Sakshi News home page

తర్వాత ఎవరి వంతో..!

Published Wed, Jul 8 2015 1:18 AM

తర్వాత ఎవరి వంతో..! - Sakshi

* ఓటుకు కోట్లు కేసులో టీటీడీపీ నేతల్లో గుబులు
* సండ్ర అరెస్ట్‌తో నాయకుల బెంబేలు

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ నేతలకు కంటి మీద కునుకు ఉండడం లేదు. ‘ఓటుకు కోట్లు’ కేసులో ఇరుక్కున్న ఎమ్మెల్యేలు పడుతున్న ఇబ్బందులను చూసి బెంబేలెత్తుతున్నారు. తాజాగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అరెస్టు చేయడం, కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో.. ఈ కేసుతో సంబంధాలు ఉన్న నేతలంతా తమ వంతు కూడా వస్తుందా అన్న భయంతో గడుపుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నెల రోజుల పాటు చర్లపల్లి జైల్లో గడిపి షరతులతో కూడిన బెయిల్‌పై బయటకు వచ్చారు. కేసుతో సంబంధం ఉన్న ప్రతీ  ఒక్కరిని ఏసీబీ అరెస్టు చేసి విచారించడం ఖాయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టుతో తేలిపోయింది.
 
 సండ్రను ఏసీబీ విచారిస్తే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరికొందరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వేం నరేందర్‌రెడ్డిని ఇప్పటికే 2 పర్యాయాలు విచారించిన ఏసీబీ మరోసారి విచారణకు పిలవనుంది. ఆయనను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో టీడీపీలోని మరికొందరు నాయకులు ఆందోళనలో పడిపోయారు. తమ అభ్యర్థి గెలుపునకు అవసరమైన 2 ఓట్లకే పరిమితం కాకుండా, ప్రభుత్వాన్ని అస్థిర పరిచే వ్యూహంతో పెద్దఎత్తున ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధపడిందన్న సమాచారం బయటకు పొక్కిన సంగతి తెలిసిందే. కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో ఆయా జిల్లాల టీడీపీ నాయకులు కొందరు టచ్‌లోకి వెళ్లారని, కొందరికి డబ్బులు కూడా ముట్టాయని చెబుతున్నారు. ఇదే సమయంలో స్టీఫెన్‌సన్‌కు డబ్బులిస్తూ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడడంతో మిగిలిన వారంతా జాగ్రత్త పడినా.. టీడీపీ నాయకులు పన్నిన వ్యూహంపై ప్రభుత్వం ఆగ్రహంగానే ఉందని, ఈ కేసుతో పరోక్ష సంబంధం ఉన్న వారినీ ఉపేక్షించరన్న వార్తలతో టీటీడీపీ నేతలకు వెన్నులో చలి మొదలైంది. సండ్ర తర్వాత వేం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేస్తారని, ఇక ఆ తర్వాత వంతు ఎవరిదన్న చర్చ జరుగుతోంది.
 

Advertisement

What’s your opinion

Advertisement