీరుతో తమిళ రాజకీయ పార్టీలు మరోసారి మండిపడ్డాయి. ఆ టీవీ ఇంటర్వ్యూలో ‘‘శేషాచల అడవుల్లో జరిగిన కాల్పుల్లో మరణించినవారంతా ఎర్రచందనం స్మగ్లర్లే. వీరిని తెలుగువారు, తమిళులు అని విభజించరాదు. కోట్లాది రూపాయల విలువైన ఎర్రచందన వృక్షాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. పర్యాటకులుగా ఇక్కడకు వస్తే పరవాలేదు, అటవీ సంపదను హరించడానికి వస్తే హతమారుస్తాం’’ అని బొజ్జల వ్యాఖ్యానించారు. దీనిపై తమిళపార్టీల నేతలు మండిపడ్డారు.
బాబు దిష్టిబొమ్మల దహనం
మంత్రి బొజ్జల వ్యాఖ్యలతో తమిళనాడులో సోమవారం మళ్లీ ఆందోళనలు రేగాయి. చెన్నై ఐనవరంలోని హెరిటేజ్ సూపర్‌మార్కెట్‌పై నలుగురు దుండగులు పెట్రోబాంబు విసిరారు. అదృష్టవశాత్తు అది పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో వీసీకేకు చెందిన నలుగురిని అరెస్ట్ చేశారు. డాక్టర్ అంబేద్కర్ న్యాయ కళాశాల విద్యార్థులు సోమవారం చెన్నైలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. బొజ్జల వ్యాఖ్యలను నిరసిస్తూ కోయంబత్తూరులో మిదితేన్ విద్యార్థుల సంఘం రాస్తారోకో నిర్వహించి చంద్రబాబు, బొజ్జల దిష్టిబొమ్మలను దహనం చేశారు.