రాష్ట్రంలోని కేంద్రపారాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో దాదాపు 70 పూరిళ్లు పూర్తిగా దగ్ధమైయ్యాయి. కాగా, 12మందికి తీవ్రగాయాలయ్యాయి.
ఒడిస్సా: కేంద్రపారాలో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 70కి పైగా పూరిళ్లు దగ్ధమైయ్యాయి. కాగా, 12మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మహాకాలపాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం చోటుచేసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఓ ఇంట్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి, ఆపై ఒక ఇంటినుంచి మరోఇంట్లోకి వేగంగా మంటలు వ్యాపించాయి. అందులోనూ పూరిళ్లు కావడంతో మంటల తీవ్రత ఎక్కువైంది.
ఈ ఘటనలో 70కి పైగా పూరిళ్లు బూడిదైనట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు. దీంతో దాదాపు కోటి రూపాయల నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని గంటవరకూ శ్రమించిన అనంతరం మంటలను అదుపులోకి తెచ్చినట్టు సమాచారం.