మాతోనే బేరసారాలా? | ACB special court strongly objects to SIT conduct in liquor case | Sakshi
Sakshi News home page

దర్యాప్తు సంస్థ – పిటిషనర్ల మధ్య బేరం కుదిరినట్లుంది.. మాతోనే బేరసారాలా?

Aug 19 2025 5:21 AM | Updated on Aug 19 2025 7:24 AM

ACB special court strongly objects to SIT conduct in liquor case

మద్యం కేసులో సిట్‌ తీరుపై ఏసీబీ ప్రత్యేక కోర్టు తీవ్ర ఆక్షేపణ 

ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ ‘పిక్‌ అండ్‌ చూజ్‌..’ విధానాన్ని అనుసరిస్తోంది

అందుకే వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌ను అప్రూవర్‌లుగా మార్చడానికి యత్నిస్తోంది.. ఇప్పటికే 282 మంది సాక్షులను విచారించారు.. 

పిటిషనర్లను అప్రూవర్లుగా మార్చాల్సిన అవసరం లేదు.. అది ఓ నిష్ఫలయత్నమే 

అలా చేస్తే మొత్తం కేసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది 

వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్లు పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి.. 

అరెస్ట్, అభియోగాల నుంచి తప్పించుకోవడానికే దొడ్డిదారిన దాఖలు చేశారు 

అప్రూవర్‌గా మారతామన్న ప్రతిపాదనలకు చట్ట ఆమోదం లేదు 

వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్లు కొట్టివేత

ఈ కేసులో సిట్‌ ‘పిక్‌ అండ్‌ చూజ్‌’ (ఇష్టం వచ్చినట్లు ఎంచుకోవడం) విధానాన్ని అనుసరిస్తోంది. ప్రత్యేకించి ప్రధాన నిందితుడిని అప్రూవర్‌గా మార్చడానికి చూస్తోంది. ఈ చర్య మొత్తం కేసుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

282 మంది సాక్షులను విచారించడంతో పాటు ట్రంకుపెట్టెల్లో పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్లను దర్యాప్తు సంస్థ సేకరించింది. అందువల్ల పిటిషనర్లను అప్రూవర్లుగా తీసుకోవాల్సిన అవసరం ఏదీ లేదు. వాస్తవానికి ఇదో నిష్ఫల యత్నం.
– ఏసీబీ ప్రత్యేక కోర్టు

సాక్షి, అమరావతి: మద్యం విధానంపై అక్రమ కేసు విచారణ సందర్భంగా ఏసీబీ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ (సిట్‌) తీరును తీవ్రంగా ఆక్షేపించింది. ప్రాసిక్యూషన్‌ ‘పిక్‌ అండ్‌ చూజ్‌’ (ఇష్టం వచ్చినట్లు ఎంచుకోవడం) విధానాన్ని అనుసరించడంపై విస్మయం వ్యక్తం చేసింది. ప్రధాన నిందితుడిని అప్రూవర్‌గా మార్చడానికి యత్నిస్తోందని, ఈ చర్య మొత్తం కేసుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తప్పుబట్టింది. 

పిటిషనర్లకు, దర్యాప్తు సంస్థ మధ్య బేరం కుదిరిందన్న విషయాన్ని చాలా స్పష్టంగా ప్రస్ఫుటం చేస్తోందని వ్యాఖ్యానించింది. ఈమేరకు మద్యం విధానం కేసులో నిందితులుగా ఉన్న ఏపీ బెవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీబీసీఎల్‌) పూర్వ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఎక్సైజ్‌ శాఖ మాజీ స్పెషల్‌ ఆఫీసర్‌ దొడ్డా వెంకట సత్యప్రసాద్‌లకు ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఆ పిటిషన్లు పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, అరెస్ట్, అభియోగాల నుంచి తప్పించుకోవడానికే దొడ్డిదారిన దాఖలు చేశారని పేర్కొంది. అప్రూవర్‌కి ముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి వీల్లేదని, ట్రయల్‌ పూర్తయ్యే వరకు వారిని కస్టడీలోనే ఉంచి తీరాలని స్పష్టం చేసింది. అప్రూవర్‌గా మారతామన్న ప్రతిపాదనలకు చట్ట ఆమోద యోగ్యత లేదని తేల్చి చెప్పింది. ముందస్తు బెయిల్‌ కోసం వారిద్దరూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు సోమవారం తీర్పు వెలువరించారు. తీర్పు సారాంశం ఇదీ...  

అప్రూవర్‌గా మారుతామన్న వాగ్దానంపై బెయిల్‌ ఇవ్వడానికి వీల్లేదు... 
‘చట్ట ప్రకారం అప్రూవర్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడానికి వీల్లేదు. అప్రూవర్‌కు క్షమాభిక్ష ప్రసాదించిన తరువాత అతన్ని బెయిల్‌పై విడుదల చేయడానికి వీల్లేదు. ట్రయల్‌ పూర్తయ్యేంత వరకు కస్టడీలోనే ఉంచి తీరాలి. సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 306(4) (బీ) అప్రూవర్‌గా మారేందుకు సిద్ధమన్న వాగ్దానంపై బెయిల్‌ మంజూరు చేయడాన్ని నిషేధిస్తోంది. బెయిల్‌తో సంబంధం లేకుండా అప్రూవర్‌ సాక్ష్యం నమ్మదగినదిగా, మరకలు లేనిదిగా ఉండాలన్నదే ఈ నిషేధం వెనుక ఉన్న తర్కం. 

అప్రూవర్‌ భవిష్యత్తులో బెయిల్‌ పొందే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇతరులను కేసులో ఇరికించవచ్చు లేదా సాక్ష్యాన్ని మార్చవచ్చు. అందువల్ల అప్రూవర్‌గా మారుతానన్న వాగ్దానాల లాంటి వాటిపై బెయిల్‌ ఇవ్వడం న్యాయవ్యవస్థ ప్రతిష్టను తక్కువ చేయడమే. బెయిల్‌ పిటిషన్లను ఆయా కేసుల్లోని పూర్వాపరాల ఆధారంగా తేల్చాల్సి ఉంటుందే గానీ, అప్రూవర్‌గా మారుతానన్న వాగ్దానాల ఆధారంగా కాదు...’ అని ప్రత్యేక కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.  

ప్రభుత్వం పిటిషనర్లను అప్రూవర్‌గా మార్చడానికి చూస్తోంది...! 
‘పిటిషనర్లు దర్యాప్తునకు కొంత మేర సహకరించారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్‌ పీపీ చెప్పారు. అయితే ఇది ఎంతమాత్రం సరిపోదు. ఈ మొత్తం కేసులో తన పాత్ర గురించి, ఇతర నిందితుల పాత్ర గురించి పూర్తి వాస్తవాలను తెలియచేయాల్సి ఉంటుంది. పిటిషనర్లకు ముందస్తు బెయిల్‌ ఇస్తే పలు షరతులు విధించాలని స్పెషల్‌ పీపీ చెబుతున్నారు. ట్రయల్‌ పూర్తయ్యేంత వరకు నిందితులను కస్టడీలో ఉంచకుండా బెయిల్‌పై విడుదల చేస్తే వారు కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటారన్న గ్యారెంటీ ఏమీ లేదు. 

శక్తివంతులైన సహ నిందితులు గతంలో తమకున్న సాన్నిహిత్యంతో పిటిషనర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం, భయపెట్టడం చేయవచ్చు. అందుకే అప్రూవర్‌ను ట్రయల్‌ పూర్తయ్యే వరకు కస్టడీలోనే ఉంచాలని చట్టం చెబుతోంది. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ ‘పిక్‌ అండ్‌ చూజ్‌’ (ఇష్టం వచ్చినట్లు ఎంచుకోవడం) విధానాన్ని అనుసరిస్తోంది. ప్రత్యేకించి ఈ కేసులో ప్రధాన నిందితుడిని అప్రూవర్‌గా మార్చడానికి చూస్తోంది. ఈ చర్య మొత్తం కేసుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది..’ అని న్యాయస్థానం తన తీర్పులో ఆందోళన వ్యక్తం చేసింది.  

ప్రధాన నిందితులను అప్రూవర్‌గా మార్చడం ఓ నిష్ఫలయత్నం... 
‘శరీరానికి తల ఎంత ముఖ్యమో వీరు కూడా అంతే ముఖ్యం. తల తొలగిస్తే మొత్తం శరీరం కుప్పకూలిపోతుంది. అందువల్ల ప్రధాన నిందితులను ప్రాసిక్యూషన్‌ (సిట్‌) అప్రూవర్‌గా తీసుకోలేదు.  ఈ కేసులో ప్రధాన నిందితులను అప్రూవర్లుగా మార్చలేరు. ప్రాసిక్యూషన్‌ దర్యాప్తు పూర్తి చేసింది. కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిపై చార్జిషీట్‌ కూడా దాఖలు చేసింది. 

అలాగే నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలపై అనుబంధ చార్జిషీట్‌ దాఖలు చేసింది. 282 మంది సాక్షులను విచారించడంతో పాటు ట్రంకుపెట్టెల్లో పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్లను దర్యాప్తు సంస్థ సేకరించింది. అందువల్ల పిటిషనర్లను అప్రూవర్లుగా తీసుకోవాల్సిన అవసరం ఏదీ లేదు. వాస్తవానికి ఇదో నిష్పల యత్నం...’ అని ఏసీబీ కోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది.

ముందస్తు బెయిల్‌ కోసం  దొడ్డిదారిన పిటిషన్లు...
‘ఈ కేసులో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌ నిందితులుగా ఉన్నారు. ఈ వ్యవహారంలో వారు క్రియాశీలకంగా వ్యవహరించారు. వీరిపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవి. అయితే అరెస్ట్‌ నుంచి తప్పించుకోవటానికి, అభియోగాల నుంచి విముక్తి పొందేందుకు దొడ్డిదారిన  వీరు ఈ ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. అప్రూవర్‌గా మారేందుకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలన్న ప్రతిపాదనతో ఈ వ్యాజ్యాలు వేశారు. అయితే ఇలాంటి పద్ధతులకు చట్ట అమోద యోగ్యత లేదు...’ అని న్యాయస్థానం తేల్చి చెప్పింది.

కోర్టుతోనే బేరసారాలు.. న్యాయవ్యవస్థ ప్రతిష్టను తక్కువ చేయడమే!
‘ఈ కేసులో తాము అప్రూవర్‌గా మారతామని, ఇందులో భాగంగా తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌ వేర్వేరుగా సీఆర్‌పీసీ సెక్షన్‌ 306 కింద పిటిషన్లు దాఖలు చేశారు. అవి లోపభూయిష్టంగా ఉండటంతో ఈ కోర్టు కొన్ని అభ్యంతరాలు తెలిపింది. తదనుగుణంగా వాటిని రిటర్న్‌ చేసింది. అయితే కోర్టు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పిటిషనర్లు సవరించలేదు. సవరణలతో మళ్లీ పిటిషన్లు దాఖలు చేయలేదు. అప్రూవర్‌లుగా మారే విషయంలో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌లకు సదుద్దేశం లేదన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. 

ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తే గానీ  అప్రూవర్‌లుగా మారే ప్రసక్తే లేదన్నట్లుగా పిటిషనర్ల తీరు. ముందస్తు బెయిల్‌ ఇస్తేనే అప్రూవర్‌లుగా మారతామనడం కోర్టుతో బేరసారాలు చేయడమే అవుతుంది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్టను తక్కువ చేయడమే. అంతేకాక ఇది పిటిషనర్లకు, దర్యాప్తు సంస్థ మధ్య బేరం కుదిరిందన్న విషయాన్ని చాలా స్పష్టంగా ప్రస్ఫుటం చేస్తోంది. ఈ తీరు సీఆర్‌పీసీ సెక్షన్‌ 306 (4) (బీ) కింద నిర్దేశించిన విధానానికి పూర్తి విరుద్ధం. 

ఈ పిటిషన్లు పూర్తిగా తప్పుదోవ పట్టించేవి. కాబట్టి పిటిషనర్లకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసే విషయంలో ఈ కోర్టు తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించడం లేదు..’ అని కోర్టు తన తీర్పులో పేర్కొంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement