ప్రస్తుతానికి వ్యవసాయ భూములే!

Agricultural lands itself right this movement - Sakshi

 తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు దశల వారీగా అమలు

తొలిదశలో సాగు భూములకే పరిమితం

మిగతావన్నీ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లోనే

సాక్షి, హైదరాబాద్‌: తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల సేవలను దశల వారీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకే పరిమితం చేయాలని.. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లన్నీ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే చేయాలని భావిస్తోంది. కొంత సర్దుకున్న తర్వాత నాలా భూముల సేవలను తహసీల్‌ కార్యాలయాలకు అప్పగించాలని యోచిస్తోంది. దీనికి అనుగుణంగానే భూరికార్డుల నిర్వహణ కోసం సిద్ధం చేస్తున్న ‘ధరణి’ వెబ్‌సైట్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది.  

ఫిబ్రవరిలో శిక్షణ 
తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలను ప్రారంభించనున్న నేపథ్యంలో.. రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాల తీరుతెన్నులపై రెవెన్యూ సిబ్బందికి క్షేత్రస్థాయి శిక్షణ ఇవ్వనున్నారు. ఫిబ్రవరిలో తహసీల్, రెవెన్యూ డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో శిక్షణ ఇచ్చిన అనంతరం.. తహసీల్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలను ప్రారంభిస్తారు.  

సాధ్యాసాధ్యాలపై విస్తృత చర్చ: రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవల సాధ్యాసాధ్యాలపై విస్తృత చర్చ జరుగుతోంది. రిజిస్ట్రేషన్‌ సేవలను రెవెన్యూ శాఖకు అనుసంధానం చేయడం సబబుకాదని, ప్రస్తుత విధానమే సరిపోతుందని ఆ శాఖ కమిషనర్‌గా పనిచేసిన నదీమ్‌ అహ్మద్‌ ఇచ్చిన నివేదిక ప్రభుత్వ వర్గాల్లో చర్చను లేవనెత్తింది. అయినా రిజిస్ట్రేషన్, రెవెన్యూ అనుసంధానంపై సర్కారు ముందుకే వెళ్లాలని నిర్ణయించుకుంది. కానీ రిజిస్ట్రేషన్ల శాఖతోపాటు రెవెన్యూ సిబ్బంది కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తమకు ఇప్పటికే ఉన్న తలకుమించిన బాధ్యతలకు తోడు కొత్త పనులు అప్పగిస్తున్నారని రెవెన్యూ సిబ్బంది వాపోతున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బంది కూడా.. ఏటా రూ.5 వేల కోట్ల ఆదాయం వచ్చేలా శాఖను తీసుకువచ్చామని.. కానీ ప్రభుత్వ చర్య ఆదాయంపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. తహసీల్‌ కార్యాలయాల్లో సిబ్బంది కొరత, పని ఒత్తిడితో రిజిస్ట్రేషన్లలో జాప్యం జరిగే అవకాశముందని, దానివల్ల ఆదాయం తగ్గుతుందని చెబుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top