బకాయిలు వచ్చేశాయ్‌

Ration Dealers Commission Pending Government Started Progress - Sakshi

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : రేషన్‌ డీలర్ల కమీషన్‌ బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. బియ్యం పంపిణీ చేసిన డీలర్లకు పెంచిన కమీషన్‌కు సంబంధించి బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో రేషన్‌ డీలర్‌కు ఎంత రావాల్సి ఉందనే లెక్కలు తేలుస్తున్నారు. ఇదివరకు రేషన్‌ బియ్యం పంపిణీపై కిలోకు 20 పైసల చొప్పున కమీషన్‌ ఇచ్చేవారు.

అయితే కమీషన్‌ పెంపుతో పాటు గౌరవ వేతనాన్ని ఇవ్వాలనే డిమాండ్‌తో రేషన్‌ డీలర్లు ప్రభుత్వంపై దశలవారీగా వత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మేరకు ప్రభుత్వం 2015 అక్టోబర్‌ నుండి కేజీ బియ్యానికి కమీషన్‌ను 70 పైసలు చెల్లించేందుకు నిర్ణయించింది. ఇదివరకు చెల్లించిన 20 పైసలు పోను మిగతా 50 పైసలు ఇప్పుడు చెల్లించేందుకు నిర్ణయించడంతో బకాయి మొత్తాలను చెల్లించే చర్యల్లో వేగం పెంచారు.

జిల్లా డీలర్లకు రూ.10.80 కోట్లు
గతంలో ఇచ్చిన 20 పైసల కమీషన్‌ను 70 పైసలకు పెంచిన ప్రభుత్వం ఈ మొత్తాన్ని అక్టోబర్‌ 2015 నుండి చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలోని డీలర్లకు రూ.10.80 కోట్లు చెల్లించనున్నారు. ఈ బకాయిలను తహసీల్దార్ల నివేదికల ఆధారంగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో బకాయిలు చెల్లించే పీరియడ్‌లో రేషన్‌ డీలర్లు ఎవరైనా సెలవులో వెళ్లినా, 6ఏ కేసులు నమోదైనా, చనిపోయిన వారున్నా...

వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. ఇలాంటి కేసుల్లో ఇన్‌చార్జిలకు బకాయి కమీషన్‌ అందనుంది. ఈ అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే బకాయిలు చెల్లిస్తామని అధికారులు ప్రకటించారు. మొదటి విడతలో ఎలాంటి ఆక్షేపణలు లేకుండా కొనసాగుతున్న రేషన్‌ డీలర్లకు, రెండో విడతలో మిగిలిన వారికి బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.   
ఉమ్మడి జిల్లా కాలం

నాటి బకాయిలు ఇక్కడే...
ప్రభుత్వం 2015 అక్టోబర్‌ నుండి రేషన్‌ డీలర్లకు పెంచిన కమీషన్‌ చెల్లించాలని నిర్ణయించారు. అయితే, జిల్లాల విభజనకు ముందు సమయం నాటి కమీషన్‌ను డీలర్లు అందరూమహబూబ్‌నగర్‌ డీసీఎస్‌ఓ కార్యాలయం నుండే పొందాల్సి ఉంటుంది. అయితే నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల పరిధిలోని ఆర్డీఓల నుండి జిల్లాల విభజన సమయం వరకు పనిచేసిన రేషన్‌ డీలర్ల వివరాలతో కూడిన నివేదిక పంపించాల్సి ఉంది. 2016 అక్టోబర్‌ 12న జిల్లాల పునర్విభజన జరిగింది. అంతకు ముందు రోజు వరకు  పనిచేసిన రేషన్‌ డీలర్ల వివరాలను సంబంధింత ఆర్డీఓల ద్వారా నివేదిక రాగానే కమీషన్‌ చెల్లిస్తారు. జిల్లాల విభజన అనంతరం కమీషన్‌ను అక్కడి డీసీఎస్‌ఓల ద్వారానే పొందాల్సి ఉంటుంది.

డీలర్లతో సమావేశం
ప్రభుత్వం బకాయిల చెల్లింపునకు నిర్ణయం తీసుకున్న దృష్ట్యా మొదటి విడతలో 730 మంది డీలర్లకు చెల్లింపులు చేయనున్నట్లు డీసీఎస్‌ఓ శారదాప్రియదర్శిని తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని డీసీఎస్‌ఓ కార్యాలయంలో శుక్రవారం ఆమె మండలానికి ఇద్దరు డీలర్లతో సమావేశమయ్యారు. ఎలాంటి కేసులు లేకుండా రెగ్యూలర్‌గా బియ్యం పంపిణీ చేసిన రేషన్‌ డీలర్లు 730 మంది ఉండగా కేసులు, సెలవులు, చనిపోయిన వారు 74 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఎలాంటి కేసులు లేని వారికి మొదటి విడతగా రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయిస్తామని ఆమె తెలిపారు.

అదే పనిలో ఉన్నాం...
రేషన్‌ డీలర్లకు బకాయి కమీషన్‌ డబ్బులు కిలో రేషన్‌ బియ్యానికి 50 పైసల చొప్పున చెల్లించనున్నాం. 2015 అక్టోబర్‌ నుంచి డీలర్లకు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాలో రేషన్‌ డీలర్లకు రావాల్సిన బకాయి కమీషన్‌ డబ్బు చెల్లింపునకు కసరత్తు చేస్తున్నాం. తహసీల్దార్లు, ఆర్డీఓల ద్వారా నివేదికలు అందాల్సి ఉంది.
మా కార్యాలయ సిబ్బంది అదే పనిలో నిమగ్నమయ్యారు.
– శారదా ప్రియదర్శిని, డీసీఎస్‌ఓ

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top