breaking news
Brahmotsava arrangements
-
శాస్త్రోక్తంగా ధ్వజారోహణం
సాక్షి, తిరుమల: తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి సూచికగా ఆలయంలో బుధవారం ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించి.. ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. సాయంత్రం 5 నుంచి 5.30 గంటల మధ్య మీన లగ్నంలో వైఖానస ఆగమోక్తంగా పవిత్ర గరుడ పతాకాన్ని (ధ్వజపటం) బంగారు ధ్వజస్తంభ శిఖరాగ్రానికి ఆవిష్కరించి అర్చకులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ధ్వజారోహణానికి ముందు తిరుచ్చివాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప పరివార దేవతలైన అనంతుడు (ఆదిశేషుడు), గరుత్మంతుడు, విశ్వక్సేనుడు, గరుడధ్వజం, సుదర్శన చక్రతాళ్వార్తో కలసి ఆలయ పురవీధుల్లో ఊరేగారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుమలేశునికి పట్టువస్త్రాలు సమర్పించారు. రాత్రి 8 గంటలకు సీఎం ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి ఆలయానికి ఆయన చేరుకున్నారు. ప్రధాన అర్చకుడు ఏవీ రమణదీక్షితులు సీఎంకు తలపాగా చుట్టారు. తర్వాత వెండిపళ్లెంలో పట్టువస్త్రాలు ప్రదర్శనగా మహద్వారం నుంచి ఆలయంలోకి తీసుకెళ్లి స్వామివారికి సీఎం సమర్పించారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరిగ్గా 12 ఏళ్ల క్రితం అలిపిరి వద్ద మావోయిస్టులు తనపై 24 క్లెమోర్మైన్లతో దాడికి తెగబడ్డారని, ఆ సంఘటన నుంచి సాక్షాత్తు శ్రీనివాసుడే తనను రక్షించారని చంద్రబాబు అన్నారు. -
బ్రహ్మోత్సవ సంరంభం.. ఆరంభం
శాస్త్రోక్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నేడు ధ్వజారోహణం, పట్టువస్త్రాలు సమర్పించనున్న ఏపీ సీఎం సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం వైదికంగా అంకురార్పణ నిర్వహించారు. స్వామి సర్వ సేనాధిపతి విష్వక్సేనుడు.. బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్వామి తరపున పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక నిర్విహంచటం అనాదిగా వస్తున్న ఆచారం. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజైన మంగళవారం సాయంసంధ్యా సమయంలో విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ ఆలయ పురవీధుల్లో ఊరేగింపుగా ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ యాగశాలలో లలాట, బహు, స్తన పునీత ప్రదేశంలో భూమిపూజ (మృత్సంగ్రహణం) నిర్వహించారు. తొమ్మిది పాళికలలో (కుండలు) నవధాన్యాలను మట్టిలో కలిపి మొలకెత్తించే పని ప్రారంభించారు. అంకురాలను ఆరోపించే కార్యక్రమాన్ని అంకురార్పణం (బీజావాపం) అంటారు. శుక్ల పక్ష చంద్రునిలా పాళికల్లోని నవ ధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా అర్చకులు ప్రార్థించారు. నిత్యం నీరుపోసి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త పడతారు. నేడు ధ్వజారోహణం, పెద్ద శేషవాహనం బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం 5 నుంచి 5.30 గంటల్లోపు గోధూళి వేళ మీన లగ్నంలో ధ్వజారోహణంతో ఉత్సవాలు కన్నుల పండువగా ఆరంభం కానున్నాయి. రాత్రి 9 గంటలకు శేష వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఇలా వరుసగా ఈనెల 24 వరకు ఉదయం 9 నుంచి 11 గంటలు, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప.. వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు సాక్షాత్కరించనున్నారు. ఐదోరోజు గరుడ వాహనంపై, ఎనిమిదో రోజు రథోత్సవంలో, చివరి తొమ్మిదో రోజు చక్రస్నానంలో స్వామివారు సేదదీరుతారు. నేడు ఏపీ సీఎం పట్టువస్త్రాల సమర్పణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారికి బుధవారం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 8 గంటల తర్వాత ఇక్కడి బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి సీఎం పట్టువస్త్రాలు ఆలయంలో సమర్పిస్తారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని, వెలుపల పెద్ద శేష వాహన సేవలో పాల్గొంటారు.