ఎడిట్‌కు చాన్స్‌!

Teachers Transfer Process Edit Option For Mistakes Correction - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉపాధ్యాయుల బదిలీ దరఖాస్తుల్లో భాగంగా ఇచ్చిన వెబ్‌ ఆప్షన్ల సవరణలకు విద్యా శాఖ అనుమతినిచ్చింది. ఈ మేరకు బదిలీల వెబ్‌సైట్‌లో మార్పులు చేసింది. దరఖాస్తుల్లో తప్పులు దొర్లినట్లు భావించిన టీచర్లు నేటి నుంచి రెండ్రోజులపాటు వెబ్‌సైట్‌లో వాటిని సవరించుకోవాలి. గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్లు మంగళవారం (3వ తేదీన), సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (4వ తేదీన) బుధవారం.. వెబ్‌ ఆప్షన్లలో తప్పులు సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. తాజా సవరణ ప్రక్రియ కేవలం వెబ్‌ ఆప్షన్ల వరకే పరిమితం కానుంది. ఇతర అంశాల్లో సవరణ చేసుకునే వీలుండదు. ఈ మేరకు సాంకేతికంగా పక్కాగా ఏర్పాట్లు చేసింది. 

సుదీర్ఘ పరిశీలన అనంతరం.. 
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 75,318 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 74,890 దరఖాస్తులను పరిశీలించిన విద్యా శాఖ అధికారులు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఇందులో 72,719 మంది ఉపాధ్యాయులు మాత్రమే వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో వెబ్‌సైట్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో పెద్ద సంఖ్యలో పొరపాట్లు దొర్లాయి. వరుస క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకున్న తర్వాత ఫ్రీజ్‌ చేయడంతో ఆప్షన్ల వరుస క్రమం ఒక్కసారిగా గాడితప్పింది. దీంతో ఉపాధ్యాయులంతా ఆందోళనకు గురై విద్యా శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి పొరపాట్లతోపాటు కొందరు ఉపాధ్యాయులు అవగాహన లేకపోవడంతో ఆప్షన్ల నమోదులో తప్పులు చేశారు. దీంతో ఎడిట్‌కు అవకాశం ఇవ్వాలని విద్యాశాఖకు మొరపెట్టుకున్నారు. సుదీర్ఘ పరిశీలన చేసిన యంత్రాంగం ఎట్టకేలకు ఎడిట్‌కు అవకాశం కల్పించింది. 

వ్యక్తిగత ఫిర్యాదులపై తర్వాత..: కడియం 
బదిలీల ప్రక్రియ ముగిసిన తర్వాత వ్యక్తిగత ఫిర్యాదులపై స్పందిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కోరిక మేరకు వెబ్‌సైట్‌లో ఆప్షన్ల సవరణకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం సచివాలయంలో ఈ మేరకు సమీక్ష నిర్వహించారు. వెబ్‌ ఆప్షన్ల సవరణ కోసం వెబ్‌సైట్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ ఇస్తున్నట్లు తెలిపారు. అవకాశాన్ని ఉపాధ్యాయుల సద్వినియోగం చేసుకోవాలని, వెబ్‌ ఆప్షన్లలో తప్పులు దొర్లకుంటే అలాంటి టీచర్లు ఈ అంశాన్ని పట్టించుకోవద్దన్నారు. బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత వ్యక్తిగతంగా అభ్యంతరాలుంటే విద్యా శాఖ కమిషనర్‌కు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంతరం వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో టీచర్లు ఎన్‌టైటిల్‌మెంట్‌ పాయింట్లు పొందినట్లు విచారణలో తేలితే వారి బదిలీ ఉత్తర్వులు రద్దు చేయడంతోపాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

జాబితాలోని పొరపాట్లూ సరిదిద్దాలి 
వెబ్‌ ఆప్షన్లలో దొర్లిన తప్పులు సవరించేందుకు ప్రభుత్వం ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలోని తప్పులను, టీచర్ల అభ్యంతరాలను పరిశీలించి సవరించాలని డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు ఉపముఖ్యమంత్రిని సచివాలయంలో కలిసిన పలు సంఘాలు వినతులు సమర్పించాయి. సీనియార్టీ జాబితాలో అవకతవకలను సరిదిద్దాలని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.సరోత్తంరెడ్డి, డి.నర్సింహారెడ్డి డిమాండ్‌ చేశారు. బదిలీ కౌన్సెలింగ్‌లో సాంకేతిక లోపాలను సవరించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు భుజంగరావు, జి.సదానంద్‌గౌడ్‌ కోరారు. వెబ్‌ ఆప్షన్ల ఎడిటింగ్‌లో అవసరమున్న టీచర్లు మాత్రమే పాల్గొనాలని, దీంతో సర్వర్‌ ఇబ్బందులుండవని ఆర్‌యూపీపీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సి.జగదీశ్, ఎస్‌.నర్సిములు, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్‌ రాములు, చావ రవి సూచించారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top