రేషన్‌ డీలర్ల ఆందోళన బాట | Ration dealers strike | Sakshi
Sakshi News home page

రేషన్‌ డీలర్ల ఆందోళన బాట

Nov 1 2017 2:00 AM | Updated on Aug 15 2018 9:45 PM

Ration dealers strike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రేషన్‌ డీలర్లు సమ్మె సైరన్‌ మోగించారు. దీర్ఘకాలిక సమస్యల సాధన కోసం బుధవారం నుంచి చౌక ధరల దుకాణాలు మూసి వేసి పౌర సరఫరాల గోదాముల వద్ద సరుకులు బయటికి రాకుండా ఆందోళనకు దిగనున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేయనున్నారు. ఇప్పటికే నవంబర్‌కు సంబంధించి రేషన్‌ కోటాకు డీడీలు కట్టిన డీలర్లు రేషన్‌ లిఫ్టింగ్‌ను నిలిపివేశారు.

మంగళవారం ఈ మేరకు సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌తోపాటు, ఖమ్మం, వైరా, నల్లగొండ, కోదాడ పౌర సరఫరాల గోదాముల వద్ద డీలర్లు ఆందోళనకు దిగారు. రేషన్‌కు నగదు బదిలీ యోచన రద్దు, డీలర్లకు ఉద్యోగ భద్రత, గౌరవ వేతనం గ్రేటర్‌లో రూ.60 వేలు, కార్పొరేషన్‌లో రూ.50 వేలు, మున్సిపాలిటీలో రూ.30 వేల చొప్పున ఇవ్వాలని, ఆహార భద్రత చట్టం ప్రకారం సరుకులపై కమీషన్‌ పెంపు, డీలర్లకు హెల్త్‌ కార్డులు, చనిపోతే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, పెండింగ్‌ బకాయిల విడుదల, గోడౌన్స్‌లో వేబ్రిడ్జి ద్వారా సరుకుల తూకం తదితర డిమాండ్లతో ఆందోళనకు దిగుతున్నారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
సమ్మెకు దిగిన డీలర్లతో చర్చలు జరిపి సాధ్యమైన హమీలతో విరమింపజేయడమా, లేక డీలర్లపై ఎస్మా చట్టం ప్రయోగానికి సిద్ధం కావడమా అనే దానిపై యోచిస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు బదిలీ చేస్తే ఏలా ఉంటుందని భావిస్తోంది. ఇప్పటికే రేషన్‌కు నగదు బదిలీపై సర్వే నిర్వహిస్తున్న పౌర సరఫరాల శాఖ.. డీలర్ల సమ్మె సమయంలోనే ప్రయోగాత్మకంగా చేపట్టాలని యోచిస్తోంది.

హామీ ఇచ్చే వరకు సమ్మె
ప్రభుత్వం రేషన్‌ డీలర్ల సమస్యలపై లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చేంత వరకు సమ్మె కొనసాగిస్తామని రాష్ట్ర రేషన్‌ డీలర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు నాయి కోటిరాజు, ప్రధాన కార్యదర్శి సంజీవ్‌ రెడ్డి, కార్యదర్శి అనంద్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement