సాగునీటి ప్రాజెక్టులకు చికిత్స: కేసీఆర్ | treatment to irrigation projects | Sakshi
Sakshi News home page

సాగునీటి ప్రాజెక్టులకు చికిత్స: కేసీఆర్

Mar 14 2015 2:15 AM | Updated on Aug 14 2018 10:51 AM

హైదరాబాద్: తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు రీ ఇంజనీరింగ్ చేయాల్సిన అసవరముందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ దిశగా ప్రతిపక్షాలను కలుపుని చర్యలు తీసుకుంటామన్నారు.

హైదరాబాద్: తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు రీ ఇంజనీరింగ్ చేయాల్సిన అసవరముందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ దిశగా ప్రతిపక్షాలను కలుపుని చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ పరిధి లో నిర్మించే ప్రాజెక్టులను కూడా తెలంగాణకు ఉపయోగపడే వీలులేకుండా చేశారని ఆరోపించారు. గతంలో ప్రతిపాదించి కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టుల డిజైన్లు కూడా అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎల్పీ నేత జానారెడ్డి సాగునీటి ప్రాజెక్టుల్లోని లోపాలను సోదాహరణంగా లేవనెత్తారు.

 

ఆ సమయంలో సభలో లేని సీఎం.. జానా కీలకాంశాలను లేవనెత్తుతుండటంతో సభలోకి వచ్చి ఆయన ప్రసంగంలో జోక్యం చేసుకున్నారు. ‘‘జానారెడ్డి లేవనెత్తిన విషయాలు పూర్తిగా నిజం. అవి చాలా కీలకాంశాలు, ఈ సందర్భంగా నేను కఠోర సత్యాన్ని చెబుతున్నాను. దానిపై అందరూ ఆలోచించాలి. నేను బాధ్యతతో, సమగ్రంగా తెలుసుకుని మాట్లాడుతున్నాను. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో చేపట్టిన కొన్ని ప్రాజెక్టులు ఈ ప్రాంతం విషయంలో ఫక్తు క్రూర పరిహాసం తప్ప చిత్తశుద్ధితో తీసుకున్నవి కాదు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ విషయంలో ఖమ్మం జిల్లాను పరిహసించారు. అక్క డ లిఫ్ట్‌తో నీళ్లు తెచ్చి కాల్వలో పోస్తమన్నరు. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌తో తెలంగాణకు ఏం ప్రయోజనముంది? భూమి మనదే. కానీ చుక్క నీళ్లు రావు. ఓ కాగితం ఇయ్యలే. పునాది వెయ్యలే. ఇలా సాగింది తెలంగాణ ప్రాజెక్టుల సంగతి. తెలంగాణలో కీలకమైన ఎస్సారెస్పీ ప్రాజెక్టును జాబితాలో మూలకుపెట్టిండ్రు. చెన్నారెడ్డి సీఎంగా ఉండగా కోటిరెడ్డి అనే ఇంజనీరు చొరవతో అది ముందుకొచ్చి సాకారమైం ది. తాజా ప్రణాళిక ప్రకారం ప్రాణహిత 116 కిలోమీటర్లు సాగిన తర్వాత గాని దాని నీళ్లు ఎల్లంపల్లికి చేరుకోవు. ఇందుకు రూ.18,800 కోట్లు ఖర్చు చేయాలి.

 

వెరసి ప్రాణహిత ప్రాజెక్టు ఓ పెద్ద జోక్‌గా మారింది. కానీ దీనికీ మెరుగైన ప్రత్యామ్నాయముంది. ఇది ఇటీవల మహారాష్ట్ర సీఎంతో చర్చ సందర్భంగా కూడా ప్రస్తావనకొచ్చింది’’ అని సోదాహరణంగా వివరించారు. ‘‘అందుకే జానారెడ్డి సూచనలు శిరోధార్యమంటున్న. తక్కువ ఖర్చుతో వెంటనే పూర్తయ్యే ప్రాజెక్టులకే మేమిప్పుడు ప్రాధాన్యమిస్తున్నం. మిగతావాటి విషయంలో ఏం చేద్దమనేది కలిసి కూసొని మాట్లాడి నిర్ణయించుకుందం. నక్కలగండి, పాలమూరు ఎత్తిపోతల పథకం, తడకపల్లి-పాములపర్తి ప్రాజెక్టు తదితరాల విషయంలో ప్రతిపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటం’’ అని వెల్లడించారు.
 ‘మీ వాళ్లు చెప్పిన పనులైనా ఫర్వాలేదు’
 చర్చ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు, జానారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రాధాన్యమున్న, ముఖ్యమైన చెరువుల పనులనే ముందుగా ప్రారంభించాలని జానా సూచిం చారు. ఆ క్రమంలో, ‘టీఆర్‌ఎస్ నేతలు చెప్పిన పనులనే ముందుగా తీసుకున్నా ఫర్వాలేదు’ అనడంతో హరీశ్ సుతిమెత్తగా తప్పుబట్టారు. ఈ విషయంలో తాము పార్టీలకతీతంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. తాము మరింత బాగా చేయలేదనే ప్రజలు తమను పక్కనపెట్టారంటూ జానా స్పందించారు. ప్రజల ఆకాంక్షను విస్మరించొద్దనే తాను చెబుతున్నానంటూ ముక్తాయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement