ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోతున్నాయి 

Standards are falling in public schools - Sakshi

ప్రమాణాల మెరుగుకు కమిటీని ఏర్పాటు చేయండి : హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో రోజురోజుకూ ప్రమాణాలు పడిపోతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఏటా తగ్గిపోతుండటం ఏ మాత్రం ఆశాజనక పరిణామం కాదని పేర్కొంది. ప్రభుత్వ విధానాలు కూడా ప్రభుత్వ పాఠశాలలకన్నా ప్రైవేటు పాఠశాలలను ప్రోత్సహించేలా ఉన్నాయని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అందువల్ల విద్యా శాఖ అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈ కమిటీకి హైకోర్టు స్పష్టం చేసింది.పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఎంవీ ఫౌండేషన్‌ కన్వీనర్‌ ఆర్‌.వెంకటరెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top