మహబూబ్‌నగర్‌ క్లీన్‌ స్వీప్‌ !

TRS Clean Sweep In Mahabubnagar District - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : జిల్లాలో కారు జోరు సాగింది. జిల్లాలోని మొత్తం ఐదు స్థానాలను టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. గులాబీ సృష్టించిన సునామీకి ప్రతిపక్ష పార్టీలు చెల్లాచెదురయ్యాయి. ఎక్కడ కూడా ప్రతిపక్షాలు ఎదురొడ్డి నిలిచిన దాఖలాలు కనిపించలేదు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతీ రౌండ్‌లో కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దూసుకెళ్లారు. టీఆర్‌ఎస్‌ ధాటికి కాంగ్రెస్, టీడీపీ ఎక్కడా పోటీలో నిలవలేక చేతులెత్తేశాయి. ఇదిలా ఉంటే.. ఈసారి ఓట్లే కాదు సీట్లు సైతం గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేసిన బీజేపీ సైతం బేల మొహం వేసింది. పోటీ చేసిన చోటల్లా బీజేపీ నేతలకు డిపాజిట్లు కూడా దక్కకపోవడం గమనార్హం. మరోవైపు టీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం రికార్డు స్థాయిలో మెజార్టీలు సాధించారు.  

కారు.. టాప్‌ గేరు
మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అయిదు స్థానాల్లో ‘కారు’ టాప్‌గేర్‌లో దూసుకెళ్లింది. అన్ని చోట్ల కూడా రికార్డు స్థాయిలో మెజార్టీతో గెలుపొందింది. పోలైన ఓట్లలో మూడో వంతు శాతం టీఆర్‌ఎస్‌ నేతలకే దాఖలయ్యాయి. ఫలితంగా మిగతా పార్టీలకు చెందిన అభ్యర్థులు ఘోరమైన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే వి.శ్రీనివాస్‌గౌడ్‌ రికార్డు స్థాయిలో 57,775 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి బరిలో ఉన్న ఎర్ర శేఖర్‌ కేవలం 28,047 ఓట్లు మాత్రమే లభించాయి. అలాగే మక్తల్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిట్టెం రాంమోహన్‌రెడ్డికి మొదట్లో అసంతృప్త జ్వాలలు ఎదురైనా భారీ మెజార్టీతో గెలుపొందారు. మక్తల్‌లో ఆయన 47వేల పైచిలుకు మెజారిటీతో జిల్లాలో రెండో అత్యధిక మెజారిటీ సాధించారు. వీరితో పాటు జడ్చర్ల నుంచి బరిలో ఉన్న మంత్రి లక్ష్మారెడ్డికి 45వేల మెజార్టీ దక్కగా, దేవరకద్ర నుంచి పోటీ చేసిన ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి 34వేలు, నారాయణపేట నుంచి పోటీ చేసిన ఎస్‌.రాజేందర్‌రెడ్డికి 15వేల మెజార్టీతో గెలుపొందారు.  

రెండు చోట్ల వారే పోటీ
టీఆర్‌ఎస్‌ ధాటికి ఎదురొడ్డి రెండు నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థులే గట్టి పోటీ ఇవ్వడం గమనార్హం. నారాయణపేట, మక్తల్‌ నియోజకవర్గాల్లో స్వతంత్య్ర అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న ప్రధాన పార్టీలు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. నారాయణపేటలో కాంగ్రెస్‌ అభ్యర్థి పూర్తిగా చేతులెత్తేశారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సరాఫ్‌ కృష్ణ కేవలం 6,322 ఓట్లతో డిపాజిట్‌ సైతం కోల్పోయారు. పేటలో టీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా బీఎల్‌ఎఫ్‌ నుంచి పోటీ చేసిన కుంభం శివకుమార్‌రెడ్డి 53,307 ఓట్లు సాధించి గట్టి సవాల్‌ విసిరారు. అలాగే మక్తల్‌లో కూడా టీఆర్‌ఎస్‌కు ప్రధాన పార్టీలు ఎదురు నిలవలేకపోయాయి. స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసిన ఎం.జలేందర్‌రెడ్డి గట్టిపోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. ఇక జలేందర్‌రెడ్డి 29,841 ఓట్లు తెచ్చుకొని రెండో స్థానంలో నిలవగా.. మక్తల్‌లో పోటీ చేసిన టీడీపీ కేవలం 26,141 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమైంది.  

పోటీ ఇవ్వలేకపోయిన బీజేపీ
ఈసారి జిల్లాలో ఓట్లతో పాటు సీట్లు సైతం గెలుపొందాలని గంపెడాశలు పెట్టుకున్న బీజే పీకి తీవ్ర నిరాశే ఎదురైంది. పోటీ చేసిన ఐదు స్థానాల్లో కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. కేవలం నారాయణపేట, మక్తల్‌లో మాత్ర మే డిపాజిట్లు తెచ్చుకుంది. మిగతా మూడు చోట్ల మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్రలో డిపాజిట్లు సైతం కోల్పోయింది. మహబూబ్‌నగర్‌లో పోటీ చేసిన అభ్యర్థి కేవలం 5,704 ఓట్లు మాత్రమే దక్కాయి. అలాగే జడ్చర్ల నుంచి బరిలో ఉన్న అభ్యర్థికి 3,574, దేవరకద్ర నుంచి బరిలో ఉన్న అభ్యర్థికి 4,972 మాత్రమే ఓట్లు పడ్డాయి. కాస్త నయంగా నారాయణపేట నుంచి బరిలో ఉన్న రతంగ్‌పాండు రెడ్డికి 19,969 ఓట్లు పోలయ్యాయి. అలాగే మక్తల్‌ నుంచి పోటీ చేసిన కొండయ్యకు 19,801 ఓట్లు వచ్చాయి. ఇలా వీరిద్దరు మాత్రమే జిల్లాలో డిపాజిట్లు దక్కించుకున్నారు. మిగతా ముగ్గు రు డిపాజిట్లు సైతం కోల్పోయారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top