టీడీపీ వాష్ ఔట్!


సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పెద్ద వ్యూహంతోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ దెబ్బకు తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఖాళీ అయింది. శాసన మండలిలో ఆ పార్టీని తమలో కలిపేసుకున్న టీఆర్‌ఎస్.. ఇప్పుడు అసెంబ్లీలోనూ టీడీపీని ఖాళీ చేసే దిశగా ఎత్తులు వేస్తోంది. ఆ పార్టీకి చెంది న ఎమ్మెల్యేలకు గులాబీ కండువాలు కప్పేస్తోంది. టీడీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి శుక్రవారం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.


ఇక గ్రేటర్ ఎన్నికల నాటికి మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్, మాధవరపు కృష్ణారావు కూడా గులాబీ గూటికి చేరడం ఖాయమని తెలుస్తోంది. ఇలా శాసనసభలో టీడీపీని మరింత బలహీన పర్చడం ద్వారా ఆ పార్టీ మానసిక ధైర్యాన్ని దెబ్బకొట్టి, రాష్ట్ర రాజకీయాల్లో నామమాత్ర పాత్రకు పరిమితం చేసే వ్యూహంతో టీఆర్‌ఎస్ వ్యవహరిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పార్టీలో మంత్రులుగా ఉన్న టీడీపీ మాజీల ద్వారా ఆ దిశగా పావులు కదిపి విజయం సాధిస్తోంది. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నా: మంచిరెడ్డి

 తమ జిల్లాతో పాటు, వెనుకబడిన తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానని టీడీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రకటించారు. మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, మహేందర్‌రెడ్డితో కలసి బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆయన సీఎం కేసీఆర్‌తో భేటీ అయి, చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాను ప్రజలకు జవాబుదారీగా ఉంటానని, వారి అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళుతున్నానని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చెప్పారు. టీడీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని తెలిపారు. తన అనుచరులతో కలిసి 24వ తేదీన టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు.

 

 మారనున్న బలాబలాలు..

 ఒక్కొక్కరుగా టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరిపోతుండడంతో శాసనసభలో పార్టీల బలాబలాలు మారిపోతున్నాయి. మార్చిలో బడ్జెట్ సమావేశాల ముందే పార్టీ మారడాలు ఉంటాయని ప్రచారం జరిగింది. ఆ సమయంలో సీఎం కే సీఆర్‌తో ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావు భేటీ కావడంతో దానికి బలం చేకూరింది. రెండు నెలలు ఆలస్యమైనా అదే దృశ్యం ఆవిష్కృతమవుతోంది. తెలంగాణలో ఉనికిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతూ జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్న టీడీపీ.. గురువారం మహబూబ్‌నగర్‌లో చంద్రబాబు పర్యటన పెట్టుకుంది. ఇదే సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని ప్రకటించడం షాకిచ్చినట్లయింది.

 

 రాజధానిలో బలోపేతమే లక్ష్యం..!

 త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఏడు స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో నగరంలో టీడీపీని ఖాళీ చేయాలన్న వ్యూహంతో టీఆర్‌ఎస్ ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలతో పాటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలనూ టీఆర్‌ఎస్ మదిలో పెట్టుకుందని.. హైదరాబాద్‌లోని టీడీపీ ఎమ్మెల్యేలను లాగేసుకుంటే రెండు విధాలా లాభం ఉంటుందన్న ముందు చూపుతో ఉన్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. టీడీపీకి చెం దిన నలుగురు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతుండడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top