ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు

Yekadasi Utsavam Started In Bhadradri - Sakshi

భద్రగిరిలో ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు

మత్సా్యవతారంలో దర్శనమిచ్చిన రామయ్య

ఆళ్వారులకు ప్రత్యేక పూజలు 

వైభవంగా తిరువీధి సేవ 

భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన భద్రగిరిలో వైకుంఠ ప్రయుక్త ఏకాదశి ఉత్సవాలు శనివారం వైభవోపేతంగా ప్రారంభమయ్యా యి. అధ్యయనోత్సవాల్లో భాగంగా పరివార దేవతల ను ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో వేంచేయింప జేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భగుడిలో శ్రీ సీతారామచంద్రస్వామి వారిని మత్సా్య వతారంలో అలంకరించిన అర్చకులు బేడా మండపానికి  తీసుకొచ్చారు. అక్కడ ఆళ్వార్ల మధ్య స్వామి వారిని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన గావించారు. అధ్యయనోత్సవాల నిర్వహణలో పాల్గొనే అర్చకులు, వేదపండితులు, ఇతర సిబ్బందికి దేవస్థానం తరఫున ఈఓ రమేశ్‌బాబు దీక్షా వస్త్రాలను అందజేశారు. స్వామివారితో పాటు పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు గావించా రు.

అనంతరం వేద పండితులు చతుర్వేదాలను, దివ్య ప్రబంధాలను పఠించారు. ఆ తర్వాత మత్సా్యవతారంలో ఉన్న రామయ్యను  గర్భగుడిలోకి తీసుకెళ్లి మూలమూర్తుల వద్ద కొద్దిసేపు ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో స్వామి వారిని వేంచేయింపజేసి కోలాటా లు, భజనలు,  వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్త జనసందోహం నడుమ గోదావరి తీరం వరకు ఊరే గింపుగా తీసుకెళ్లారు. అక్కడ పూజలు చేసిన తర్వాత తిరిగి కల్యాణమండపంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామి వారిని భక్తుల సందర్శనార్థం వేంచేయింపజేశారు. మత్సా్యవతార రూపుడైన శ్రీసీతారామచంద్రస్వామి వారిని కనులారా తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు అర్చకులు ఆశీర్వచనాలు అందజేసి, స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆలయ వేదపండితులు మత్సా్యవతర రూపం విశిష్టతను వివరించారు.
 
పురవీధుల్లో స్వామివారు... 
మిథిలా ప్రాంగణంలో పూజలు అందుకున్న శ్రీసీతారామచంద్రస్వామి వారిని అక్కడ నుంచి పల్లకిపై పురవీధుల్లో తిరువీధి సేవకు తీసుకెళ్లారు. మహిళా భక్తుల కోలాటాలతో రామ నామ సంకీర్తనలు ఆలపించగా, వేద విద్యార్థులు, వేద పండితుల మంత్రోచ్ఛరణలు, భక్తజనం తోడుగా స్వా మివారు పురవీధుల్లో ఊరేగారు. దారి పొడువునా భక్తులు స్వామివారికి మొక్కులు సమర్పించుకున్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ రమేశ్‌బాబు, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, ఏఈఓ శ్రావణ్‌ కుమార్, వేదపండితులు మురళీ కృష్ణమాచార్యులు, స్థానాచార్యులు స్థలశాయి, డీఈ రవీందర్, ఈవోటు సీసీ అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
 
నేడు కూర్మావతారం...  
సీతారామచంద్రస్వామి వారు ఆదివారం కూ ర్మావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ‘ దేవతలు, రాక్షసులు మంధర పర్వతాన్ని చిలకించగా, వాసుకి అనే పామును తాడుగా చేసుకొని, అమృతానికై క్షీరసాగరాన్ని చిలుకుతున్న సమయంలో ఏ ఆధారం లేక మంధరగిరి మునిగిపోగా, దేవతలు, రాక్షసుల ప్రార్థనలతో శ్రీహరి కూర్మావతారాన్ని ధరించి మునిగిపోయిన మం ధర పర్వతాన్ని తన వీపున నిలుపుకొని పైకెత్తి సహాయపడ్డాడు. ఈ అవతారాన్ని దర్శించడం వల్ల శని గ్రహ సంబంధమైన దోషాలు తొలగుతాయి’ అని పండితులు చెబుతున్నారు.
 
నేటి సాంస్కృతిక కార్యక్రమాలు... 
మిథిలా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.  భద్రాచలానికి చెందిన శ్రీరామ సేవాతరంగణి సరోజని బృందంచే భజన సంకీర్తన, ఖమ్మానికి చెందిన ఎల్‌. శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రాయభారం హరికథా కాలక్షేపం ఉంటాయి. ఆ తర్వాత విజయవాడ జయరామ, సుధాకర్‌ వారిచే గాత్ర కచేరి, భద్రాచలానికి చెందిన అల్లం రమాదేవిచే భక్తి సంగీతం, మంగళగిరికి చెం దిన గోలి శ్రీలక్ష్మి వారిచే కూచిపూడి నృత్యం, హై దరాబాద్‌కు చెందిన సాయి దంషిక కూచిపూడి నృ త్యం, ఖమ్మం రాయప్రోలు అలేఖ్య బృందంచే కచేరి ప్రదర్శించనున్నారు. తర్వాత వనంవారి కృష్ణాపురం వనం శ్రీముఖి, రఘుమయిచే నాట్య ప్రదర్శన ఉంటుంది. హైదరాబాద్‌ జనత సేవా సమితి వారిచే భక్త రామదాసు నాటకం ఉంటుంది. పర్ణశాలలో పెబ్బేరుకు చెందిన హెచ్‌ఎం సుధాకర్‌చే శ్రీరామ పట్టాభిషేకం హరికథ ఉంటుంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top