ఆ విధంగా బాహుబలి-2కు సీఎం భారీ సాయం! | CM Siddaramaiah pays a 'Baahubali' price | Sakshi
Sakshi News home page

ఆ విధంగా బాహుబలి-2కు సీఎం భారీ సాయం!

May 2 2017 5:32 PM | Updated on Sep 5 2017 10:13 AM

ఆ విధంగా బాహుబలి-2కు సీఎం భారీ సాయం!

ఆ విధంగా బాహుబలి-2కు సీఎం భారీ సాయం!

అధిక ధరకు బాహుబలి-2 టికెట్లు కొని సినిమా చూసిన ముఖ్యమంత్రి తీరుపై రాజకీయ దుమారం చెలరేగింది.

మల్టిపెక్స్ లలో సినిమా టికెట్ ధరలను అదుపుచేస్తామన్న ప్రభుత్వ హామీ మేరకు అధికారులు కీలక ఫైలును సిద్ధం చేశారు. ఆ ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేస్తే.. మరు క్షణం నుంచే టికెట్ గరిష్ట రూ.200గా నిర్ణయిస్తూ జీవో జారీ అయ్యేది. కానీ అత్యవసర పని నిమిత్తం గురువారం  సీఎం దుబాయ్ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం బాహుబలి-2 విడుదలైంది. 
 
ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో మల్టిపెక్స్ లు పోటీపడ్డాయి. టికెట్ ధరల్ని అమాంతం పెంచేశాయి. కాంబోప్యాక్ ల పేరుతో జనాన్ని అడ్డగోలుగా దోచుకున్నాయి. ఏదైతేనేం.. తొలిరోజే వంద కోట్ల పైచిలుకు కలెక్షన్లు సాధించిన బాహుబలి-2.. సినీచరిత్ర రికార్డుల్ని బద్దలుకొట్టేదిశగా దూసుకుపోతోంది. ఆ విధంగా ఫైలుపై సీఎం సంతకం చేయకపోవడం సినిమాకు పరోక్షంగా  ఎంతో సాయపడిందని కన్నడ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

భారీ ధరకు బాహుబలి టికెట్లు కొన్న సీఎం..
ఇక విదేశాల నుంచి సోమవారం తిరిగొచ్చిన ముఖ్యమంత్రి.. నేరుగా బెంగళూరులోని ఓరియాన్ మాల్ కు వెళ్లి.. ఒక్కో టికెట్ రూ.1050కి కొనుగోలుచేసిమరీ బాహుబలి-2 సినిమా చూశారు. ఇంతకీ ఆయనెవరో కాదు.. మన పొరుగు రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే! సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తానన్న ఆయనే.. అధిక ధర చెల్లించి సినిమా చూడటంపై కర్ణాటకలో రాజకీయ వివాదం చెలరేగింది. ధరల నియంత్రణపై కన్నడ సంఘాలు ఆందోళనలు చేస్తున్న సమయంలోనే.. సీఎం అధిక ధర చెల్లించి సినిమా చూడటం వివాదాస్పదమైంది.
 
కాగా, ఇది సీఎం వ్యక్తిగత విషయమని, మనవడి బలవంతం మేరకే సిద్ధరామయ్య సినిమా చూశారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రైవేటు వాహనంలో వచ్చి బాహుబలి-2 చూసిన సీఎం.. ఆ వెంటనే అధికారిక హోదాలో చాముండేశ్వరీ స్టుడియోకి వెళ్లి 'నిరుత్తరా' అనే కన్నడ సినిమాను వీక్షించారు. నటి భావన నిర్మించిన ఈ  సినిమా ప్రదర్శనకు సీఎంతోపాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement