టీన్యూస్‌కు నోటీసులతో టీ.టీడీపీకి నష్టం! | telangana tdp leaders concern AP police notice issue | Sakshi
Sakshi News home page

టీన్యూస్‌కు నోటీసులతో టీ.టీడీపీకి నష్టం!

Jun 21 2015 11:07 AM | Updated on Aug 11 2018 4:50 PM

టీన్యూస్‌కు నోటీసులతో టీ.టీడీపీకి నష్టం! - Sakshi

టీన్యూస్‌కు నోటీసులతో టీ.టీడీపీకి నష్టం!

ఓటుకు కోట్ల కేసు కీలక దశకు చేరుకుంటున్న నేపథ్యంలో టీ న్యూస్ చానల్‌కు ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వడం తెలంగాణలో పార్టీకి నష్టం కలిగిస్తుందని...

సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్ల కేసు కీలక దశకు చేరుకుంటున్న నేపథ్యంలో టీ న్యూస్ చానల్‌కు ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వడం తెలంగాణలో పార్టీకి నష్టం కలిగిస్తుందని ఆ పార్టీ నేతలు చంద్రబాబు వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. శనివారం ఉదయం చంద్రబాబుతో సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, గరికపాటి మోహన్‌రావుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తెలంగాణలో ఏపీ ప్రభుత్వం, పోలీసులు జోక్యం వల్ల తమ మనుగడ కష్టమవుతుందన్న ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఇప్పటికే ఆంధ్ర పార్టీగా ముద్రపడ్డ టీడీపీ...రేవంత్ వ్యవహారంతో ఇబ్బందుల్లో పడిందని, ఇప్పుడు నేరుగా టీ న్యూస్ చానల్‌కు నోటీసులు ఇవ్వడం వల్ల తెలంగాణలో చంద్రబాబు జోక్యం పెరిగిందనే ప్రచారం ఎక్కువవుతుందని, దాంతో సెంటిమెంట్‌తో టీఆర్‌ఎస్ నేతలు టీడీపీని మరింత దెబ్బ కొడతారని వ్యాఖ్యానించినట్టు సమాచారం. అయితే చంద్రబాబు అందుకు ఒప్పుకోకుండా జరిగిన నష్టం ఎలాగూ జరిగిపోయిన నేపథ్యంలో ఎదురుదాడితోనే టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టొచ్చని చెప్పినట్లు సమాచారం.

టేపులు టీ న్యూస్‌కు ఎలా వచ్చాయో చెప్పాలని మీడియా సమావేశాలు పెట్టి ప్రశ్నించాలని బాబు ఆదేశించారని తెలిసింది. ఇక్కడ నష్టం జరిగినా ఏపీలో మేలు జరిగేలా వ్యవహరిస్తే కొద్దిరోజుల్లో సమస్య మరుగున పడుతుందని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.

కాగా, ఈ సమావేశానంతరం ఎర్రబెల్లి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీవీ9, ఏబీఎన్ చానల్స్‌ను తెలంగాణలో మూసేసినప్పుడు లేని బాధ సీఎం సొంత చానల్‌కు నోటీసులు ఇస్తే వచ్చిందా అని టీఆర్‌ఎస్ నేతలను ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసారాలు చేశారనే నోటీసులు ఇచ్చారని చెప్పారు. పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడే నైతిక అర్హత టీఆర్‌ఎస్‌కు లేదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement