
మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలతో వివాదాలకు పరిష్కారం
విశాఖలో ఏడీఆర్ సెంటర్ ఏర్పాటుకు సిద్ధం
ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు
ఏపీలో ప్రస్తుతం 650 మంది న్యాయమూర్తులున్నారు
కేసులు త్వరితగతిన పరిష్కరించాలంటే ఇంకో 800 మంది అవసరం
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ వ్యాఖ్య
సాక్షి, విశాఖపట్నం: న్యాయ వ్యవస్థలో మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలే ముఖ్య భూమిక పోషిస్తాయని, ప్రజలకు ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతుందని సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ‘సాంకేతికత, నైపుణ్యంతోపాటు వివిధ సంస్థల ద్వారా సరైన న్యాయం అందించే వారధి’ అనే అంశంపై శుక్రవారం విశాఖపట్నంలో అంతర్జాతీయ మీడియేషన్ సదస్సు–2025 ప్రారంభమైంది.
ట్రైలీగల్, ఏషియన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ (ఏసీఐఏఎం), భోపాల్‌లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌ఐయూ) సంయుక్త ఆధ్వర్యంలో రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో నిర్వహించిన సదస్సును సీఎం చంద్రబాబు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆల్టర్నేటివ్ డిస్‌ప్యూట్ రిజల్యూషన్ (ఏడీఆర్) ద్వారా అందరికీ న్యాయం వేగంగా సమర్థవంతంగా ప్రజలకు చేరువ కానుందన్నారు.
నిజానికి.. మీడియేషన్ అంశం భారత్‌కు కొత్తకాదనీ, పురాణాల్లో శ్రీకృష్ణుడు సమర్థవంతమైన మీడియేటర్‌గా వ్యవహరించారని గుర్తుచేశారు. భారతీయ న్యాయవ్యవస్థ రాజ్యాంగపరమైన హక్కుల్ని, చట్టాన్ని కాపాడే విషయంలో అత్యంత కీలకమైందన్నారు. ఒక్కోసారి కాస్త ఆలస్యమైనా న్యాయం దక్కుతుందనే నమ్మకం ప్రతీ పౌరుడికీ ఉందని తెలిపారు. వివాదాల పరిష్కారానికి మీడియేషన్ లాంటి ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థలు అందుబాటులోకి రావాలన్నారు.
విశాఖలో ఏడీఆర్ ఎకో సిస్టం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. ఇప్పటికీ చాలామంది పౌరులు కేసులు దాఖలు చేసి కోర్టులకు వెళ్లటం అవమానంగా భావిస్తారని, దీనికి మీడియేషన్ ప్రక్రియ చక్కని పరిష్కారమన్నారు. ఈజ్ ఆఫ్ జస్టిస్ ప్రక్రియలో భాగంగా వర్చువల్ హియరింగ్స్, ఈ–ఫైలింగ్, మొబైల్ అప్‌డేట్స్ లాంటి సాంకేతికతను అమలుచేయాల్సి ఉందని చంద్రబాబు చెప్పారు.
న్యాయమూర్తుల కొరత ఉంది: సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్‌సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ రాష్ట్రంలో న్యాయమూర్తుల కొరత ఉందని చెప్పారు. ఏపీలో ఇప్పుడు 650 మంది జడ్జీలు ఉన్నారని.. కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు మరో 800 మంది న్యాయమూర్తులు కావాలన్నారు. ప్రస్తుతం మీడియేషన్ ప్రక్రియ చాలా అవసరమన్నారు. ఇక మీడియేషన్ నిపుణులను తయారుచేసేందుకు 40 గంటల శిక్షణ అవసరమవుతుందని.. ఇది చేసేవారికి సర్టిఫికేషన్‌తో కూడిన నైపుణ్యం ఉండాలన్నారు.
ఆర్బిట్రేషన్ రంగంలోకి విశ్రాంత న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు వస్తున్నారని, దీనికి ఒక ప్రత్యేకమైన యంత్రాంగం ఉండాలని భావిస్తున్నట్లు జస్టిస్ ఠాకూర్ తెలిపారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పీఎస్ నరసింహ, పలువురు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు హాజరయ్యారు.