ఎన్నాళ్లీ వేదన ! | On the discrimination of students | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ వేదన !

Nov 2 2014 4:58 AM | Updated on Aug 28 2018 5:25 PM

ఎన్నాళ్లీ వేదన ! - Sakshi

ఎన్నాళ్లీ వేదన !

ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక విద్యార్థులు.. ప్రధానంగా బాలికలు పడుతున్న వేదన వర్ణనాతీతం.

* విద్యార్థినులపై వివక్ష
* పాఠశాలల్లో కానరాని మరుగుదొడ్లు
* మంచినీళ్లు తాగేందుకు వెనుకాడుతున్న బాలికలు
* వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు

ఆదిలాబాద్ టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక విద్యార్థులు.. ప్రధానంగా బాలికలు పడుతున్న వేదన వర్ణనాతీతం. మూత్ర విసర్జన సౌకర్యంలేక కొందరు విద్యార్థినులు మంచినీళ్లు తాగడమే మానేస్తున్నారు. ఫలితంగా అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రతీ పది మంది విద్యార్థినుల్లో ఒకరు మూత్రనాళ సంబంధ సమస్యతో సతమతమవుతుండడం సమస్య తీవ్రతను తెలుపుతోంది.  
 
ఆత్మగౌరవానికి సంకెళ్లు..
జిల్లాలోని 3,900 పాఠశాలల్లో 3534 మరగుదొడ్లు ఉన్నాయి ఈ పాఠశాలల్లో సుమారు 3 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవు. పైగా ఉన్నవాటిలో వివిధ కారణాలతో అధికశాతం మరుగుదొడ్లు పనిచేయడంలేదు. జిల్లాలో విద్యార్థుల అవస్థలు తీరాలంటే అదనంగా 4,235 మరుగుదొడ్లు అవసరం. పాఠశాలల్లో బాలికల అవసరాలను తీర్చడానికి తూతుమంత్రంగా నిర్మించిన దాదాపు వెయ్యికిపైగా మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా ఉన్నాయి.
 
అనారోగ్యం బారిన..
మరుగుదొడ్ల సౌకర్యం లేక బాలికలు సరిపడా మంచినీళ్లు తాగడంలేదు. సాధారణంగా బాలికలు రోజుకు 8 నుంచి 10 గ్లాసుల(కనీసం 3 లీటర్లు) నీళ్లు తాగాలి. బాలికలు పాఠశాలల్లో ఆటలాడుతారు. శారీరక వ్యాయామం చేస్తుంటారు. కొందరు బస్సు సౌకర్యం లేక దూర ప్రాంతాల నుంచి నడిచి వస్తుంటారు. ఇలాంటి వారికి సాధారణం కంటే ఎక్కువ నీరు అవసరం. అయినా మూత్రం వస్తే ఇబ్బందనే కారణంగా వారంతా నీళ్లు తాగడంలేదు. ఈ చర్య వారిని అనారోగ్య సమస్యల్లోకి నెడుతోంది. విద్యార్థినులు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో కొన్ని..
 
డ్రీ హైడ్రేషన్ : తగిన మోతాదులో నీరు తీసుకోని వారిలో సాధారణంగా కనిపించేది డీ హైడ్రేషన్. శారీరక క్రియలకు తగినంత నీరు లభించకపోవడమే ఈ స్థితికి కారణం. దీనివల్ల విద్యార్థులు హఠాత్తుగా కళ్లు తిరిగిపడిపోతారు.

మూత్రనాళ ఇన్ఫెక్షన్ : బాలికల్లో తరచుగా కనిపించే వాటిలో ఇదీ ఒకటి. తగినంత నీరు తీసుకోకపోవడంతో మూత్రనాళాలు, జ్ఞానేంద్రియాలు పొడిగా మారతాయి. దీంతో హాని కలిగించే బాక్టీరియా వృద్ధి చెందుతుంది. తద్వారా మూత్రం దుర్వాసన రావడం, మంటగా ఉండటం వంటి జబ్బులొస్తాయి.
 
పొత్తికడుపులో నొప్పి
మూత్రాశయం నిండిప్పుడు వెంటనే విసర్జన చేయాలి. అది 750 మిల్లీలీటర్లు మాత్రమే నిల్వ చేసుకోగలదు. బాలికలు ఎక్కువ సేపు మూత్ర విసర్జన చేయకుండా బలవంతంగా నిల్వ చేసుకొని ఉండడం అనారోగ్యానికి దారి తీస్తుంది. మూత్రాశయం మీద ఒత్తిడి పెరిగి కండరాలు దెబ్బతింటాయి. పొత్తి కడుపు, వెన్ను భాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది.
 
కిడ్నీల పనితీరుపై..
తగినంత నీరు తీసుకోకపోవడంతో కిడ్నీల పనితీరుపై ప్రభావితం చేస్తుంది. సరిపడా నీరు అందకపోతే అక్కడ వ్యర్థాలు పేరుకుపోతాయి. రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. చాలా బడుల్లో బాలికల డ్రాపవుట్స్‌కు పై సమస్యలే కారణంగా నిలుస్తున్నాయి.
 
ఎలా చెప్పాలో..ఎవరికి చెప్పాలో..  
నేటి జీవనశైలిలో 11 నుంచి 13 ఏళ్ల మధ్యే బాలికల్లో రుతుక్రమం మొదలవుతుంది. అంటే ఐదో తరతగతి నుంచే బాలికలు చదువుకునే పాఠశాలల్లో మరుగుదొడ్లు ఏర్పాట్లు చేయాలి. కానీ చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు కనిపించడం లేదు. రుతుక్రమం సమయంలో నాపికిన్స్ మార్చుకోవాలన్నా.. మూత్ర విసర్జన చేయాలన్నా బాధను దిగమింగుతున్నారే తప్ప ఎవరికీ చెప్పాలో.. ఎలా చెప్పాలో తెలియక బాలికలు తలదించుకుంటున్నారు. నెలసరి సమయంలో చెడు రక్తం విడుదలవుతుంది. శుభ్రపరుచుకోకుంటే బ్యాక్టీరియా పెరుగుతుంది. శానిటరీ ప్యాడ్‌లను మార్చుకోవడానికి, వాడిన వాటిని ధ్వంసం చేయడానికి కాస్త గోప్యత కావాలి. పాఠశాలల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఇబ్బందులు తప్పుతాయి. ఆరోగ్యం పెంపొందుతుంది.
 - రమాఅశోక్, వైద్యురాలు, ఆదిలాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement