ప్రభుత్వ ‘పథకం’.. చదువుకు దూరం | Government 'scheme .. student problems with Fee Reimbursement Scheme | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ‘పథకం’.. చదువుకు దూరం

Aug 29 2015 1:44 AM | Updated on May 25 2018 3:26 PM

ప్రభుత్వ ‘పథకం’.. చదువుకు దూరం - Sakshi

ప్రభుత్వ ‘పథకం’.. చదువుకు దూరం

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ప్రభుత్వం చేసిన మార్పులు ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి.

సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ప్రభుత్వం చేసిన మార్పులు ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. పథకంలో చేసిన మార్పులపై అధికారులకూ స్పష్టత లేకపోవడంతో పీజీ, బీఈడీ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పీజీ, బీఈడీ కోర్సులు చదువుతున్న వారు స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవడంతోనే అసలు సమస్య మొదలవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013-14 విద్యా సంవత్సరం వరకు పీజీ చేసి బీఈడీ చేసినా, బీఈడీ చేసి పీజీ చేసినా ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చేది.

2014-15 విద్యా సంవత్సరం ప్రారంభంలోనూ ఇదే విధానం కొనసాగడంతో విద్యార్థులు పీజీ, బీఈడీ కోర్సుల్లో చేరారు. అయితే ఆ తర్వాత కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం పీజీ చేసి బీఈడీ చేసిన వారికి రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదు. ఈ పాస్‌లో ఆ విద్యార్థుల దరఖాస్తులు నమోదు కావడం లేదు. దీంతో ఆందోళనకు గురవుతున్న విద్యార్థులు, గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చి ఇప్పుడు ఇవ్వమంటే ఎలా అని వాపోతున్నారు.

తాము కోర్సుల్లో చేరే నాటికి పాత పద్ధతి అమల్లో ఉందని, పీజీ చేసి బీఈడీ చేసినా, బీఈడీ చేసి పీజీ చేసినా తమ ఫీజులు చెల్లించాలని కోరుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ నోడల్ డిపార్ట్‌మెంట్ ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖ చుట్టూ విద్యార్థులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ విషయంలో ఎస్సీ శాఖ అధికారులు కూడా విద్యార్థులకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు, అక్కడి నుంచి వచ్చే వివరణను బట్టి స్పందిస్తామని అధికారులు చెబుతున్నారు.
 
అది ఇస్తేనే.. ఇది..
బీఈడీ చేసి పీజీ చేస్తున్న వారు బీఈడీ రీయింబర్స్‌మెంటును చలాన్ రూపంలో తిరిగి చెల్లిస్తే, పీజీ ఫీజు ఇస్తామని కొన్నిచోట్ల అధికారులు చెబుతున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు. పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్స్-కోర్సు ఫ్లో అడాప్టెడ్ ఇన్ ఈ పాస్ (కింది నుంచి పైకి కోర్సుల వరుస క్రమం) అంటూ స్కాలర్‌షిప్స్ దరఖాస్తులను పరిశీలించి, మంజూరు చేసే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కు సంబంధిత అధికారులు ఉత్తర్వులు పంపించారు. అందుకు అనుగుణంగా ఈ-పాస్ వెబ్‌సైట్‌లో మార్పులు చేయడంతో ఈ విద్యార్థుల దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి.
 
పీజీ తర్వాత డిగ్రీ..
సాధారణంగా బీఈడీ డిగ్రీ స్థాయి కోర్సు. ఆ తరువాత క్రమంలో వచ్చే కోర్సు పీజీ. కాని పీజీ చేసిన విద్యార్థి ఆ తరువాత డిగ్రీతో సమానమైన వృత్తి విద్యా కోర్సు (బీఈడీ) చేసి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేస్తే అధికారులు తిరస్కరిస్తున్నారు. ఇందులో భాగంగా  కోర్సు స్ట్రీమ్, కోర్సు ఫ్లో అంటూ జనరల్, ఎడ్యుకేషన్, లా, ఫిజికల్ ఎడ్యుకేషన్, మెడికల్, ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు సంబంధించి ఆయా విభాగాలు క్రమపద్ధతిలో అంటే ఇంటర్, డిగ్రీ, ఎంఫిల్, పీహెచ్‌డీ వంటివి వరసగా చదివితేనే రీయింబర్స్‌మెంట్ వర్తించేలా మార్పులు చేశారు.

ఎడ్యుకేషన్ విభాగంగా బీఈడీ, ఎంఈడీ, ఎంఫిల్, పీహెచ్‌డీ క్రమపద్ధతిలో వరసగా చదివితేనే ఫీజు చెల్లించేలా వెబ్‌సైట్‌లో ఏర్పాటు చేశారు. దీనిపై ప్రభుత్వ పరంగా వివరణ వస్తేనే సమస్య పరిష్కారమవుతుందనే అభిప్రాయాన్ని విద్యార్థులు, అధికారులు వెలిబుచ్చుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement