కంది కొనుగోలుకు రూ.600 కోట్ల రుణం

TS Markfed haka decides to seek loan for Toor purchase - Sakshi

మార్క్‌ఫెడ్, హాకాల నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కంది కొనుగోలు, రైతు బకాయిల చెల్లింపులకు రూ.600 కోట్ల బ్యాంకు రుణం తీసుకోవాలని మార్క్‌ఫెడ్, హాకాలు నిర్ణయించాయి. రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు సిద్ధమవడంతో అందుకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం పొందిన ఫైలు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వద్దకు వెళ్లింది. సీఎం ఆమోదం రాగానే రుణానికి వెళ్లాలని మార్క్‌ఫెడ్, హాకాలు భావిస్తున్నాయి. రైతుల నుంచి రూ.762 కోట్ల విలువైన 1.55 లక్షల మెట్రిక్‌ టన్నుల కంది కొనుగోలు చేసి ఇప్పటివరకు రూ.262 కోట్లే చెల్లించారు.

దీంతో బకాయిలు, మున్ముందు కొనుగోలుకు రుణమే మార్గమని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రైతు పండించిన కందిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం పెడచెవిన పెట్టింది. కందిని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని మార్కెటింగ్‌ మంత్రి హరీశ్‌రావు పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర వ్యవసాయ మంత్రిని కలసి కోరారు. సీఎం కేసీఆర్‌ లేఖతో ఇటీవల ఆరుగురు ఎంపీలు కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలిశారు. కానీ స్పందన లేదు. 10 రోజుల క్రితం 1.13 లక్షల మెట్రిక్‌ టన్నుల కందులు కొంటామని సూత్రప్రాయంగా అంగీకరిస్తూ సమాచారం ఇచ్చిన కేంద్రం.. సీఎం లేఖ తర్వాత సాంకేతిక కారణాలు చూపించి 75,300 మెట్రిక్‌ టన్నులే కొంటామని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రి హరీశ్‌ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌విలాస్‌పాశ్వాన్‌కు లేఖ రాశారు. మరో లక్ష టన్నులు కొనాలని కోరారు. కానీ కేంద్రం నుంచి అనుమతి వస్తుందన్న ఆశ లేకపోవడంతో బ్యాంకు రుణం తీసుకోడానికి సర్కారు సిద్ధమైంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top