‘సబ్సిడీ’ గడబిడ!

Subsidy Money Delayed Gas Agencies - Sakshi

జమ కాని గ్యాస్‌ నగదు

భారమవుతున్న సిలిండర్‌ ధర

లబ్ధిదారుల గగ్గోలు

సాక్షి, సిటీబ్యూరో: గృహోపయోగ వంట గ్యాస్‌ సబ్సిడీ సొమ్ము వ్యవహారం గడబిడగా తయారైంది. సిలిండర్‌ ధరలో సబ్సిడీ సొమ్ము నగదు బదిలీ కింద బ్యాంక్‌ ఖాతాలో జమ చేయడంలో ఒక నిర్ధిష్టమైన లెక్కంటూ లేకుండా పోయింది. ప్రతి నెల ధరల సవరణ మరింత అయోమయానికి గురిచేస్తోంది. వినియోగదారుడు మార్కెట్‌ ధర చెల్లించి సిలిండర్‌ కొనుగోలు చేస్తున్నా..సబ్సిడీ సొమ్ము నగదుగా వెనక్కి జమ అవుతుందన్న నమ్మకం లేదు. కొందరు వినియోగదారులకు బ్యాంకు ఖాతాలో మొక్కుబడిగా నగదు జమ అవుతున్నా... మరికొందరికి అసలు నగదు జమ కావడం లేదు. బ్యాంక్‌ ఖాతాలో జమయ్యే నగదు సిలిండర్‌ ధరలోని సబ్సిడీ సొమ్ముతో పొంతన లేకుండా ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. దీంతో పేదలకు నగదు బదిలీ కింద వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ఆర్థికంగా భారంగా తయారైంది.  

మార్కెట్‌ ధరపైనే సిలిండర్‌
గృహోపయోగ సబ్సిడీ వంటగ్యాస్‌కు నగదు బదిలీ పథకం అమలవుతున్న కారణంగా మార్కెట్‌ ధర చెల్లించి సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చమురు సంస్థలు సబ్సిడీ సిలిండర్‌ ధర మినహాయించి మిగిలిన సొమ్మును నగదు బదిలీ కింద వినియోగదారుడి బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తోంది. ఇదీ కేవలం నగదు బదిలీ కింద అనుసంధానమైన వినియోగదారులకు మాత్రమే వర్తిస్తోంది. చమురు సంస్థల నిబంధనల ప్రకారం సంవత్సరానికి పన్నెండు సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తోంది. ఆ తర్వాత సరఫరా అయ్యే సిలిండర్లపై సబ్సిడీ వర్తించదు. సబ్సిడీ సొమ్ము కూడా నగదుగా బ్యాంక్‌ ఖాతాలో జమ కాదు. వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం చుక్కలు చూపిస్తోంది.  వాస్తవంగా పథకం అమలు అరంభంలో కొంత ఇబ్బందులు ఎదురైనా ఆ తర్వాత సక్రమంగానే బ్యాంక్‌ ఖాతాలో సబ్సిడీ సొమ్ము జమ అవుతూ వచ్చింది.కానీ,  ఇప్పుడు తిరిగి పాత పరిస్థితి పునరావృతం అవుతోంది. ధరల సవరణలతో సబ్సిడీ సొమ్ము జమ మరింత అయోమయంగా తయారైంది. దీంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు.

కనెక్షన్లు ఇలా..
హైదరాబాద్‌ మహా నగర పరిధిలో మూడు ప్రధాన చమురు సంస్థలకు చెందిన 125 డిస్ట్రిబ్యూటర్ల పరిధిలో సుమారు  28.21 లక్షల వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి రోజు డిమాండ్‌ను బట్టి ఆయిల్‌ కంపెనీల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు సిలిండర్ల స్టాక్‌ సరఫరా అవుతుంది. డిస్ట్రిబ్యూటర్లు అన్‌లైన్‌ బుకింగ్‌ను బట్టి వినియోగదారులకు డోర్‌ డెలివరీ చేస్తుంటారు. ప్రధానంగా ఐఓసీకి సంబంధించిన 11.94 లక్షలు, బీపీసీఎల్‌కు సంబంధించిన 4.96 లక్షలు, హెచ్‌పీసీఎల్‌కు సంబధించిన 11.31 లక్షల కనెక్షన్లు ఉన్నట్లు సమాచారం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top