కారు హోరు.. యమజోరు

TRS Party Got Huge Seats In Medak District - Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉత్కంఠభరితంగా సాగిన శాసనసభ ఓట్ల లెక్కింపులో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు. సంగారెడ్డి మినహా మిగతా అన్ని స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. పటాన్‌చెరు నుంచి గూడెం మహిపాల్‌రెడ్డి, నారాయణఖేడ్‌ నుంచి ఎం.భూపాల్‌రెడ్డి వరుసగా రెండో పర్యాయం శాసనసభకు ఎన్నికయ్యారు. జహీరాబాద్‌ నుంచి కోనింటి మాణిక్‌రావు, అందోలు నుంచి చంటి క్రాంతి కిరణ్‌ తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నియ్యారు. సంగారెడ్డి నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్‌రెడ్డి ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో విజయం సాధించారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగిన బీజేపీ, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులు ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

ఉత్కంఠ భరితంగా ఓట్ల లెక్కింపు ..
పటాన్‌చెరు మండలం రుద్రారం గీతం యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన ఓట్ల లెక్కింపు మంగళవారం ఉత్కంఠ భరితంగా సాగింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను, నాలుగు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్‌రెడ్డి గెలుపొందారు. పటాన్‌చెరు నుంచి గూడెం మహిపాల్‌రెడ్డి, నారాయణఖేడ్‌ నుంచి ఎం.భూపాల్‌రెడ్డి వరుసగా రెండో పర్యాయం టీఆర్‌ఎస్‌ పక్షాన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు జహీరాబాద్‌ నుంచి కోనింటి మాణిక్‌రావు, అందోలు నుంచి పాత్రికేయుడు క్రాంతి కిరణ్‌ టీఆర్‌ఎస్‌ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన దిగ్గజ నేతలు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (అందోలు), గీతారెడ్డి (జహీరాబాద్‌) ఓటమి పాలయ్యారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో చివరి నిమిషంలో టికెట్‌ దక్కించుకున్న కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ పరాజయం పాలయ్యారు. నారాయణఖేడ్‌లో జరిగిన ముక్కోణపు పోరులో టీఆర్‌ఎస్‌ గెలుపొందగా, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ ఓటమి పాలయ్యారు. టీఆర్‌ఎస్‌ గెలుపొందిన నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు నారాయణఖేడ్, జహీరాబాద్, పటాన్‌చెరు, అందోలులో భారీ మెజారిటీతో తమ సమీప ప్రత్యర్థిపై పైచేయి సాధించారు.

బీఎల్‌ఎఫ్, ఇతరులు నామమాత్రమే
జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దించిన బీఎల్‌ఎఫ్‌ కూటమి, ఇతర పార్టీలు, స్వతంత్రులు ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులు ఎక్కడా మూడంకెల సంఖ్యకు మించి ఓట్లు సాధించలేదు. 25 ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఎవరూ ఓటర్లపై ప్రభావం చూపలేక పోయినట్లు ఓట్ల లెక్కింపులో బయట పడింది.

ప్రభావం చూపని బీజేపీ అభ్యర్థులు
జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను నిలిపినా, నారాయణఖేడ్‌ మినహా మిగతా నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితంపై పెద్దగా ప్రభావం చూపిన దాఖలా కనిపించలేదు. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం ఆశించిన సంజీవరెడ్డి నామినేషన్ల చివరి రోజున బీజేపీలో చేరి టికెట్‌ను దక్కించుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో సంజీవరెడ్డి మూడో స్థానంలో నిలిచినా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సురేశ్‌ షెట్కార్‌కు దీటుగా ఓట్లు సాధించారు. అందోలు నుంచి బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్, చివరి నిమిషంలో టికెట్‌ దక్కించుకున్న పటాన్‌చెరు అభ్యర్థి కరుణాకర్‌రెడ్డి పెద్దగా ఓట్లు సాధించిన పరిస్థితి కనిపించలేదు. జహీరాబాద్‌ నుంచి చివరి నిమిషంలో టికెట్‌ సాధించిన జంగం గోపి 15వేలకు పైగా ఓట్లను సాధించారు.

కారు.. జోరు
సాక్షి, సిద్దిపేట: శాసనసభ ఎన్నికల ఫలితాల్లో సిద్దిపేట జిల్లా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు సత్తా చాటారు. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాలతోపాటు, మానకొండూరు, జనగామ నియోజకవర్గాల్లో కూడా కారు జోరు కొనసాగింది.  సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో ప్రత్యర్థులకు కనీసం డిపాజిట్‌ కూడా దక్కకుండా పోయింది. పోలైన ఓట్లలో అన్ని నియోజవర్గాల్లో కలిపి మొత్తం 65శాతం ఓట్లు టీఆర్‌ఎస్‌కే వేసి మరోసారి కేసీఆర్‌ ప్రభుత్వంపై విశ్వాసాన్ని రుజువు చేశారు. జిల్లాలో నాలుగు స్థానాల్లో పోటీ చేసిన కమలనాథులు కనీసం రెండవ స్థానంలో కూడా రాలేకపోవడం గమనార్హం. కూటమి అభ్యర్థులు పోటీ చేసిన దుబ్బాక, సిద్దిపేటల్లో దుబ్బాక అభ్యర్థి.. స్వతంత్ర అభ్యర్థుల కన్నా వెనకబడి ఉండటం.. సిద్దిపేట అభ్యర్థి మాత్రం రెండవ స్థానంలో నిలబడటం గమనార్హం.

కారు స్పీడ్‌ను అందుకోలేని ప్రత్యర్థులు
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం సునాయాసంగా సాగింది. మొదటి రౌండ్‌ నుంచి చివరి రౌండ్‌ వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మెజార్టీ కొనసాగుతూ వచ్చింది. చివరి వరకు ఇదే తంతు కొనసాగడంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దరిదాపుల్లో కూడా లేకపోవడం కారు స్పీడుకు నిదర్శనం. సిద్దిపేట నియోజవర్గంలో మొత్తం 2,09,345 ఓట్లకు గాను 1,65,075 ఓట్లు పోల్‌ కాగా ఇందులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తన్నీరు హరీశ్‌రావుకు 1,31, 295 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి మహాకూటమి బలపరిచిన టీజేఏఎస్‌ అభ్యర్థి మరికంటి భవానీరెడ్డికి 12,596 ఓట్లు వచ్చాయి. దీంతో హరీశ్‌రావు 1,18,699 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి నరోత్తం రెడ్డి 11,266 ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గజ్వేల్‌ నియోకవర్గంలో మొత్తం 2,33,205 ఓట్లకు గాను 2,05,222 ఓట్లు పోలయ్యాయి.

వీటిల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు 1,25,444 ఓట్లు రాగా.. సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డికి 67,154 వచ్చాయి. దీంతో కేసీఆర్‌ 58,290 ఓట్ల మెజార్టీతో గెలిచారు.  దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 1,90,482 ఓట్లకు గాను 1,63,658 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్‌ సోలిపేట రామలింగారెడ్డికి 89,299 ఓట్లు రాగా.. సమీప అభ్యర్థి కాంగ్రెస్‌ పార్టీ నుండి రెబల్‌ అభ్యర్థిగా బరిలో దిగిన మద్దుల నాగేశ్వర్‌రెడ్డికి 26,799 ఓట్లు వచ్చాయి. దీంతో సోలిపేట రామలింగారెడ్డి 62,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మూడవ స్థానంలో భారతీయ జనతా పార్టీకి చెందిన రఘునందన్‌రావు 22,595 ఓట్లు వచ్చాయి. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం 2,22,431 ఓట్లకు గాను 1,85,003 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఒడితెల సతీష్‌కుమార్‌కు 1,17083 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి కూటమిలో భాగంగా సీపీఐ నుండి పోటీలో దిగిన చాడ వెంకట్‌రెడ్డికి 46,553 ఓట్లు వచ్చాయి.   జిల్లాలోని కొమురవెల్లి, మద్దూరు, చేర్యాల మండలాల్లో ప్రాతినిథ్యం వహించే జనగామ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి  సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్యపై 29,568 ఓట్ల మెజార్టీతో ముత్తిరెడ్డి విజయం సాధించారు.  

65 శాతం ఓట్లు టీఆర్‌ఎస్‌కే
జిల్లాలో పోలైన ఓట్లలో అత్యధికంగా 65శాతం ఓట్లు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకే పడటం గమనార్హం. జిల్లాలో మొత్తం 8,55,453 ఓట్లకు గాను 7,18,958 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సంగారెడ్డిలో జగ్గారెడ్డి గెలుపు
సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి ఉత్కంఠ పోరులో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, టీఆర్‌ఎస్‌ తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌పై 2,638 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కౌంటింగ్‌ ప్రారంభమైన తొలి రౌండ్‌ నుంచి జగ్గారెడ్డి తన సమీప ప్రత్యర్థిపై అతి తక్కువ ఓట్ల తేడాతో ఆధిక్యత చూపుతూ రావడం ఉత్కంఠను రేపింది. కేవలం తొలి ఒకటి రెండు రౌండ్లలో మాత్రమే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొంత ఆధిక్యతను కనబరిచినా, చివరి వరకు ఏ ఒక్క రౌండులోనూ కాంగ్రెస్‌పై పైచేయి సాధించలేకపోయారు. సంగారెడ్డిలో స్వతంత్ర అభ్యర్థిగా ట్రక్కు గుర్తుపై పోటీ చేసిన పోలీసు రామచంద్రయ్య ఏకంగా నాలుగు వేలకు పైగా ఓట్లు సాధించడం.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఫలితాన్ని ప్రభావితం చేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top