టీఆర్‌ఎస్‌ ‘తొలి టికెట్‌’ చరిత్రను మార్చిన జీవన్‌రెడ్డి 

TRS First Ticket Jeevan Reddy Success In Armoor - Sakshi

సాక్షి,ఆర్మూర్‌(నిజామాబాద్‌): టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటి టికెట్‌ కేటాయించిన అభ్యర్థి ఓటమి పాలవుతాడనే అపవాదును ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి చెరిపేశారు. టీఆర్‌ఎస్‌లో మొదటి అభ్యర్థి కూడా విజయం సాధిస్తాడని పార్టీ చరిత్రను తిరగ రాశారు. 2001లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం అనంతరం 2004లో తొలిసారిగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మొట్టమొదటి టికెట్‌గా ప్రకటించిన కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పాపారావ్‌ ఓటమి పాలయ్యారు.

2009 సార్వత్రిక ఎన్నికల్లోనూ కేసీఆర్‌ కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అసెంబ్లీ అభ్యర్థిగా సత్యనారాయణరెడ్డిని ప్రకటించారు. ఆయన కూడా ఓడిపోయారు. దీంతో టీఆర్‌ఎస్‌ అధినేత తొలి టికెట్‌ ప్రకటించిన అభ్యర్థి ఓటమి పాలవుతారనే ప్రచారం సాగింది. ఇలాంటి తరుణంలో 2013 ఏప్రిల్‌లో టీఆర్‌ఎస్‌ 13వ ఆవిర్భావ సభను పార్టీ ఆర్మూర్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆర్మూర్‌లో విజయవంతంగా నిర్వహించారు. దీంతో సభ అనంతరం జీవన్‌రెడ్డి ఇంటికి వచ్చి మరీ టీఆర్‌ఎస్‌ మొట్ట మొదటి అభ్యర్థిగా ఆర్మూర్‌ అసెంబ్లీ స్థానానికి జీవన్‌రెడ్డి పేరును ప్రకటించారు.

 
సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందుగానే తన అభ్యర్థి త్వాన్ని కేసీఆర్‌ ప్రకటించడమే కాకుండా పలు సభల్లో ‘జీవన్‌రెడ్డి నా కుడి భుజం’ అంటూ కేసీఆర్‌ ప్రకటించారు. ఇదే ఉత్సాహంతో జీవన్‌రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పార్టీ శ్రేణులను కూడగట్టి టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అయిన శాసనసభ మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేశ్‌రెడ్డిపై 13,461 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. దీంతో టీఆర్‌ఎస్‌లో మొదటి టికెట్‌ కేటాయించిన వ్యక్తి ఓటమి పాలవుతాడనే అపవాదును జీవన్‌రెడ్డి తుడిపేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top