ఒకే ఎగ్జామ్ కేలండర్‌ను అమలు చేయాలి
రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్నట్లుగానే మిగిలిన తరగతుల విద్యార్థులకు ఒకే సమయంలో పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
	సాక్షి, విజయవాడ బ్యూరో/ఏలూరు: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్నట్లుగానే మిగిలిన తరగతుల విద్యార్థులకు ఒకే సమయంలో పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ రూపొందించే ఎగ్జామ్ కేలండర్‌ను బీసీ, ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా తప్పనిసరిగా అనుసరించాలని ఆయన స్పష్టం చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి గురువారం రాత్రి విజయవాడలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
	
	రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వైఫల్యాన్ని అధిగమించేందుకు నిపుణుల బృందాన్ని నియమించి, మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.
	 
	సమస్యల్లో ఉన్నాం... ఆదాయం లేదు
	ప్రస్తుతం రాష్ర్ట ప్రభుత్వం సవాలక్ష సమస్యల్లో ఉందని, ఆదాయం కూడా లేదని దాని వల్ల సంక్షేమ పథకాలు ఆలస్యమవుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు  చెప్పారు. ఆయన గురువారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో జనచైతన్య యాత్రలో, అంతకు ముందు విజయవాడలో టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. తర్వాత దెందులూరు హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన సభలో  మాట్లాడారు. సాక్షి పత్రిక చదివి మనసులు పాడుచేసుకోవద్దంటూ విమర్శలు గుప్పించారు.
	 
	జనచైతన్యయాత్రలకు గ్రేడింగ్
	హైదరాబాద్: తెలుగుదేశం నిర్వహిస్తున్న జనచైతన్యయాత్రల తీరును పరిశీలించి గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు  చంద్రబాబు తెలిపారు. ఆయన సుమారు ఏడు వేల మంది పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు మీడియా కమిటీ జాతీయ సమన్వయకర్త ఎల్వీఎస్సార్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వరద ప్రాంతాలైన చిత్తూరు, నెల్లూరు తదితర జిల్లాల్లోని పార్టీ కార్యకర్తలు, నేతలు వరద సహాయ, పునరావాస చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు.
	
	మార్క్ జుకర్ బర్గ్ (ఫేస్‌బుక్), బిల్‌గేట్స్ (మైక్రోసాఫ్ట్), వారెన్ బఫెట్ (వ్యాపారవేత్త) స్ఫూర్తితో యువత, కార్పొరేట్ వర్గాలు ఏపీ అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. కాగా, చంద్రబాబు శనివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశం అవుతారు. ఆదివారం చంద్రబాబును తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దంపతులు కలిసే అవకాశం ఉంది.
	
	ఈ నెలాఖరులో మెదక్ జిల్లాలోని తన ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న అయుత చండీయాగంలో పాల్గొనాల్సిందిగా వారు ఆహ్వానించనున్నారు. అదేరోజు రాత్రి ఎన్‌టీఆర్ పెద్ద కుమార్తె లోకేశ్వరి మనుమరాలి వివాహ రిసెప్షన్‌లో బాబు పాల్గొంటారు.
	 జల సంరక్షణపై కలసి పనిచేస్తాం
	 
	జల సంరక్షణ, నీటి యాజమాన్య పద్ధతులపై రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్(ఈబీటీసీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. విజయవాడ సీఎం కార్యాలయంలో బాబుతో ఈబీటీసీ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
