'విద్రోహి' జీవితం.. విద్యార్థులకు అంకితం | After 30 years in JNU, poet and perennial protester ‘Vidrohi’ dies | Sakshi
Sakshi News home page

'విద్రోహి' జీవితం.. విద్యార్థులకు అంకితం

Dec 10 2015 2:40 PM | Updated on Sep 3 2017 1:47 PM

విద్యార్థుల కోసం, విద్యార్థుల తరఫున 30 ఏళ్లపాటు అవిశ్రాంత పోరాటం చేసిన ఆ గుండె చివరకు అలసిపోయి ఆగిపోయింది.

న్యూఢిల్లీ: విద్యార్థుల కోసం, విద్యార్థుల తరఫున 30 ఏళ్లపాటు అవిశ్రాంత పోరాటం చేసిన ఆ గుండె చివరకు అలసిపోయి ఆగిపోయింది. నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలోని ఓ చెట్టునే ఆవాసం చేసుకొని యాజమాన్య పోకడలతోపాటు సామాజిక రుగ్మతలను ఏకిపారేసిన ఆ గొంతు మూగబోయింది. క్యాంపస్ లోపల, వెలుపల విద్యార్థుల ఉద్యమాలకు బాసటగా నిలిచిన ఆ శ్వాస అనంత విశ్వంలో కలసిపోయింది. 'విద్రోహి' కలం పేరుతో మూడు దశాబ్దాలపాటు విద్యార్థి లోకానికి స్ఫూర్తినిచ్చిన రామ్‌శంకర్ యాదవ్ మంగళవారం నాడు తన 58వ ఏట తనకు ఇన్నేళ్లు నీడనిచ్చిన చెట్టు కిందనే కన్నుమూశారు.

ఉత్తరప్రదేశ్‌లో 1957లో జన్మించిన యాదవ్ 1980లో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఎంఏ హిందీలో చేరారు. చేరిన రోజు నుంచే విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. విద్యార్థులను సమ్మె బాట పట్టిస్తున్నారని భావించిన క్యాంపస్ యాజమాన్యం ఆయన్ని 1983లో తాత్కాలికంగా క్యాంపస్ నుంచి సస్పెండ్ చేసింది. ఏదిఏమైనా తాను క్యాంపస్ వీడి పోయేది లేదంటూ క్యాంపస్‌లోని ఓ చెట్టుకిందే భీష్మించుకొని కూర్చున్నారు. ఆ నాటి నుంచి తుదిశ్వాస విడిచే వరకు ఆయన పోరాటం ఆగలేదు. బలవంతంగా ఆయన్ని క్యాంపస్ నుంచి తొలగించేందుకు యాజమాన్యం విశ్వప్రయత్నాలు చేసింది. విద్యార్థి సంఘాలు ఆయనకు అండగా నిలబడడంతో ఆయన్ని బయటకు పంపించలేక పోయారు.

విద్యార్థులిచ్చే కప్పు కాఫీ, ప్లేటు మీల్స్‌లతో చెట్టుకిందే కాలం గడుపుతూ వచ్చారు. క్యాంపస్ లోపల, వెలుపల జరిగే విద్యార్థుల నిరసన ప్రదర్శన, ర్యాలీలు, నిరహార దీక్షల్లో క్రియాశీలక పాత్ర వహిస్తూ వచ్చారు. ఖాళీ సమయాల్లో తన వద్దకు వచ్చే విద్యార్థులకు కవిత్వం వినిపించేవారు. ‘ఏక్ ఔరత్ కీ జ్వలి హుయి లాష్’ పేరుతో మహిళలపై జరుగుతున్న అణచివేత.. దోపిడీలకు వ్యతిరేకంగా, ‘నూర్ మియా కా సుర్మ, నయీ దునియా, హే దునియా హమ్‌కో ఘర్ లేనే దో... జహా ఆద్మీ ఆద్మీ కా తరహా రహే సకే, కహే సకే, సాహి సకే’ లాంటి సామ్యవాద సామాజిక దృక్పథంతో కూడిన కవితలను కంఠతా చెప్పేవారు.

ఆయన తన కవిత్వాన్ని ఎప్పుడూ అక్షరబద్ధం చేయలేదు. విద్యార్థులు, మిత్రులు, అభిమానులు టేప్ రికార్డుల్లో రికార్డు చేసినవి ఇప్పటికి క్యాంపస్ పరిధిలోవున్న డాబాల్లో వినిపిస్తుంటాయి. ఇదేమి న్యూసెన్స్ అనుకున్న క్యాంపస్ యాజమాన్యం 2010లో సెక్యూరిటీ ద్వారా ఆయన్ని క్యాంపస్ నుంచి బయటకు పంపించింది. అధికార విద్యార్థి సంఘం దీనికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించింది. రెండు వారాలపాటు క్యాంపస్ మూతపడింది. ఫలితంగా యాదవ్‌ను మళ్లీ క్యాంపస్‌లోకి అనుమతించారు. అప్పటివరకు విద్యార్థుల దయాదాక్షిణ్యాల బతికిన యాదవ్‌కు క్యాంటిన్ ద్వారా శాశ్వత ప్రాతిపదికపై ఉచిత టీ, భోజన సదుపాయాలను కల్పించారు. చలికాలం కోసం గొంగళ్లు ఇచ్చారు. వర్షాకాలంలో పడుకునేందుకు విద్యార్థి సంఘం ఆఫీసులో వెసలుబాటు కల్పించారు.

ఆయన జీవితం గురించి తెలిసిన గ్వాలియర్‌కు చెందిన నితిన్ పమ్నాని 2011లో ఆయన వద్దకు వచ్చి ‘మై తుమ్హారా కవి హూ’ అనే శీర్షికతో ఓ డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు. ఆ డాక్యుమెంటరీకి అవార్డు కూడా వచ్చింది. క్యాంపస్‌లో విద్యార్థిగా చేరడానికి ముందే ఆయనకు పెళ్లయిందని, ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఢిల్లీలో ఉంటున్నారని తెలిసినవారు చెబుతారు. వాళ్లు అప్పుడప్పుడు వచ్చి తమతో ఉండాల్సిందిగా కోరినా యాదవ్ పట్టించుకునేవారు కాదని, తన జీవితం క్యాంపస్‌కే అంకితమని చెప్పేవారని ఆయన సన్నిహితులు చెబుతారు. క్యాంపస్ విద్యార్థులు బుధవారం సంతాప సభ ఏర్పాటుచేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆయన లేకున్నా ఆయన కవిత్వం పక్తులు తమ చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయని విద్యార్థి నాయకులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement