 
															దిగి వస్తున్న పుత్తడి
దేశీయంగానూ, అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి.
	 ముంబై:  దేశీయంగానూ, అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఫ్రాన్స్‌ఎన్నికల్లో మార్కెట్లకు అనుకూలంగా వ్యవహరించే మాక్రెన్ తొలిరౌండ్‌లో విజయం సాధించటం, ఉత్తరకొరియాలో యుద్ద వాతావరణం కొంత శాంతించటం, అంతర్జాతీయ మార్కెట్లో పలు కంపెనీల ప్రోత్సాహకర ఫలితాల ప్రకటన వంటి అంశాలు డాలరు బలపడేలా చేశాయి. దీంతో పసిడి ధరలు దిగి వస్తున్నాయి.   మంగళవారం నాటి ముగింపుతో పోలిస్తే  పసిడిధరలు మరింత క్షీణించాయి.  కామెక్స్‌లో ఔన్స్  బంగారం స్వల్ప నష్టంతో 1256 వద్ద ట్రేడవుతోంది.  వెండి కూడా ఔన్స్ 16.87 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  
	
	డాలర్ బలపడటంతోపాటు, ట్రెజరీ ఈల్డ్స్ పుంజుకుంటున్నాయి. మరోపక్క ఫ్యూచర్స్‌లో ట్రేడర్ల అమ్మకాల కారణంగా పసిడి ధరలు  పతనమయ్యాయి.  ఫలితంగా   మరోసారి న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్(31.1 గ్రాములు) 1,251 డాలర్ల  వద్ద  మూడు వారాల కనిష్టాన్ని తాకింది.  
	
	ఇక అంతర్జాతీయ ప్రభావం దేశీ ప్యూచర్స్ మార్కెట్‌పై పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర బుధవారం మరింత దిగి వచ్చింది. రూ.51 రూపాయలు క్షీణించి రూ.28,531 వద్ద ట్రేడ్ అవుతోంది.  అటు దుబాయ్ బంగారం కూడా బలహీనంగానే ఉంది.
	
	యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల సమావేశం బుధవారం ముగియనుంది.  వడ్డీ రేట్లను యథాతథంగా  కొనసాగించనుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారానికి డిమాండ్ మరింత క్షీణించే అవకాశం ఉందని ఎనలిస్టుల అంచనా. మరోవైపు వెండి ధరలు కొద్దిగా పుంజుకున్నారు. ఇటీవల మూడునెలల కనిష్టాన్ని తాకిన  సిల్వర్ ధరలు 0.4శాతం పెరిగి ఔన్స్16.87గా ఉంది. ప్లాటినం స్థిరంగాను, పల్లాడియం స్వల్ప లాభాల్లోను కొనసాగుతున్నాయి.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
