బడికి వేళాయే..!

Telangana Govt Schools And Private Reopen - Sakshi

భువనగిరి : వేసవి సెలవుల్లో ఆటాపాటలతో హాయిగా గడుపుతున్న విద్యార్థులు బడికి వెళ్లే సమయం రానే వచ్చింది. నేటి నుంచి బడిగంట మోగనుంది. 2019–2020 విద్యా సంవత్సరం బుధవారం నుంచి ప్రారంభంకానుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున విద్యార్థుల సందడితో పండుగ వాతావరణం నెలకొనాలని రెండు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం విద్యా క్యాలెండర్‌ను 12రోజులు ముందుకు జరి పింది. కానీ అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వేసవి సెలవులను జూన్‌ 11వ తేదీ వరకు పొడిగించింది. దీంతో జూన్‌ 1వ తేదీన పునః ప్రారంభం కావాల్సిన పాఠశాలలు జూన్‌ 12న ప్రారంభమవుతున్నాయి. అలాగే 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగాల్సిన బడిబాటను కూడా 14 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

తొలిరోజున పాఠ్య పుస్తకాల పంపిణీ..
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తొలిరోజున పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలోని జిల్లా పరిషత్‌ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక, మోడల్, కేజీబీవీలకు ఇప్పటికే పాఠ్య పుస్తకాలు చేరాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 3,39,962 పుస్తకాలు అవసరం ఉండగా 3,12,950 పాఠ్య పుస్తకాలు పాఠశాలలకు చేరా యి. మరో 27,012 పుస్తకాలు రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రైవేట్‌ విద్యాసంస్థలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు విక్రయించడానికి వీలులేదు. ప్రైవేట్‌ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు విక్రయించడానికి భువనగిరిలో దత్తసాయి, చౌటుప్పల్‌లో ధనలక్ష్మి, బుక్‌స్టోర్‌లకు విద్యాశాఖ అధికారుల అనుమతి ఇచ్చారు.

14 నుంచి బడిబాట..
ఈనెల 14 నుంచి 19వ తేదీవరకు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి బడిలో చేర్పించేందుకు ఏటా ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. సుమారు ఆరు రోజులపాటు కొనసాగే బడిబాట కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు శాతం పెరిగే అవకాశం ఉంటుంది.

తగ్గని ఉష్ణోగ్రతలు..
జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. గరిష్టంగా 40 నుంచి 42 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలను పాఠశాలలకు పంపించడానికి తల్లిదండ్రులు జంకుతున్నారు. జూన్‌ 1వ తేదీన ప్రారంభించాల్సిన పాఠశాలలను అధిక ఉష్ణోగ్రతల కారణంగా సెలవులను 11వ తేదీ వరకు పొడిగించారు. అయినప్పటికీ ఉష్ణోగ్రతలు అదే విధంగా కొనసాగుతుండడంతో పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 

తొలిరోజు పాఠ్యపుస్తకాల పంపిణీ
పాఠశాలలు ప్రారంభం రోజున పాఠ్య పుస్తకాల పంపిణీ జరుగుతుంది. 14 నుంచి 19వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషిచేయాలి. యూనిఫాం కూడా ఇప్పటికే మండలాలకు చేరింది. – రోహిణి, డీఈఓ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top