పప్పుధాన్యాల విక్రయానికి రైతులు ఆసక్తి చూపకపోవడంతో తాండూరు వ్యవసాయ మార్కెట్‌యార్డులో దాదాపు రూ.5.98 కోట్ల విలువైన నిల్వలు పేరుకుపోయాయి.
	⇒ తాండూరు మార్కెట్ యార్డులో
	⇒ పేరుకుపోతున్న పప్పుధాన్యాల ఉత్పత్తులు
	⇒ ధరల తగ్గుదలతో విక్రయానికి ఆసక్తి చూపని రైతులు
	తాండూరు: పప్పుధాన్యాల విక్రయానికి రైతులు ఆసక్తి చూపకపోవడంతో తాండూరు వ్యవసాయ మార్కెట్‌యార్డులో దాదాపు రూ.5.98 కోట్ల విలువైన నిల్వలు పేరుకుపోయాయి. నిన్నా మొన్నటి వరకు జోరుగా సాగిన ఉత్పత్తుల క్రయవిక్రయాలు పడిపోయాయి.
	
	వేరుశనగలకు ధరలు తగ్గటంతో విక్రయాలపై ప్రభావం పడింది. దీంతో కోట్లాది రూపాయల విలువ చేసే కందులు, వేరుశనగల ఉత్పత్తుల నిల్వలు యార్డులో పేరుకుపోయాయి. ముఖ్యంగా వేరుశనగల నిల్వలు భారీగా పేరుకుపోయాయి. కమీషన్ ఏజెంట్ల సమావేశం, హమాలీల లోడింగ్ వ్యవహారంతో సోమవారం యార్డులో బీట్లు నిలిచిపోయాయి. మంగళవారం బీట్లు ప్రారంభమైనా ధరలు తగ్గటంతో రైతులు ఉత్పత్తుల విక్రయానికి ముందుకురాలేదు.
	 
	మొన్న రూ.47.15 లక్షల వ్యాపారం
	శనివారం యార్డులో క్వింటాలు కందులకు గరిష్టంగా రూ.6,210, కనిష్టంగా రూ.5,900, సగటు ధర రూ.6వేలు పలికింది. సగటు ధర రూ.6వేల ప్రకారం సుమారు రూ.30 లక్షల విలువైన కందుల కొనుగోళ్లు జరిగాయి.  అదేవిధంగా క్వింటాలు వేరుశనగలకు గరిష్టంగా రూ.5వేలు, కనిష్టంగా రూ.4,700, సగటు ధర రూ.4,900 వచ్చింది. సగటు ధర లెక్కన రూ.17.15 లక్షల విలువైన వేరుశనగల విక్రయాలు జరిగాయి. మొత్తం శనివారం ఒక్క రోజు రూ.47.15 లక్షల పప్పుధాన్యాల వ్యాపారం జరిగింది. ఆదివారం సెలవు, సోమవారం బీట్లు జరగలేదు.
	 
	రూ.16.98 లక్షల వ్యాపారం
	మంగళవారం రూ.16.98 లక్షల వ్యాపారమే కావడం గమనార్హం. సోమవారం బీట్లు నిలిచిపోయిన నేపథ్యంలో మంగళవారం ఇంతకు రెట్టింపు విక్రయాలు జరగాల్సి ఉండగా తగ్గాయి. కందులకు సగటు ధర రూ.6వేలు, వేరుశనగలకు రూ.4,800 ధర పలికింది. శనివారం ధరలతో వీటిని పోల్చితే కందుల ధరలో మార్పు లేకపోయినప్పటికీ వేరుశనగల సగటు ధరలో సుమారు రూ.100 తగ్గింది. దీంతో యార్డులో వేరుశనగలు పేరుకుపోయాయి. మంగళవారం పలికిన సగటు ధర ప్రకారం ప్రస్తుతం యార్డులో సుమారు రూ.2.94కోట్ల విలువ చేసే వేరుశనగల నిల్వలు పేరుకుపోయాయని అంచనా.
	 
	కందులు ఇలా...
	కందులకు ఇంకా అధిక ధర వస్తుందనే ఆశతో రైతులు విక్రయానికి ఆసక్తి చూపడం లేదు. రూ.6,100-రూ.6,200 ధర పెరుగుతుందనే ఆశతో రైతులు పంటను అమ్మడం లేదు. దీంతో రూ.3కోట్ల విలువ చేసే కందుల నిల్వలు కూడా యార్డులో పేరుకుపోయినట్టు ఓ వ్యాపారి చెప్పారు. కందులకు ఇంకా ధర పెరుగుతుందని, వేరుశనగలకు ధర తగ్గిందనే కారణాలతోనే రైతులు తమ దిగుబడులను అమ్మడం లేదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
