‘పబ్లిక్‌ సర్వీస్‌’కు పరీక్ష! | TSPSC was confusing by many problems | Sakshi
Sakshi News home page

‘పబ్లిక్‌ సర్వీస్‌’కు పరీక్ష!

Published Thu, Feb 22 2018 2:15 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

TSPSC was confusing by many problems - Sakshi

ఇందులోనూ నోటిఫికేషన్‌ ప్రక్రియను పర్యవేక్షించే అధికారులు, సిబ్బంది 25 మందే.. సొంత డేటా సెంటర్‌ లేదు.. ఏర్పాటు చేసుకుందామనుకున్నా స్థలం లేదు.. ఇదీ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దుస్థితి. లక్షలాది మంది ఉద్యోగ అభ్యర్థులతో ముడిపడిన ఈ సంస్థ కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది.       

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ భర్తీ పరీక్షలు నిర్వహించే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌నే ఉద్యోగుల కొరత వేధిస్తోంది. ఉద్యోగ నియామకాల ప్రక్రియను ఆన్‌లైన్‌లో నిర్వహించే ఐటీ సెంటర్‌ లేక తంటాలు పడుతోంది. ఏర్పాటై మూడేళ్లవుతున్నా సమస్యలతోనే కొట్టుమిట్టాడుతోంది. 240 మంది ఉద్యోగులు కావాలంటూ టీఎస్‌పీఎస్సీ ఏడాది కిందే ప్రభుత్వానికి రాసినా.. ఇప్పటికీ ఒక్క పోస్టు కూడా మంజూరు చేయలేదు. ఐటీ సెంటరైనా ఏర్పాటు చేసుకుందామంటే ఏపీపీఎస్సీ కొర్రీలు పెడుతోంది. తమ భవనంలోనే మూడు అంతస్తులు ఖాళీగా ఉన్నా వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. సొంత డేటా ప్రాసెసింగ్‌ సెంటర్‌ లేక.. ఆన్‌లైన్‌ ప్రాసెస్‌ ప్రక్రియను సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌కు (సీజీజీ) అప్పగించి.. అక్కడి సిబ్బంది చేసే పొరపాట్లతో టీఎస్‌పీఎస్సీ అభాసు పాలవుతోంది. 

విభజన నాటి నుంచే.. 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన పూర్తయిన కొద్ది నెలల తరువాత తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీని ఏర్పాటు చేసింది. అప్పటి ఏపీపీఎస్సీలోని 400 మంది అధికారులు, సిబ్బందిలో 110 మందిని టీఎస్‌పీఎస్సీకి కేటాయించారు. ఇందులోనూ అధికారి స్థాయి పోస్టుల కంటే నాలుగో తరగతి సిబ్బంది పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. అయితే తొలుత నియామకాలేవీ పెద్దగా చేపట్టకపోవడంతో ఎలాగోలా నెట్టుకొచ్చింది. కానీ 2015 డిసెంబర్‌ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ, పరీక్షల ప్రక్రియలు వేగం పుంజుకోవడంతో సిబ్బంది కోసం ప్రభుత్వంపై ఒత్తిడి మొదలుపెట్టింది. చివరకు ఈ అంశంపై రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వీరభద్రయ్య నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పరిశీలన జరిపి.. టీఎస్‌పీఎస్సీలో కనీసం 350 మంది ఉద్యోగులు ఉండాలని, మరో 240 పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ ఇప్పటివరకు ఒక్క పోస్టు కూడా మంజూరు చేయలేదు. వాస్తవానికి టీఎస్‌పీఎస్సీకి 240 పోస్టులు ఇవ్వలేమని.. 95 పోస్టులను మాత్రమే ఇస్తామని జీఏడీ, ఆర్థిక శాఖ అధికారులు మౌఖికంగా స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే ఈ మేరకు పోస్టులైనా మంజూరు కాకపోవడం గమనార్హం. దీంతో కేవలం 25 మంది వరకున్న అధికారులు, సిబ్బందే మొత్తం నోటిఫికేషన్ల ప్రక్రియలను చూసుకోవాల్సి వస్తోంది. 

సీజీజీ పొరపాట్లతో తలనొప్పులు 
సిబ్బంది కొరత ఓ వైపు వేధిస్తుంటే.. అభ్యర్థుల డేటా ప్రాసెసింగ్‌ చేస్తున్న సీజీజీలోని కొందరు సిబ్బంది తప్పులు టీఎస్‌పీఎస్సీ తలనొప్పిగా పరిణమిస్తున్నాయి. ముఖ్యంగా 2011 గ్రూప్‌–1 పోస్టింగ్‌ల విషయంలో సీజీజీ సిబ్బంది చేసిన తప్పుల కారణంగా టీఎస్‌పీఎస్సీ అభాసుపాలైంది. అందులో మెరిట్‌ అభ్యర్థులకు పోస్టులు రాకపోవడం, అనర్హులు ఎంపిక కావడం, తక్కువ మెరిట్‌ ఉన్న వారికి ప్రాధాన్య పోస్టులు రావడం వంటివి జరిగాయి. చివరికి ఆ డేటా మొత్తాన్ని టీఎస్‌పీఎస్సీ పరిశీలించి, తప్పిదాన్ని సవరించింది. ఇక గురుకుల లెక్చరర్ల పోస్టుల మెయిన్‌ పరీక్షకు 1ః15 నిష్పత్తిలో ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాలో తప్పులు దొర్లడం, ఉపాధ్యాయ నియామక పరీక్ష కేంద్రాల కేటాయింపులో పొరపాట్లు దొర్లడం వంటి సమస్యలూ తలెత్తాయి. 

ఐటీ సెంటర్‌కు స్థల సమస్య 
డేటా ప్రాసెసింగ్‌ సమస్యల నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ సొంతంగా ఆన్‌లైన్‌ డేటా ప్రాసెస్‌ చేసే ఐటీ సెంటర్‌ను ఏర్పాటు చేసుకుంటామని మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. దీంతో ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీ ఐటీ సెంటర్‌ కోసం రాష్ట్ర స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ (టీఎస్‌టీఎస్‌)కు రూ.4 కోట్లు కేటాయించింది. టీఎస్‌టీఎస్‌ ఇందుకు అవసరమైన పరికరాలను కూడా కొనుగోలు చేసింది. కానీ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న సమస్య వచ్చింది. టీఎస్‌పీఎస్సీలో స్థలం లేకపోవడంతో మరోచోట కేటాయించేందుకు మంత్రి కేటీఆర్‌ ఓకే చెప్పారు. కానీ టీఎస్‌పీఎస్సీ ఒకచోట, డేటా సెంటర్‌ మరోచోట ఉంటే సెక్యూరిటీ సమస్యలు వస్తాయన్న సందేహం తలెత్తింది. ఇదే సమయంలో ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోయింది. దీంతో ఖాళీ చేసిన మూడు అంతస్తులను తమకు అప్పగించాలని ఏపీపీఎస్సీకి టీఎస్‌పీఎస్సీ విజ్ఞప్తి చేసింది. తాత్కాలికంగా ఐటీ సెంటర్‌ ఏర్పాటు చేసుకుంటామనీ కోరింది. అయినా ఏపీ సానుకూలంగా స్పందించకపోవడంతో ఐటీ సెంటర్‌ ఏర్పాటు ఆగిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement