బ్రహ్మోత్సవ సంరంభం.. ఆరంభం | Brahmotsava rush ..provenance | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవ సంరంభం.. ఆరంభం

Sep 16 2015 4:18 AM | Updated on Sep 3 2017 9:27 AM

బ్రహ్మోత్సవ సంరంభం.. ఆరంభం

బ్రహ్మోత్సవ సంరంభం.. ఆరంభం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం వైదికంగా అంకురార్పణ నిర్వహించారు.

శాస్త్రోక్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ  
నేడు ధ్వజారోహణం, పట్టువస్త్రాలు సమర్పించనున్న ఏపీ సీఎం

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం వైదికంగా అంకురార్పణ నిర్వహించారు. స్వామి సర్వ సేనాధిపతి విష్వక్సేనుడు.. బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్వామి తరపున పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక నిర్విహంచటం అనాదిగా వస్తున్న ఆచారం.

బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజైన మంగళవారం సాయంసంధ్యా సమయంలో విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ ఆలయ పురవీధుల్లో ఊరేగింపుగా ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ యాగశాలలో లలాట, బహు, స్తన పునీత ప్రదేశంలో భూమిపూజ (మృత్సంగ్రహణం) నిర్వహించారు. తొమ్మిది పాళికలలో (కుండలు) నవధాన్యాలను మట్టిలో కలిపి మొలకెత్తించే పని ప్రారంభించారు. అంకురాలను ఆరోపించే కార్యక్రమాన్ని అంకురార్పణం (బీజావాపం) అంటారు. శుక్ల పక్ష చంద్రునిలా పాళికల్లోని నవ ధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా అర్చకులు ప్రార్థించారు. నిత్యం నీరుపోసి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త పడతారు.
 
నేడు ధ్వజారోహణం, పెద్ద శేషవాహనం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం 5 నుంచి 5.30 గంటల్లోపు గోధూళి వేళ మీన లగ్నంలో ధ్వజారోహణంతో ఉత్సవాలు కన్నుల పండువగా ఆరంభం కానున్నాయి. రాత్రి 9 గంటలకు శేష వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఇలా వరుసగా ఈనెల 24 వరకు ఉదయం 9 నుంచి 11 గంటలు, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప.. వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు సాక్షాత్కరించనున్నారు. ఐదోరోజు గరుడ వాహనంపై, ఎనిమిదో రోజు రథోత్సవంలో, చివరి తొమ్మిదో రోజు చక్రస్నానంలో స్వామివారు సేదదీరుతారు.
 
నేడు ఏపీ సీఎం పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారికి బుధవారం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 8 గంటల తర్వాత ఇక్కడి బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి సీఎం పట్టువస్త్రాలు ఆలయంలో సమర్పిస్తారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని, వెలుపల పెద్ద శేష వాహన సేవలో పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement