ఆర్మీ సెలక్షన్స్‌కు వచ్చిన యువకుడు మృతి

Young man who came to Army Selections was dead - Sakshi

విద్యుదాఘాతంతో అరవింద్‌ కన్నుమూత 

ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌లో ఘటన 

రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన 

హైదరాబాద్‌: ఆర్మీలో సెలక్షన్స్‌ కోసం వచ్చి కరెంట్‌ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ వనపర్తి జిల్లా ఆత్మకూర్‌ మండలం ములమల్ల గ్రామానికి చెందిన అంజయ్య, శంకరమ్మ దంపతుల కుమారుడు ఎస్‌.అరవింద్‌ (19) వనపర్తిలో డిగ్రీ చదువుతున్నాడు. ఆర్మీలో సోమవారం జరిగే సెలక్షన్స్‌ కోసం ఆదివారం రాత్రి నగరానికి వచ్చాడు. మౌలాలి జేటీఎస్‌ సమీపంలో ఉన్న ఆర్‌పీఎఫ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ సమీపంలో ఫుట్‌పాత్‌పై నిద్రించాడు. సోమవారం తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌లో ఉన్న ఓపెన్‌ ప్రదేశానికి బహిర్భూమికని వెళ్లాడు. ఈ ప్రదేశం ఎత్తుగా ఉండటంతోపాటు అంతా చీకటిగా ఉండ టంతో విద్యుత్‌ తీగలు తగిలాయి. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మల్కాజిగిరి ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌... అరవింద్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అరవింద్‌ తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

సౌకర్యాల కల్పనలో విఫలం..  
సెలక్షన్‌ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన యువకులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్వాహకులు విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. సెలక్షన్‌ కోసం ఆదివారం రాత్రికే ఇక్కడికి వచ్చిన యువకులకు కనీస వసతులు కల్పించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పలువురు ఆరోపించారు. ఇంతపెద్ద ఎత్తున ఆర్మీ సెలక్షన్స్‌ నిర్వహిస్తున్నప్పుడు యువకుల కోసం కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడాన్ని నాయకులు, స్థానికులు తప్పుబట్టారు. ఇకముందైనా ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.  

రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. 
ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌లో అరవింద్‌ మృతిచెందిన ఘటనాస్థలిని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సందర్శించారు. మృతుడి కుటుంబానికి విద్యుత్‌ శాఖ తరఫున రూ. 5 లక్షలు, ప్రభుత్వపరంగా రూ. లక్ష, తాను రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. అరవింద్‌ దహన సంస్కారాలకు మైనంపల్లి సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ తరఫున రూ. 25 వేల నగదును మృతుడి తండ్రికి అందజేశారు. సెలక్షన్‌ కోసం వచ్చిన వారికి రెండు రోజుల పాటు వసతి ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్‌ ఆకుల నర్సింగ్‌రావు తదితరులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top