నాడు వాల్‌ రైటింగ్‌..  నేడు సోషల్‌ మీడియా  

Wall Writing,Stitch To Election Posters Election Commission Permission Is Mandatory In Election Time - Sakshi

సాక్షి, దమ్మపేట: ఎన్నికల సందర్భంగా ప్రచారం కోసం నిర్వహించే ప్రతి కార్యక్రమానికీ లెక్కలు చెప్పాల్సిందేనని అప్పటి ఎన్నికల ప్రధానాధికారి టీఎన్‌ శేషన్‌ ఆదేశించారు. అప్పటి నుంచి ఎన్నికల ప్రచార తీరులో మార్పులు సంతరించుకుంటూ వస్తున్నాయి. అధికార యంత్రాంగం కూడా నిఘా ఉంచడంతో సమావేశాలను ఆత్మీయ సమ్మేళనాలుగా, విందులను సహపంక్తి భోజనాలుగా పేర్లు మార్చుతూ గుట్టుచప్పుడు కాకుండా జరుపుతున్నారు.  

గోడలపై రాతలు  
ఎన్నికలంటే గోడలపై రాతలు.. అభ్యర్థుల ఫొటోలు ఉన్న పోస్టర్లు.. పగలు, రాత్రి మైకుల హోరు, రోడ్ల పొడవునా బ్యానర్లు తోరణాల్లాగా కట్టేవారు. పరీక్షల సమయంలోనూ చదువుకునే విద్యార్థులు సైతం మైకుల హోరు భరించలేక గ్రామాలకు దూరంగా వెళ్లిపోయేవారు. ఖాళీ ప్రదేశాల్లో చదువుకునేవారు. ఇదంతా ఒకప్పటి ఎన్నికలు.  

అనుమతులు తప్పనిసరి
గోడలపై రాతలు రాయాలన్నా, ప్రచార పోస్టర్లు వేయించాలన్నా, బ్యానర్లు కట్టాలన్నా, మైకు హోరెత్తించాలన్నా ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. వాహనాల్లో తిరగాలంటే వ్యయం ఎంతో చెప్పాల్సిందే. గోడలపై రాతలకు సంబంధిత యాజమాని అనుమతి ఉండాల్సిందే. అయితే ప్రస్తుతం గోడలపై రాతలు దాదాపుగా ఎవరూ రాయడంలేదు. ఇటీవల వరకు ఫ్లెక్సీలు పెట్టేవారు. ఇప్పుడు అవి కూడా తగ్గిపోతున్నాయి. ప్రచార రథాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు.  

సోషల్‌ మీడియాలోనూ.. 
ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్‌ ఫోన్లు ఉండటంతో అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని మెసేజ్‌ల ద్వారా కోరుతున్నారు. ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారం, ముందస్తు సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. కొందరు పంపే ఫొటోలు, అభ్యర్థులపై వ్యంగ్య వ్యాఖ్యలు ఇబ్బంది కలిగిస్తున్నాయని పలువురు ఓటర్లు వాపోతున్నారు.  

విద్యార్థుల వద్దకు.. 
విద్యార్థులకు ప్రస్తుతం పరీక్ష కాలం. అభ్యర్థులకు కూడా ఐదేళ్ల భవితవ్యం నిర్ణయించే ఎన్నికలు పరీక్ష వంటిదే. దాంతో యువత ఎక్కడ ఉంటారో అక్కడికి ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు వెళుతున్నారు. ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. మీ ఓటుతో పాటు మీ ఇంటనున్న వారికి, చుట్టుపక్కల వారికి చెప్పి తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయించాలంటూ కోరుతున్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top