కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం నిర్ణయం

Vikarabad Merge Celebration In TRS Cadre In Rangareddy - Sakshi

సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు: వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆనంద్‌

సాక్షి, అనంతగిరి: జిల్లాను జోగులాంబ నుంచి చార్మినార్‌ జోన్‌లోకి మారుస్తామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం నిర్ణయం తీసుకున్నారని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ తెలిపారు. జోన్‌ విలీనంపై వికారాబాద్‌లోని ఎన్‌టీఆర్‌ చౌరస్తాలో బుధవారం టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి మిఠాయిలు తినిపించుకుని సంబురాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తనను గెలిపిస్తే చార్మినార్‌ జోన్‌లో కలిపి బహుమానంగా ఇస్తానని సీఎం కేసీఆర్‌ చెప్పి ఇప్పుడు నెరవేర్చారని తెలిపారు. నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌కు దగ్గరగా ఉండడంతో ఇక్కడి ఉద్యోగులు, యువకుల, నిరుద్యోగుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని చార్మినార్‌ జోన్‌లో కలిపారని వివరించారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను వెంటనే చేపట్టి జిల్లా ప్రజలకు సాగునీరు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ రమేశ్‌కుమార్, నాయకులు సురేశ్, విజయ్‌కుమార్, మంచన్‌పల్లి సురేశ్, కృష్ణయ్య, ముత్తాహార్‌ షరీఫ్, రమేశ్‌గౌడ్, రాజమల్లయ్య, దత్తు, దీపు, కడియాల వేణు, గోపాల్, అనంత్‌రెడ్డి, రంగరాజు తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్‌ను కలిసిన జెడ్పీ వైస్‌ చైర్మన్‌
అనంతగిరి: వికారాబాద్‌ను చార్మినార్‌ జోన్‌లో కలపడంతో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ బైండ్ల విజయ్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్‌చార్జి బాలమల్లు, సీనియర్‌ నాయకులు శుభప్రద్‌పటేల్‌తో కలిసి బుధవారం కేటీఆర్‌ను కలిశారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని చార్మినార్‌ జోన్‌లో కలిపారని, జిల్లా ప్రజలు రుణపడి ఉంటారని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top