అధికారాలు.. ఆత్మగౌరవమే లక్ష్యం | chalo assembly on 7 oct zptc forum | Sakshi
Sakshi News home page

అధికారాలు.. ఆత్మగౌరవమే లక్ష్యం

Sep 25 2015 3:13 AM | Updated on Sep 3 2017 9:54 AM

అధికారాలు.. ఆత్మగౌరవమే లక్ష్యం

అధికారాలు.. ఆత్మగౌరవమే లక్ష్యం

అభివృద్ధి నిధులు, అధికారాలు, ఆత్మగౌరవం సాధనే లక్ష్యంగా జిల్లా పరిషత్ ప్రాదేశిక కమిటీ(జెడ్పీటీసీ) సభ్యుల ఫోరం రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమైంది.

సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి నిధులు, అధికారాలు, ఆత్మగౌరవం సాధనే లక్ష్యంగా జిల్లా పరిషత్ ప్రాదేశిక కమిటీ(జెడ్పీటీసీ) సభ్యుల ఫోరం రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమైంది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో జరిగిన జెడ్పీటీసీ ఫోరం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ఖరారు చేశారు. సమావేశంలో చేసిన తీర్మానాలను ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజీ విలేకరులకు వివరించారు. ఏమాజీ మాట్లాడుతూ.. ప్రజలతో నేరుగా ఎన్నుకోబడిన జెడ్పీటీసీలకు నిధులు, అధికారాలు ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని, ఆత్మగౌరవ సాధనే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడాలని ఫోరం నిర్ణయించిందన్నారు.

ఆందోళనల్లో భాగంగా శుక్రవారం నుంచి అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 7న చలో అసెంబ్లీకి ఫోరం పిలుపునిచ్చిందని, తమతో పాటు ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన ఎంపీటీసీలను కూడా కలుపుకుని జేఏసీగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. 7న ఇందిరాపార్కు నుంచి అసెంబ్లీ వరకు చేపట్టిన ర్యాలీలో పార్టీలకతీతంగా రాష్ట్రంలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున పాల్గొని చలో అసెంబ్లీని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
 
నవంబర్‌లో చలో పార్లమెంట్..
జెడ్పీటీసీలకు నిధుల కేటాయింపును నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నవంబర్‌లో ‘చలో పార్లమెంట్’ పేరిట ఆందోళన చేపడతామని ఏమాజీ చెప్పారు. వెనుబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఇచ్చే బీఆర్‌జీఎఫ్ గ్రాంటును, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఇచ్చే ఐఏపీ నిధులను కేంద్రం నిలిపేసిందన్నారు. ఆర్థిక సంఘం నిధుల్లో ఇంతకుమునుపు 20 శాతం జెడ్పీటీసీల ద్వారా, 30 శాతం ఎంపీటీసీల ద్వారా అభివృద్ధి పనులకు కేటాయించేవారని చెప్పారు.

తాజాగా 14వ ఆర్థిక సంఘం నుంచి జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు నిధులు ఇవ్వకుండా కేంద్రం నిలిపివేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టే రహదారి మరమ్మత్తు పనుల(ఎంఆర్‌ఆర్, సీఆర్‌ఆర్) నిధులు కూడా గతంలో జెడ్పీటీసీల ఆమోదంతో జరిగేవని, అయితే ఏడాదిన్నరగా ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన 29 అధికారాలను బదలాయించకుండా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆరోపించారు. జెడ్పీటీసీల ఫోరం డిమాండ్లను నెరుస్తామని గత వారం హామీ ఇచ్చిన పంచాయతీరాజ్ మంత్రి.. ఏఏ డిమాండ్లను ఎప్పుడు నెరవేరుస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు.
 
ఎమ్మెల్సీ ఎన్నికల్లో జెడ్పీటీసీలు

ఫోరం గౌరవాధ్యక్షుడు జంగారెడ్డి మాట్లాడుతూ.. జెడ్పీటీసీల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించే విధంగా రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జెడ్పీటీసీలనే మండలికి పంపుతామన్నారు. కొందరు ఫోరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. న్యాయమైన తమ డిమాండ్ల సాధనకై ఆందోళన చేపడుతోంటే అధికార టీఆర్‌ఎస్ బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బెదిరింపులకు తలొగ్గేది లేదని, చలో అసెంబ్లీ విజయవంతానికి కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఫోరం రాష్ట్ర కమిటీ ప్రతినిధులు తానాజీరావు, అంజయ్యయాదవ్, రామకృష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సతీశ్, సునీత, మోహన్‌రెడ్డి, ఈశ్వర్‌నాయక్, పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement