తలుపు తట్టుడే..!

Politicians Came To Voters Level - Sakshi

అభ్యర్థుల  సరికొత్త వ్యూహం

బూత్‌స్థాయిలో కమిటీలు

సంఘాలకు ఇన్‌చార్జీలు

ఓటర్లకు నేరుగా గాలం 

సాక్షి, పెద్దపల్లి: ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చమటోడ్చుతున్న అభ్యర్థులు ప్రచార శైలిని విభిన్నంగా మార్చారు. ఓవైపు మాస్‌గా ప్రచారం సాగిస్తూనే.. మరో వైపు ప్రతీ ఇంటి తలుపు తట్టే విధంగా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో కొన్ని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు పోలింగ్‌ బూత్‌ల వారీగా బృందాలు కేటాయించగా, బీజేపీ ఓటరుజాబితాలోని పేజీల వారీగా కూడా కమిటీలు ఏర్పాటు చేయడం విశేషం.

బూత్‌స్థాయిలో కమిటీలు
ఏ ఒక్క ఓటరును వదిలిపెట్టకుండా, ప్రతీ ఇంటికి తమ ప్రచారం వెళ్లేలా అభ్యర్థులు ప్రణాళికలు రూపొందించుకున్నారు. గతంలో అభ్యర్థులు గ్రామాల్లోని ప్రధాన వీధుల గుండా, కాలనీల్లో మాత్రమే ప్రచారాన్ని పరిమితం చేశారు. ఓటరు స్లిప్‌లు పంచే సమయంలోనే ఇంటింటికి వెళ్లే వాళ్లు. కానీ.. ఈసారి చాలా ముందుగా ఎన్నికల వాతావరణం జిల్లాలో ఏర్పడడంతో అన్ని పార్టీలు ముందస్తు వ్యూహరచనలు చేశాయి. పల్లెలు, పట్టణాలు అనేతేడా లేకుండా అన్ని ఇళ్లను తట్టే విధంగా ప్రచారాన్ని రూపొందించాయి. అభ్యర్థులు ప్రచారం చేస్తూ వెళుతుంటే, కొన్ని ప్రత్యేక బృందాలు మాత్రం తమకు కేటాయించిన ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలోనే నిమగ్నమవుతున్నాయి.

టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు పోలింగ్‌ బూత్‌ల వారీగా పార్టీ కమిటీలు నియమించాయి. ఒక్కోబూత్‌ పరిధిలో పదిమంది పార్టీ కార్యకర్తలు ప్రచారపర్వాన్ని నిత్యం కొనసాగిస్తుంటారు. ఆ బూత్‌ పరిధిలో ఉన్న ఓటర్లను కలుస్తూ తమపార్టీకే ఓటు వేయాలంటూ నేరుగా ప్రభావితం చేస్తారు. ఇక బీజేపీ రథసారథి అమిత్‌షా జాతీయస్థాయిలో పన్నిన వ్యూహాలను ఇక్కడా అమలు చేస్తున్నారు. అన్ని పార్టీలు పోలింగ్‌ బూత్‌ను పరిగణలోకి తీసుకొని కమిటీలు వేస్తుంటే, బీజేపీ మాత్రం ఓఅడుగు ముందుకేసి కమ్మకమిటీ వేసింది. ఓటరుజాబితాలోని ఒకపేజీలో ఉన్న ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఏర్పాటు చేసేదే కమ్మకమిటీ. దాదాపు 50 మంది ఓటర్లకు ఇన్‌చార్జీగా ఆ కమిటీ పనిచేస్తుండడంతో.. ప్రచార ప్రభావం ఓటర్లపై నేరుగా పడుతుందనే భావనతో అభ్యర్థులున్నారు. అందుకే పోలింగ్‌ బూత్‌స్థాయి కమిటీలు, కమ్మ కమిటీలకు పార్టీలు ప్రాధాన్యమిస్తున్నాయి. అయితే ఈ కమిటీలు పూర్తిస్థాయిలో పనిచేస్తేనే ఆ పార్టీల లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది.

క్షేత్రస్థాయి నుంచి నెట్‌వర్క్‌..
ఓటర్లను నేరుగా ప్రభావితం చేసేందుకు అన్నిపార్టీలు క్షేత్రస్థాయి నుంచి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొన్నాయి. బూత్‌కమిటీ, కమ్మ కమిటీలను సమన్వయపరిచేందుకు ఐదు గ్రామాలకు ఒక పార్టీ నాయకుడిని ఇన్‌చార్జీగా నియమించారు. ఈ గ్రామాల ఇన్‌చార్జీలను సమన్వయం చేసేందుకు మండల స్థాయిలో ఒక నాయకుడు, మండల స్థాయిలో నాయకులను సమన్వయ పరిచేందుకు నియోజకవర్గ స్థాయిలో పార్టీ సీనియర్‌ నేత ఒకరు పనిచేస్తున్నారు. దాదాపు అన్ని పార్టీలు ఇంచుమించు ఇదే తరహాలో ప్రచార కమిటీలు నియమించడం విశేషం. ఈ కమిటీల ద్వారా ఆయా గ్రామాల్లో ప్రచారం నిర్వహించడంతో పాటు, ఇతర పార్టీలకు చెందిన, తటస్థులుగా ఉన్న వాళ్లను పార్టీలో చేర్చుకునే పనిచేపట్టారు. ఇదిలాఉంటే కులాలు, మహిళా సంఘాలను ప్రభావితం చేసేపనిని కూడా కొంతమంది నేతలకు అప్పగించారు. ఇప్పటికే ఆయా సంఘాలతో టచ్‌లో ఉన్న సదరు నేతలు, పోలింగ్‌ సమీపిస్తున్న కొద్దీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పోరు హోరాహోరీగా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఓటర్లను వ్యక్తిగతంగా ప్రభావితం చేసే అంశాలపైనే అన్ని పార్టీల అభ్యర్థులు దృష్టి సారించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top