పల్లెసీమకు ఇక సర్పంచ్‌ కింగ్‌

Village sarpanch is the king here after - Sakshi

హోంశాఖ మంత్రి నాయిని 

వచ్చే నెలలో పంచాయతీరాజ్‌ బిల్లు 

మంత్రి హరీశ్‌రావు మాకు బాహుబలి

సిద్దిపేట జోన్‌: గ్రామ సర్పంచ్‌లు పల్లెసీ మలకు ఇక కింగ్‌ లాంటి వారని, వచ్చే నెలలో పంచాయతీరాజ్‌ బిల్లు రానుందని, నిధులు పుష్కలంగా వస్తాయని గ్రామం ఆర్థికంగా బలోపేతంతోపాటు అభివృద్ధి మరింత వేగవంతంగా జరిగేందుకు ఆస్కారం ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. సిద్దిపేట జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆదివారం ఢంకా బజాయించి (బ్యాండ్‌ కొట్టి) అధికారికంగా ప్రకటించారు.

అంతకుముందు పట్టణంలో నిర్వహించిన జాబ్‌ మేళాలో మంత్రులు పాల్గొన్నారు. నాయిని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పంచాయతీరాజ్‌ బిల్లును తీసుకురానున్నారని, మరో మూడు వారాల్లో ఈ బిల్లు రానుందన్నారు. ఇప్పటికే 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని మరో 1.12 లక్షల ఉద్యోగాలను ఇవ్వనున్నామన్నారు. శాంతి పరిరక్షణలో తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందన్నారు. అందుకే దేశవిదేశాలకు చెందిన పెట్టుబడిదారులు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నారని, ఇప్పటికే 2,500 పరిశ్రమల ద్వారా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు.  

హరీశ్‌రావే మాకు బాహుబలి..
మాకు కూడా బాహుబలి ఉన్నాడని.. యువ నాయకుడు హరీశ్‌రావే మాకు బాహుబలి లాంటి వాడని పరోక్షంగా కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలపై నాయిని ఆదివారం చమత్కరిస్తూ మాట్లాడారు. స్థానిక రెడ్డి సంక్షేమ భవన్‌ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ భూమి మీద నమ్మకం ఉన్న వారికే మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లా జైలుకు రూ.65 కోట్లు రానున్నాయని, వాటిని బడ్జెట్‌లో పెట్టామని, అత్యాధునిక వసతులతో జైలు నిర్మాణాన్ని చేపడుతామని మంత్రి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా పారిశుద్ధ్య జిల్లాగా మారడం అభినందనీయ మని, ఇది గొప్ప విజయంగా అభివర్ణించారు.

ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం..
సిద్దిపేట ప్రజలు పట్టుదలకు మారు పేరని, అధికారుల, ప్రజాప్రతినిధుల, ప్రజల సమష్టి కృషికి ఫలితంగా బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మారడం సంతోషంగా ఉందని, ఇదే స్పూర్తిని ముందుకు కొనసాగించాలని, అందుకు మరో గురుతర లక్ష్యాన్ని ఎంచుకుందామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఓడీఎఫ్‌ జిల్లాగా అధికారిక ప్రకటన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలోని 399 గ్రామాల్లో వైకుంఠ ధామాలను నిర్మించి దేశంలోనే వంద శాతం వైకుంఠధామాలు గల జిల్లాగా సిద్దిపేటకు రికార్డును సొంతం చేద్దామని పిలుపునిచ్చారు. అందుకు నేటి నుంచి మరో 75 రోజుల్లోగా లక్ష్యాన్ని ఎంచుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వంద శాతం వైకుంఠధామాలు ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top