
రైతు సేవా కేంద్రాలకు ఒక బస్తా వచ్చుంటే ఒట్టు
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం
బఫర్ స్టాక్ కింద 2 లక్షల టన్నులు లక్ష్యం
ఇందుకు అవసరమైన నిధులు రూ.100 కోట్లు
బడ్జెట్‌లో కేటాయించింది రూ.40 కోట్లు
ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయని వైనం
గత ప్రభుత్వంలో ఏకంగా 13.31 లక్షల టన్నుల ఎరువులు సరఫరా
సాక్షి, అమరావతి: రైతు సేవా కేంద్రాల ద్వారా (ఇదివరకటి ఆర్బీకేలు) ఎరువుల సరఫరాకు టీడీపీ కూటమి ప్రభుత్వం మంగళం పాడుతోంది. గతేడాది అరకొరగా కేటాయింపులు జరిపిన మార్క్‌ఫెడ్, ఈ ఏడాది పూర్తిగా నిలిపి వేసే దిశగా అడుగులు వేస్తోంది. కారణం బఫర్ స్టాక్ స్కీమ్ కింద ఎరువుల నిల్వ కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులు ఏ మూలకూ సరిపోక పోవడమే కారణమని చెబుతున్నారు.
సాగు ఉత్పాదకాలు, సంక్షేమ ఫలాలు గ్రామ స్థాయిలో రైతుల ముంగిట అందించడమే కాదు.. రైతు సేవలన్నీ అన్నదాతల చెంతకు చేర్చడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన వీటిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఎరువుల సరఫరాకు ఏపీ మార్క్‌ఫెడ్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన బఫర్ స్టాక్ స్కీమ్ కింద ఎరువులను మార్క్‌ఫెడ్ గోడౌన్లలో నిల్వ చేసి, సొసైటీల ద్వారా సరఫరా చేసేవారు.
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సొసైటీలతో పాటు ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన ఎరువులను గ్రామ స్థాయిలో సరఫరాకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా రవాణా, లోడింగ్, అన్‌లోడింగ్ చార్జీల కింద బస్తాకు రూ.20 నుంచి రూ.50 వరకు రైతులకు ఆదా అయ్యేది. ఇలా నాలుగేళ్లలో దాదాపు రూ.60 కోట్లకు పైగా ఆదా అయ్యింది. గ్రామ స్థాయిలో నిల్వ చేసేందుకు రవాణా, లోడింగ్, అన్‌లోడింగ్ హ్యాండ్లింగ్ చార్జీల కింద ఏటా రూ.80 కోట్లకు పైగా ఖర్చయ్యేది. ఈ భారాన్ని మొత్తం వైఎస్ జగన్ ప్రభుత్వం భరించేది.
ఏవీ నిధులు?
» ఏటా 1.50 లక్షల టన్నులు మార్క్‌ఫెడ్ ద్వారా బఫర్ స్టాక్ కింద నిల్వ చేసే వారు. డిమాండ్‌ను బట్టి సొసైటీలు, ఆర్బీకేలకు వీటిని సరఫరా చేసేవారు. గతేడాది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువుల సరఫరాలో నియంత్రణ లేకపోవడంతో రైతులు అదునులో ఎరువులు దొరక్క అవస్థలు పడ్డారు. ఈ ఏడాదైనా ముందస్తు ప్రణాళికతో సిద్ధమయ్యారా అంటే అదీ లేదు.
» ప్రస్తుతం గ్రామ స్థాయిలో 63 వేల టన్నుల నిల్వలున్నాయని ప్రభుత్వం చెబుతున్నా, ఒక్క ఆర్‌ఎస్‌కేలో ఒక్క బస్తా కూడా నిల్వ లేని దుస్థితి ఉంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా 2 లక్షల టన్నులను బఫర్ స్టాక్ కింద నిల్వ చేస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం అందుకు తగినట్టుగా నిధులు కేటాయించలేదు.
» కనీసం రూ.100 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదనలు పంపిస్తే బడ్జెట్‌లో రూ.40 కోట్లే కేటాయించారు. మిగిలిన రూ.60 కోట్ల కోసం పలుమార్లు ప్రతిపాదనలు పంపినా, ప్రభుత్వం నుంచి స్పందన లేదు. కేటాయించిన రూ.40 కోట్లూ ఇప్పటి వరకు విడుదల కాలేదు. మార్క్‌ఫెడ్‌కు రూ.250 కోట్ల బకాయిలపైనా ప్రభుత్వం మాట్లాడడం లేదు.
నాడు కంపెనీల నుంచి నేరుగా ఆర్బీకేలకు..
» వైఎస్ జగన్ ప్రభుత్వంలో దేశంలో మరెక్కడా లేని విధంగా ఆర్బీకేల ద్వారా ఎరువుల అమ్మకాలను ప్రోత్సహించే లక్ష్యంతో 10,611 ఆర్బీకేలకు లైసెన్సులు జారీ చేశారు. పంపిణీలో జాప్యాన్ని నివారించేందుకు కంపెనీల నుంచే నేరుగా ఆర్బీకేలకు సరఫరాకు ఏర్పాట్లు చేశారు. పైలట్ ప్రాజెక్టుగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అమలు చేయగా, సమయంతోపాటు రవాణా, హ్యాండ్లింగ్ చార్జీలు చాలా వరకు తగ్గాయి. గతంలో సొసైటీలకు ప్రాధాన్యం ఇస్తూనే ఆర్బీకేలకు ఏటా నిల్వలు పెంచుకుంటూ వెళ్లేవారు.
» ఇలా వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనాలుగేళ్లలో 34.11 లక్షల మంది రైతులకు 13.31 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేశారు. ఫలితంగా లోడింగ్, అన్‌లోడింగ్, రవాణా చార్జీల రూపంలో ప్రతి రైతుకు బస్తాకు రూ.20–30 చొప్పున ఆదా అయ్యింది. 2024 –25 సీజన్‌లోనూ 10 లక్షల టన్నుల ఎరువులను ఆర్బీకేల ద్వారా సరఫరాకు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
» అయితే సీజన్ ప్రారంభంలోనే పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) ద్వారా ఎరువుల సరఫరాను కుదించింది. ఫలితంగా గడిచిన ఖరీఫ్, రబీ సీజన్‌లు కలిపి 50 టన్నులు కూడా సరఫరా చేయలేని దుస్థితి ఏర్పడింది.