పట్టణ ఆస్తులకూ పాస్‌బుక్‌! | Passbook also to the urban assets | Sakshi
Sakshi News home page

పట్టణ ఆస్తులకూ పాస్‌బుక్‌!

Nov 17 2017 4:28 AM | Updated on Jun 4 2019 5:04 PM

Passbook also to the urban assets - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు టైటిల్‌ డీడ్‌లతో కూడిన పాస్‌పుస్తకాలు ఇవ్వనున్నట్టే పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులకూ యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రత్యేకంగా కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు కర్ణాటకలో అమలవుతున్న పట్టణ ఆస్తుల యాజమాన్య రికార్డుల (యూపీఓఆర్‌) ప్రక్రియను అధ్యయ నం చేస్తోంది. గ్రామాల్లోని భూములకు జనవరి లో అధునాతన డిజైన్‌తో రూపొందించిన పాస్‌ పుస్తకాలు ఇచ్చిన తర్వాత ఫిబ్రవరిలో పట్టణా ల్లోని భూముల రికార్డులను సరిచేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ రెండు ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. 

కర్ణాటకలో ఇలా.. 
పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులకు ప్రత్యేక కార్డులు జారీ చేసేందుకుగాను కర్ణాటక మూడు శాఖలను అనుసంధానం చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల రికార్డులుండే స్థానిక సంస్థలు, భూముల రికార్డులు నిర్వహించే రెవెన్యూ, భూముల పక్కా లెక్కను తేల్చే సర్వే సెటిల్‌మెంట్‌ శాఖల సహకారంతో 2014 నుంచే సమగ్రమైన కార్డులను జారీ చేస్తోంది. మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్‌ల అధీనంలో పనిచేసే ప్రత్యేక అథారిటీల ద్వారా ఈ కార్డులు ఇస్తోంది. వీటిల్లో ఆస్తి లేదా భూమి యజమాని పేరు, ఆ ఆస్తి స్వభావం, మ్యుటేషన్‌ జరిగిన తేదీ, రిజిస్టర్‌ నంబర్, ఆస్తి ఉన్న ప్రాంతం, దాని సరిహద్దులు, ఆస్తిలో యజమాని వాటా? వంటి వివరాలను పొందుపరిచింది. గ్రామీణ ప్రాంతాల్లోని వాటికిచ్చే తరహాలోనే ప్రత్యేక కార్డులను రూపొందించింది. ఈ కార్డులను పట్టణాల యజమానులకు ఇవ్వడం ద్వారా రిజిస్ట్రేషన్‌ లావాదేవీలను పారదర్శకంగా నిర్వహిస్తోంది. ఈ కార్డు ఉంటేనే ఆస్తులు లేదా భూముల రిజిస్ట్రేషన్లు చేస్తోంది. 

లిటిగేషన్లను నిరోధించేందుకే.. 
పట్టణ ప్రాంతాల్లో వ్యక్తిగత ఆస్తులు, భూముల రికార్డులకు ఆయా ప్రాంతాల్లోని స్థానిక సంస్థలే నిర్వహిస్తుంటాయి. ఆ భూములు, ఆస్తులకు పన్ను కట్టినా, కరెంటు బిల్లు, నల్లా బిల్లు కట్టినా పట్టణ స్థానిక సంస్థలే రికార్డు చేసుకుంటాయి. ఈ భూములు, ఆస్తుల క్రయ, విక్రయ లావా దేవీలు మాత్రం రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్ల ద్వారా జరుగుతోంది. వీటిల్లో సబ్‌రిజిస్ట్రార్లకూ తక్కువ అధికారాలు ఉన్నందున అందుబాటులో ఉన్న డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. గ్రామాల్లోని భూముల రిజిస్ట్రేషన్‌ జరగాలంటే పాస్‌పుస్తకాల ఆధారంగా చేస్తుండగా.. పట్టణా ల్లో మాత్రం రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లే ఆధారం కావడంతో రిజిస్ట్రేషన్ల శాఖ కూడా ఏమీ చేయలేకపోతోంది. దీంతో పై వివరాలన్నింటితో కూడిన ప్రత్యేక కార్డు ఉంటే ఆస్తుల లిటిగేషన్‌ కేసులు తగ్గుతాయని, డబుల్‌ రిజిస్ట్రేషన్ల లాంటి అక్రమాలకు చెక్‌ పడుతుందని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక విధానాన్ని అమలు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదించగా.. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement