న్యాయవ్యవస్థపై ప్రజలకు అచంచల విశ్వాసం | People have confidence in the judiciary | Sakshi
Sakshi News home page

న్యాయవ్యవస్థపై ప్రజలకు అచంచల విశ్వాసం

Nov 21 2017 1:51 AM | Updated on Nov 21 2017 1:56 AM

People have confidence in the judiciary - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: న్యాయవ్యవస్థపై ఈ దేశ ప్రజలకున్న అచంచలమైన విశ్వాసాన్ని వమ్ము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత న్యాయమూర్తులు, న్యాయవాదులపై ఉందని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. న్యాయమూర్తులు తెల్ల చొక్కాలాంటి వారని, ఆ చొక్కాపై చిన్న మరక పడినా ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తుంటారన్నారు. మరకలు అంటించే వ్యక్తులు కూడా ఉంటారని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా మసలుకోవాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. హైకోర్టు ప్రాంగణంలో సోమవారం హైకోర్టు న్యాయవాదులు వెంకయ్యనాయుడిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  

అమ్మ ఓకే. ఇందిర నో..
‘నేను కూడా న్యాయవాదినే. నా తల్లి కోరిక మేరకు న్యాయవాదినయ్యాను. అయితే ఇందిరా గాంధీ వల్ల న్యాయవాద వృత్తికి దూరమయ్యాను. ఇందుకు ఇందిరకు ధన్యవాదాలు చెప్పుకోవాలి (వ్యంగ్యంగా). ఎమర్జెన్సీ సమయంలో నన్ను జైలులో పెట్టకుండా ఉంటే బహుశా నేను న్యాయవాద వృత్తిలో కొనసాగి ఉండే వాడిని. అయితే అప్పటి ప్రభుత్వం జైల్లో వేయడం వల్ల నా దృక్పథంలో మార్పు వచ్చింది. ఆంధ్రా వర్సిటీలో నిర్వహించిన కార్యక్రమానికి జయప్రకాశ్‌ నారాయణ్‌ను ఆహ్వానించాను. అది నేరమంటూ నన్ను జైల్లో వేశారు. అది నన్ను రాజకీయాల దిశగా నడిపించింది.

జస్టిస్‌ పీఏ చౌదరి వంటి న్యాయ ఉద్దండుడితో అత్యంత సన్నిహితంగా తిరిగాను. న్యాయవాదిగా నేను నా నిర్బంధానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించుకున్నా. జడ్జీలు నన్ను ఎందుకు వదిలేయకూడదని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను ప్రశ్నించారు. వదిలేయడానికి ఇబ్బంది లేదని, వదిలేస్తే వృత్తిని వదిలేసి రాజకీయాల్లోకి వెళతారని ఆ పీపీ చెప్పారు. చివరకు అదే నిజమైంది’అని వెంకయ్యనాయుడు అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమ్మద్‌ అలీ, తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘాల అధ్యక్షులు జల్లి కనకయ్య, చల్లా ధనంజయ, కార్యదర్శులు పాశం సుజాత, బాచిన హనుమంతరావు, ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ పీపీ సి.ప్రతాప్‌రెడ్డి, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.  


ఉద్వేగానికి గురైన వెంకయ్య...
అంతకు ముందు వెంకయ్యనాయుడు తన తల్లి గురించి మాట్లాడుతూ ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. ‘మా అమ్మ నేను పుట్టక ముందే నన్ను లాయర్‌ని చేయాలనుకుంది. అయితే దురదృష్టవశాత్తూ నేను పుట్టిన ఏడాదికే ఆమెను కోల్పోయాను. వెనక నుంచి ఆమెను గేదె పొడవడంతో చనిపోయారు. ఈ విషయం తలచుకున్నప్పుడల్లా నేను తీవ్ర భావోద్వేగానికి లోనవుతుంటాను’అని చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ధనంజయ న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి చొరవ తీసుకోవాలని వెంకయ్యనాయుడిని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement