మమ్మల్ని చావనివ్వండి..

siddipet farmers meets human right commision in hyderabad - Sakshi

సామూహిక ఆత్మహత్యలకు 

అనుమతించాలని  హెచ్‌ఆర్‌సీకి రైతుల వినతి  

సాక్షి, నాంపల్లి: తమ భూములను, ప్రాణాలను కాపాడాలని, లేని పక్షంలో సామూహిక ఆత్మహత్యలకు అనుమతించాలని కోరుతూ సిద్ధిపేట జిల్లా కొండ పోచమ్మ గ్రామానికి చెందిన రైతులు మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(హెచ్చార్సీ)ను ఆశ్రయించారు. తమ భూములను రక్షించాలని కోరుతూ కమిషన్‌కు ఫిర్యాదు చేసినందున పోలీసుల నుండి బెదిరింపులు వస్తున్నాయన్నారు. భూములు, ప్రాణాలకు రక్షణ కల్పించలేనప్పుడు సామూహిక ఆత్మహత్యలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. 

వివరాల్లోకి వెళితే.. నగర శివార్లలోని  సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం, నాగపూర్‌ గ్రామంలో సర్వే నంబరు 832, 835లలో బి.కొండమ్మ, ఇ.గురువయ్య, పి.మల్లయ్య అనే వ్యక్తులకు భూములు ఉన్నాయి. ఈ భూమి సమీపంలో ఊషదీశ్వర్‌రెడ్డికి చెందిన భూములు ఉండటంతో ఆయన పేదల భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతడికి సిద్ధిపేట డీసీపీ, చేర్యాల సీఐ సహకరిస్తున్నారని, డీసీపీ ప్రోద్బలంతో గుండాలతో తమపై దాడులకు పాల్పడ్డారన్నారు. 

పట్టా భూమిలో ఉన్న షెడ్లను కూల్చివేయడంతో బాధితులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో పోలీసులు, గూండాల దౌర్జాన్యాలు మరింత పెరిగాయని, ఊషదీశ్వర్‌ రెడ్డి, అతని అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. రక్షణ కల్పించలేని పక్షంలో సామూహికంగా ఆత్మహత్యలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్‌ జనవరి 17లోగా నివేదికను అందజేయాలని కోరుతూ సిద్ధిపేట ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. వీరికి యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు రాగం సతీష్‌ యాదవ్‌ తదితరులు బాధితులను పరామర్శించారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top