రుణమే యమపాశం | Husband-wife relationship in debts | Sakshi
Sakshi News home page

రుణమే యమపాశం

Sep 1 2015 2:38 AM | Updated on Sep 3 2017 8:29 AM

రుణమే యమపాశం

రుణమే యమపాశం

అప్పులు చేసి వేసిన బోర్లు ఎండిపోయాయి.. ఆశలు పెంచుకున్న చేనూ చేతికందలేదు.. ఇద్దరు కూతుళ్ల పెళ్లి కోసం చేసిన అప్పు కూడా అలాగే ఉండిపోయింది..

భార్యాభర్తల బంధాన్ని తెంచిన అప్పులు
* భార్యను చంపి తానూ పురుగుల మందు తాగి కన్నుమూసిన భర్త
* అనాథలైన పిల్లలు
* కరీంనగర్ జిల్లా రూప్‌సింగ్ తండాలో దారుణం

ఎల్లారెడ్డిపేట: అప్పులు చేసి వేసిన బోర్లు ఎండిపోయాయి.. ఆశలు పెంచుకున్న చేనూ చేతికందలేదు.. ఇద్దరు కూతుళ్ల పెళ్లి కోసం చేసిన అప్పు కూడా అలాగే ఉండిపోయింది.. ఈ రుణమే ఆ దంపతుల పాలిట యమపాశంగా మారింది! ఆర్థిక ఇబ్బందులకు తాళలేని ఆ భర్త చేను కాపలాకు తోడుగా తీసుకువెళ్లిన భార్యను అక్కడే దారుణంగా హత్య చేశాడు.

ఆ తర్వాత ఇంటికొచ్చి పురుగుల మందు తాగి తానూ తనువు చాలించాడు! తల్లిదండ్రులు దూరమవడంతో వారి ఇద్దరు అమ్మాయిలు, కొడుకు రోడ్డున పడ్డారు. హృదయ విదారకమైన ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అడవిపదిర శివారులోని రూప్‌సింగ్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన భూక్య నిర్మల (38), భూక్య కోబల్‌సింగ్ (45) దంపతులు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

వ్యవసాయ పనులు లేనప్పుడు కూలీ పనులకు వెళ్తుంటారు. వీరికి నలుగురు కూతుళ్లు సునీత, రజిత, వసంత, మమత, కుమారుడు అభిలాష్. తమకున్న రెండున్నరెకరాల భూమిని సాగు చేయడం కోసం కోబల్‌సింగ్ గతేడాది రూ.2 లక్షల అప్పు చేసి ఐదు బోర్లు వేయించాడు. రెండింట్లోనే నీళ్లు పడ్డాయి. కిందటేడాది చేనులో పత్తి సాగుచేశాడు. కరువుతో పంట అంతా ఎండిపోయింది. పెట్టుబడులు మట్టిపాలయ్యూయి.

బోర్లను నమ్ముకుని ఈ ఖరీఫ్‌లో రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. వర్షాలు లేకపోవడంతో నెలరోజులుగా బోర్ల నుంచి నీరు రాలేదు. వారం క్రితమే రెండు బోర్లు ఎత్తిపోయాయి. నీరందక మొక్కజొన్న ఎదగలేదు. పంటలకు పెట్టుబడితోపాటు ఇద్దరు కూతుళ్లు సునీత, రజితల పెళ్లిళ్ల కోసం మొత్తం రూ.4 లక్షల అప్పులయ్యాయి. ఈసారి కూడా పెట్టుబడులు చేతికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో కోబల్‌సింగ్‌కు దిక్కు తోచలేదు. అప్పులు, కుటుంబ పోషణపై దిగులు చెందాడు. అప్పుల విషయమై భార్యభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు మొదలయ్యాయి.

ఇదే విషయమై ఆదివారం రాత్రి వారు గొడవ పడ్డారు. అనంతరం ఇద్దరూ కలిసి మొక్కజొన్న పంటకు రాత్రి పూట కాపలా వెళ్లారు. చేను వద్ద నిద్రిస్తున్న భార్యను రాత్రి 11 గంటల సమయంలో బండరాళ్లు, కర్రలతో కోబల్‌సింగ్ కొట్టి చంపాడు. అక్కడ్నుంచి 12 గంటలకు ఇంటికొచ్చి నిర్మలను చంపినట్లు కూతుళ్లకు చెప్పాడు. కూతుళ్లు విలపిస్తూ సమీప బంధువులను తీసుకుని పొలం వద్దకు వెళ్లగా నిర్మల శవమై పడి ఉంది. తల్లి మృతదేహంతో ఇంటికి వచ్చేసరికి.. తండ్రి కోబల్‌సింగ్ క్రిమిసంహారక మందు తాగి అక్కడికక్కడే మృతిచెందాడు.
 
రోడ్డున పడ్డ పిల్లలు
దంపతుల మృతితో పిల్లలు అనాథలయ్యారు. సునీతకు ఏడాది కిత్రం, రజితకు ఆరు నెలల క్రితం పెళ్లి అయింది. మూడో కూతురు వసంతను ఆర్థిక పరిస్థితులు బాగా లేక పదో తరగతితోనే చదువు మాన్పించారు. నాలుగో కూతురు మమత దుమాల గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. కుమారుడు అభిలాష్ గర్జనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.

కోబల్‌సింగ్ తండ్రి గతంలోనే చనిపోయూడు. తల్లి దుర్గవ్వ వయసు మీద పడడంతో వీరిపైనే ఆధారపడి ఉంటోంది. ప్రస్తుతం వీరి ఆలనా పాలనా చూసేందుకు ఎవరూ లేకపోవడంతో దిక్కులేనివారయ్యారు. రుణదాతలు అప్పులు చెల్లించాలని అడిగినప్పుడల్లా తల్లిదండ్రులు గొడవ పడేవారని వసంత, మమత చెప్పారు.

ఆదివారం రాత్రి కూడా గొడవ పడ్డారని, ఆ తర్వాత చేనుకు వెళ్లారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు లేని తమను ఎవరు చూసుకుంటారంటూ ఆ చిన్నారులు కన్నీళ్ల పర్యంతమయ్యూరు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement