తమ పింఛన్లు తొలగించారని ఆగ్రహం చెందిన వృద్ధులు, వితంతులు, వికలాంగులు మండలంలోని మాణిక్యాపూర్‌లో ఆందోళనకు దిగారు.
భీమదేవరపల్లి : తమ పింఛన్లు తొలగించారని ఆగ్రహం చెందిన వృద్ధులు, వితంతులు, వికలాంగులు మండలంలోని మాణిక్యాపూర్‌లో ఆందోళనకు దిగారు. పింఛన్ల పంపిణీ కోసం బుధవారం గ్రామ పంచాయితీ కార్యాలయానికి వచ్చిన సీనియర్ అసిస్టెంట్ రవీందర్‌రావు, పంచాయతీ కార్యదర్శి భాస్కర్, సర్పంచ్ వనపర్తి రాజయ్య, ఉపసర్పంచ్ లక్ష్మయ్య, వార్డుసభ్యులను నిర్బంధించారు. అర్హులకు పింఛన్‌లు రావడం లేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేతిరి లక్ష్మారెడ్డి ఆరోపించారు.
గ్రామంలో సర్వే చేసిన ఏఎస్‌వో విజేందర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తమకు పింఛన్ మంజూరుచేస్తామని హామీ ఇచ్చేవరకు విడుదల చేయమని భీష్మించారు. అర్హులకు న్యాయం చేస్తామని ఎంపీడీవో నర్సింహారెడ్డి హామీ ఇవ్వడంతో మూడు గంటల అనంతరం వారిని విడుదల చేశారు. పింఛన్లు తీసేశారంటూ ముస్తఫాపూర్ జీపీ పరిధిలోని పలువురు బుధవారం కొత్తకొండ-ముల్కనూర్ రోడ్డులోని గొల్లపల్లి వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.