కామారెడ్డిలో ఆరుగురు వైద్యుల రాజీనామా | Six Doctors Resigned Due To Coronavirus At Kamareddy District | Sakshi
Sakshi News home page

కామారెడ్డిలో ఆరుగురు వైద్యుల రాజీనామా

Apr 5 2020 3:47 AM | Updated on Apr 5 2020 3:47 AM

Six Doctors Resigned Due To Coronavirus At Kamareddy District - Sakshi

కామారెడ్డి టౌన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తితో దేశవ్యాప్తంగా ఒక వైపు వైద్యలోకంతో పాటు ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్‌లు పోరాటం చేస్తూ కరోనా బాధితులకు వైద్యసేవలు అందిస్తుం టే మరో వైపు కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో మాత్రం ప్రభుత్వ వైద్యులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు. కరోనా వ్యాధి భయంతో తాము విధులు నిర్వహించబోమని ఏకంగా ఆరుగురు వైద్యులు రాజీనామా చేశారు. తాము విధులు నిర్వహించబోమని, తమ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడం లేదంటూ శనివారం రాజీనామా లేఖలను ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు అందజేశారు.

ఆరుగురు వీరే.. 
కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని ఐసీయూలో విధులు నిర్వహిస్తున్న పల్మనాలజిస్టులు ప్రవీణ్‌కుమార్, నరేన్‌కుమార్‌లు, ఫిజీషియన్‌లు రవితేజ, సాయిలు, మత్తు వైద్యుడు రమణ, పిల్లల వైద్యుడు ముత్యం నాగేందర్‌లు రాజీనామా చేసినవారిలో ఉన్నారు. వీరంతా కాంట్రాక్ట్‌ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌తో ప్రస్తుతం ప్రైవేట్‌ ఆస్పత్రులన్నీ మూతపడ్డాయి. దీంతో నిత్యం ప్రభుత్వ ఆస్పత్రి ఓపీకి రోగుల తాకిడి ఎక్కువవుతోంది. రోజూ 300 పైగా రోగులు వస్తున్నారు. దీనికి తోడు కరోనా ఐసోలేషన్‌ వార్డుల్లో 24 గంటల పాటు విధులు నిర్వహిస్తుండటంతో ఒత్తిడికి గురవుతున్నామని వారు తెలిపారు. అలాగే ఓపీకి కరోనా లక్షణాలు ఉన్నవారు కూడా వస్తున్నారని, వారు గుంపులుగా రావడంతో ఎవరికి కరోనా ఉందో తెలుసుకోవడం ఓపీలో కష్టంగా ఉంటుందని దీంతో భయం వల్ల కూడా విధులు చేయలేకపోతున్నామని వాపోయారు. ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్‌తో పాటు డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్‌లు రాజీనామా చేసిన వైద్యులతో మాట్లాడారు. అయితే వారు విధులకు హాజరుకావడానికి సిద్ధంగా లేరని తెలిసింది. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ను వివరణ కోరగా ఆరుగురు వైద్యులు రాజీనామా చేశారని వారితో    మాట్లాడుతున్నామని తెలిపారు.

చట్టపరంగా చర్యలు  
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వైద్యులు రాజీనామాలు చేసినా, సెలవులో వెళ్లినా వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని డీఎంహెచ్‌వో డాక్టర్‌ చంద్రశేఖర్, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌     అజయ్‌కుమార్‌లు స్పష్టం చేశారు. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో రాజీనామా చేసిన     ఆరుగురు వైద్యులతో శనివారం సాయంత్రం డీఎంహెచ్‌వో కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వైద్యులను విధుల్లో చేరాలని అధికారులు కోరారు. రాజీనామా చేసినవారు విధుల్లో చేరకపోతే కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement