ఓఆర్‌ఆర్‌..‘సర్వీసు’బేజార్‌! 

ORR Service Roads  Are Not Good - Sakshi

ఔటర్‌ సర్వీస్‌ రోడ్లపై నిర్లక్ష్యం 

చాలా చోట్ల మధ్యలోనే ఆగిన నిర్మాణాలు 

వాహనదారులపై అదనపు ప్రయాణ భారం

రైల్వే వంతెనలు నిర్మిస్తే...‘సర్వీసు’కు మోక్షం

అయినా పట్టని అధికారగణం 

సాక్షి, సిటీబ్యూరో: ఔటర్‌ రింగ్‌ రోడ్డు విభాగం అధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారుతోంది. ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్ల పనులు చేపట్టడంలో అధికారులు గత కొన్నేళ్లుగా ఉదాసీనత చూపుతున్నారు. ఓఆర్‌ఆర్‌ను తాకుతూ వెళుతున్న రైల్వే ట్రాక్‌లను సాకుగా చూపుతూ సర్వీసు రోడ్ల పనులను పక్కనబెట్టేశారు. అక్కడ బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉన్నా కావాలనే కాలయాపన చేస్తూ వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నారు. ఫలితంగా రెం డు, మూడు కిలోమీటర్లు అదనంగా తిరుగుతూ వెళ్లాల్సి వస్తోందని ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనదారులు గ గ్గోలు పెడుతున్నారు. రైల్వే ట్రాక్‌ ఉన్న ప్రాంతంలో వం తెనలు నిర్మిస్తే..టోల్‌ కలెక్షన్‌ తగ్గిపోతుందనే ఇలా నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

2012 లోనే ఓఆర్‌ఆర్‌తో పాటు సర్వీసు రోడ్ల నిర్మాణాలన్నీ పూర్తి కావల్సి ఉన్నా ఇప్పటికీ పట్టించుకోకపోవడంపై వా హనదారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈదులనాగులపల్లి,  శంషాబాద్, ఘట్‌కేసర్, మేడ్చల్‌ సమీపంలోని ఓఆర్‌ఆర్‌ను తాకుతున్న రైల్వే ట్రాక్‌లకు అనుబంధంగా ఉన్న అసంపూర్తి సర్వీసు రోడ్లు ముప్పుతిప్పలు పెడుతున్నా యి. ఈదులనాగలపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ సూత్రప్రాయంగా అనుమతిచ్చినా ఇప్పటికీ పనులు ప్రా రంభించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే కొన్ని నెలల క్రితం పూర్వ కమిషనర్‌ డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి ఆయా ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు దిశానిర్దేశం చేసినా అడుగు మాత్రం ముందుకు పడటం లేదు.

ఘట్‌కేసర్‌ గౌడవెళ్లి వద్ద... 

ఘట్‌కేసర్‌ మండలంలోని గౌడవెళ్లి రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జి ఏర్పాటు చేయకపోవడంతో  సర్వీసు రోడ్డు అసంపూర్తిగా మిగిలింది. దీంతో వాహనదారులు 3.5 కిలోమీటర్ల అదనపు ప్రయాణం చేస్తున్నారు. గౌడవెళ్లి పరిధిలో ఉన్న సికింద్రాబాద్‌–నాందేడ్‌ రైల్‌ మార్గంలోనే రింగురోడ్డు నిర్మించారు. గౌడవెళ్ళి స్టేషన్‌ సమీపంలో నుండి ఓఆర్‌ఆర్‌ రోడ్డు వెళుతుంది. సర్వీసు రోడ్డు మాత్రం నిర్మించకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఘట్‌కేసర్‌ వైపు నుండి వచ్చే రోడ్డులో సుతారిగూడ టోల్‌ప్లాజా వరకు సర్వీస్‌ రోడ్డు నిర్మించి వదిలేశారు. పటాన్‌చెరు వైపు నుండి వచ్చే రోడ్డులో గౌడవెళ్లి పరిధిలోని రాంరెడ్డి గార్డెన్‌ సమీపం వరకు సర్వీసు రోడ్డు నిర్మించి వదిలేశారు. దీంతో సర్వీస్‌ రోడ్డులో వచ్చే వాహనదారులు సుతారిగూడ టోల్‌ ప్లాజా నుండి గౌడవెళ్లి గ్రామం మీదుగా 3.5 కిలో మీటర్లు తిరిగి జ్ఞానాపూర్‌ బ్రిడ్జి వద్ద ఉన్న సర్వీసు రోడ్డు నుండి వెళ్లాల్సి వస్తుంది. పటాన్‌చెరు వైపు నుండి వాహనదారుల పరిస్థితి ఇదేవిధంగా ఉంది. సుతారిగూడ టోల్‌ ప్లాజానుండి అసంపూర్తి గా ఉన్న సర్వీసు రోడ్డు రింగురోడ్డుకు ఇరువైపులా కనీసం పనులు మొదలు పెట్టలేదు.

 ఈదులనాగులపల్లిలో... 

రామచంద్రపురం మండలం పరిధిలోని ఈదుల నాగులపల్లి గ్రామ శివార్లలోని ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్డు లేకపోవడంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈదూలనాగులపల్లి, వెలమల శివారుల్లో రైల్వేట్రాక్‌ కారణంగా సర్వీసు రోడ్డు అంసపూర్తిగా మిగిలింది. మధ్యలో సర్వీసు రోడ్డు లేకపోవడంతో రైతులు పొలాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వీసు రోడ్డు లేకపోవడంతో తాత్కాలికంగా మట్టితో రాంపో రోడ్డు వేశారు. ఆ రోడ్డుపై నిత్యం ప్రమాదకరంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. సర్వీసు రోడ్డు లేకపోవడంతో నాగులపల్లి రావాలంటే కిలోమీటర్‌ దూరం తిరిగి రావల్సి వస్తోంది. గతంలో స్థానికులు ఆందోళన చేసినా హెచ్‌ఎండీఏ ఓఆర్‌ఆర్‌ విభాగ అధికారులకు చీమకుట్టినట్టుగా కూడా లేకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పొచ్చు.

 మేడ్చల్‌లో... 

కీసర నుంచి ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డులో పెద్దఅంబర్‌పేట్‌ వైపు వెళ్లాలంటే శ్రీనిధి ఇంజనీరింగ్‌ కళాశాల వరకు సర్వీస్‌ రోడ్డులో ప్రయాణించి అక్కడి నుంచి యంనంపేట్‌ గ్రామంలోకి చేరుకొని ఘట్‌కేసర్‌ బైపాస్‌ రోడ్డు కూడలి దాటాలి. రైల్వే ట్రాక్‌ కారణంగా సర్వీస్‌ రోడ్డు నిర్మించకపోవడంతో అదనంగా సుమారు మూడు కిలోమీటర్లకు పైగా ప్రయాణించవలసి వస్తోంది. పెద్దఅంబర్‌పేట్‌ వైపు నుంచి కీసర వైపు వెళ్లాలంటే యంనంపేట్‌ గ్రామం మీదుగా సర్వీస్‌ రోడ్డుకు చేరుకోవడానికి రెండు కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించవలసి ఉంటుంది. ఈ రైల్వే ట్రాక్‌ వద్ద బ్రిడ్జి నిర్మిస్తే వాహనదారులు ఇబ్బందులు తప్పుతాయని అంటున్నారు.

శంషాబాద్‌లో...

ఔటర్‌ రింగు రోడ్డు మార్గంలో తొండుపల్లి జంక్షన్‌ నుంచి పెద్దగోల్కొండ వైపు సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు ఇరువైపులా సర్వీసు రోడ్డు అసంపూర్తిగా ఉంది. ఈ దారి మధ్యలో ఉందానగర్‌–తిమ్మాపూర్‌ స్టేషన్‌ల రైల్వే ట్రాక్‌ ఉండడంతో సర్వీసు రోడ్డు పనులను నిలిపివేశారు. పెద్దగోల్కొండ వైపు నుంచి సర్వీసు మార్గంలో శంషాబాద్‌ వచ్చే వాహనదారులు హమీదుల్లానగర్‌ సమీపంలో దారి మళ్లాల్సి వస్తుంది. ఈ ప్రాంతంలో వాహనదారులు తికమకకు గురై అసంపూర్తిగా ఉన్న సర్వీసు మార్గంలో వెళ్లి ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాగే చెన్నమ్మ హోటల్‌ సమీపంలోని కొత్వాల్‌గూడ ప్రాంతంలో సైతం రెండు కిలోమీటర్ల దూరం వరకు సర్వీసు రోడ్డు పనులు చేపట్టలేదు. హిమాయత్‌సాగర్‌ జలాశయం వెంబడి ఉన్న ఇరుకు దారి గుండానే వాహనదారులు వెళ్లాల్సి వస్తుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top