విధుల్లో చేరం.. సమ్మె ఆపం

TSRTC Strike: RTC JAC Says Strike Continues - Sakshi

మాది చట్టబద్ధమైన ఉద్యమం

బెదిరింపు ధోరణి ఆపి చర్చల ప్రక్రియ మొదలుపెట్టండి

డిమాండ్లపై పట్టువిడుపులకు మేం సిద్ధం

ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆర్టీసీ కార్మికులను బెదిరించే ధోరణి మానేసి ఇప్పటికైనా చర్చలకు సిద్ధం కావాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పేర్కొంది. చర్చలకు ఆహ్వానిస్తే ఏయే డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరిస్తుందో, ఏయే డిమాండ్ల విషయంలో జేఏసీ పట్టువిడుపులను ప్రదర్శిస్తుందో స్పష్టమవుతుందని, అది ఆర్టీసీ సమ్మెకు పరిష్కారంగా మారుతుందని పేర్కొంది. ఈ నెల ఐదో తేదీ అర్ధరాత్రిలోపు కార్మికులు విధుల్లోకి రావాలని, రాని వారికి ఇక ఆర్టీసీతో సంబంధం ఉండదన్న ముఖ్య మంత్రి తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ డెడ్‌లైన్‌ను కార్మికులు పట్టించుకోరని తేల్చిచెప్పింది. తమ డిమాండ్లకు పరిష్కారం రానంతవరకు సమ్మెను ఆపబోమని స్పష్టం చేసింది. ఆర్టీసీలో 5,100 మార్గాలను ప్రైవేట్‌కు కేటాయిం చటం, ఐదో తేదీ నాటికి విధుల్లో చేరని కార్మికులను ఇక తీసుకోబోమంటూ డెడ్‌లైన్‌ విధింపు, ఐదు వేల బస్సులకే ఆర్టీసీ పరిమితం... తదితర విషయాలపై శనివారం కేసీఆర్‌ ప్రకటన చేసిన నేపథ్యంలో, ఆర్టీసీ జేఏసీ ఆదివారం ఉదయం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. అనంతరం జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి, కో–కన్వీనర్‌ రాజి రెడ్డి, సుధ తదితరులు మీడియాతో మాట్లాడారు.

తాము ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లపై చర్చలకు సిద్ధమై, వాటికి పరిష్కార మార్గాలు చూపనంతవరకు సమ్మెను ఆపబోమని నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించాలన్న రహస్య ఎజెండాను మనసులో పెట్టుకుని ముఖ్యమంత్రి కార్మికులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం బెదిరింపులకు కార్మికులెవరూ భయపడొద్దని, 49 వేల మంది ఉద్యోగాలు తొలగించే హక్కు ఎవరికీ లేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికే ఖరారు చేసిన సమ్మె కార్యాచరణ అలాగే కొనసాగుతుందన్నారు. ఆర్టీసీ కార్మికులను బిడ్డలుగా భావిస్తున్నానని అన్నందుకు సీఎంకు ధన్యవాదాలు చెబుతున్నామని, కానీ ఆయన ఒకవైపు బిడ్డలు అంటూనే మరోవైపు కార్మికులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఏదో ఓ కమిటీ వేసి తమ డిమాండ్లపై చర్చించాలని పేర్కొన్నారు. మేం అన్ని డిమాండ్లపై పట్టుపట్టి కూర్చోమని, చర్చల్లో పట్టువిడుపులకు అవకాశం ఉంటుందన్నారు. తమది సీఎం చెబుతున్నట్లుగా చట్ట విరుద్ధ సమ్మె కాదని, చట్టబద్ధమైందేనని పునరుద్ఘాటించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో లీగల్‌ లేదు ఇల్లీగల్‌ లేదు, సమ్మె సమ్మెనే అన్న కేసీఆర్, తెలంగాణ వచ్చాక సమ్మె విషయంలో మాటమార్చడం సబబు కాదన్నారు. ఆర్టీసీకి బకాయిలు లేవు అనటం కూడా సరికాదని, దానిపై రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపిస్తే నిజాలు వెలుగు చూస్తాయన్నారు. 

23 వేల మందికి కూర్చోబెట్టి జీతాలిస్తారా?..
కేవలం 5 వేల బస్సులే ఆర్టీసీలో ఉంటాయన్న ముఖ్యమంత్రి లెక్కల ప్రకారం 28 వేల మంది కార్మికులు సరిపోతారని, మరి మిగిలిన 23 వేల మందికి పని ఉండదని, వారిని కూర్చోబెట్టి జీతాలిస్తారా అని ప్రశ్నించారు. 97 డిపోలకు గాను 48 డిపోలే సరిపోతాయని, మిగిలిన డిపోల డీఎంల పరిస్థితి ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా డీఎంల నుంచి ఈడీల వరకు బయటకొచ్చి తమతో కలసి సమ్మె చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం రిజర్వేషన్‌ రోస్టర్‌ అమలు ఆర్టీసీలో పక్కాగా జరుగుతోందని, సగం రూట్లను ప్రైవేటీకరించాక వచ్చే ప్రైవేటు సంస్థలు వాటిని అమలు చేస్తాయా అని ప్రశ్నించారు. అప్పుడు రిజర్వేషన్ల పద్ధతికే విఘాతం కలుగుతుందన్నారు. యూనియన్ల నుంచి కార్మికులను దూరం చేసేలా ముఖ్యమంత్రి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దాన్ని కార్మికులు గుర్తించాలని కోరారు. ఆర్టీసీలో రూ.650 కోట్ల డిప్రిసియేషన్‌ ఫండ్‌ ఉంటుందని, అది ఎక్కడుందో తేల్చి దానితో కొత్త బస్సులు కొనాలని సూచించారు. ఆర్టీసీ నష్టాలు కేంద్రం భరించే అవకాశం ఉండదన్నారు. 

జీతాలివ్వకుంటే పరిస్థితేంటి?...
కార్మికులు బేషరతుగా విధుల్లో చేరాలంటున్నారని, రేపు జీతాలకు డబ్బులేదు ఇవ్వలేమంటే అప్పుడు వారు ఏం చేయాలని ప్రశ్నించారు. నష్టాలొచ్చే రూట్లను ప్రైవేట్‌ ఆపరేటర్లకు ఇస్తామని సీఎం అన్నారని, కానీ నష్టాలొచ్చే రూట్లు తీసుకునేందుకు వారు పిచ్చివాళ్లా అని ప్రశ్నించారు. అందుకే కార్మికులు వాస్తవాలు గుర్తించి సమస్య పరిష్కారమయ్యేవరకు సమ్మెలో ఉండాలని, ఆత్మద్రోహం చేసుకుని పిరికివారిలా పారిపోవద్దని సూచించారు. గతంలో ముఖ్యమంత్రి ఇలాగే డెడ్‌లైన్‌లు విధించారని, ఎవరూ చలించలేదని, ఇప్పుడు కూడా ఒకటి రెండు శాతం మంది విధుల్లో చేరినా మిగతావారు సమ్మెలోనే ఉంటారన్నారు. చాలా ప్రాంతాల నుంచి కార్మికులు తమకు ఫోన్‌ చేసి సమ్మెను కొనసాగించాలని పేర్కొంటున్నారని, ఆపితే ఖబడ్దార్‌ అంటూ హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు.

రోడ్డు దిగ్బంధం వాయిదా 
ఐదో తేదీన రోడ్డు దిగ్బంధం కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నామని, ఆ రోజు న్యాయస్థానాలకు సంబంధించిన పోస్టుల భర్తీ పరీక్ష ఉన్నందున, అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top