రెండు నెలల్లో 9,200 పోస్టుల భర్తీ

Notification For Panchayat Secretary In Telangana - Sakshi

వారంలో నియామక ప్రక్రియ షురూ: సీఎం

మూడేళ్ల వరకు ప్రొబేషనరీ పీరియడ్‌

తర్వాత పనితీరు ఆధారంగా క్రమబద్ధీకరణ

ఇన్‌చార్జుల విధానానికి స్వస్తి పలకాలని అధికారులకు ఆదేశం

ప్రొబేషన్‌ సమయంలో నెలకు వేతనం 15,000

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో మరోసారి కొలువుల పండుగకు తెరలేచింది. కొత్తగా 9,200 మంది పంచా యతీ కార్యదర్శులను నియమించనున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వారం రోజుల్లోగా నియామక ప్రక్రియ ప్రారంభించి రెండు నెలల్లోగా భర్తీ పూర్తి చేయాలని ఆదివారం అధికారులను ఆదే శించారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ గ్రామానికి పంచాయతీ కార్యదర్శి ఉండాలని, పల్లె సీమలను ప్రగతిసీమలుగా మార్చే బృహత్తర కార్య క్రమంలో వారు కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షిం చారు. కొత్తగా నియామకమయ్యే 9,200 పంచాయతీ కార్యదర్శులకు మూడేళ్ల వరకు ప్రొబేషనరీ పీరియడ్‌ ఉంటుందని, తర్వాత పనితీరు ఆధారంగా వారిని క్రమబద్ధీకరించాలన్నారు. విధులు నిర్వహించలేని వారిని క్రమబద్ధీకరించకుండా ఉండేలా విధానం రూపొందించాలని సీఎం చెప్పారు. ప్రొబేషన్‌ సమయంలో నెలకు రూ.15,000 చొప్పున వేతనం  ఇవ్వాలని ఆదేశించారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించాలని, పంచాయితీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలోనే, జిల్లా కేడర్‌లో కార్యదర్శుల నియామకాలు జరపాలని పేర్కొన్నారు.

ఇక ఇన్‌చార్జి విధానం వద్దు
రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయితీలున్నాయి. ఇందులో ప్రస్తుతం 3,562 పంచాయితీలకు కార్యదర్శులున్నారు. ప్రభుత్వం ఇటీవలే కొత్తగా గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసింది. వీటికితోడు పాత గ్రామ పంచాయితీల్లోనూ ఖాళీలున్నాయి. అన్ని గ్రామాలకు ప్రత్యేకంగా పంచాయితీ కార్యదర్శులుండాలని, ఒక కార్యదర్శి మరో పంచాయితీకి ఇన్‌చార్జిగా పనిచేసే విధానానికి స్వస్తి పలకాలని సీఎం నిర్ణయించారు. ఇందులో భాగంగా కొత్తగా 9,200 మందిని పంచాయితీ కార్యదర్శులుగా నియమించాలని చెప్పారు. నియామక ప్రక్రియ, పంచాయితీ కార్యదర్శుల విధులు, బాధ్యతలు తదితర అంశాలపై విధి విధానాలు రూపొందించాల్సిందిగా పంచాయతీ రాజ్‌ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, పంచాయితీ రాజ్‌ ముఖ్య కార్యదర్శి వికాస్‌ రాజ్, కమిషనర్‌ నీతూ ప్రసాద్‌లను ఆదేశించారు. పంచాయితీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి త్వరలో జరిగే కేబినెట్‌ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నట్లు ప్రకటించారు.

200 మంది ఉన్నా కార్యదర్శి
గ్రామాలను వికాస కేంద్రాలుగా, ఆదర్శ గ్రామాలుగా మార్చేందుకు తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ‘‘పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలని మా ప్రభుత్వం నమ్ముతుంది. గ్రామాలు బాగుపడితే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. కాబట్టి గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పరిపాలన సౌలభ్యం కోసం, తండాలు, గూడేలు, మారుమూల ప్రాంతాలు, శివారు పల్లెలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలనే ఉద్దేశ్యంతో కొత్త పంచాయితీలను ఏర్పాటు చేశాం. పంచాయితీల పరిధిలో హరితహారం కార్యక్రమం అమలు చేయడం, గ్రామాల పరిశుభ్రత, పన్నుల వసూలు, మురికి కాలువల నిర్మాణం–నిర్వహణ, విద్యుత్‌ దీపాల నిర్వహణ, అంటు వ్యాధులు ప్రబలకుండా చూడడం, దోమల నివారణ, శ్మశానవాటికల నిర్మాణం, డంప్‌ యార్డుల ఏర్పాటు లాంటి ఎన్నో బాధ్యతలు గ్రామ పంచాయితీకి ఉన్నాయి. గ్రామ పంచాయితీ పాలకవర్గంతో కలిసి గ్రామ కార్యదర్శి ఈ బాధ్యతలన్నీ నెరవేర్చాల్సి ఉంటుంది. అందుకే ప్రతీ గ్రామానికి ఒక కార్యదర్శి విధిగా ఉండాలి. 200 జనాభా కలిగిన గ్రామానికి కూడా ప్రత్యేక కార్యదర్శిని నియమించాలని నిర్ణయించాం. వారంతా కష్టపడి పనిచేస్తే రెండు మూడేళ్లలోనే ఎంతో మార్పు వస్తుంది. తెలంగాణ గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా వెలుగొందుతాయి. దేశవ్యాప్తంగా ఆదర్శ గ్రామాలెక్కడున్నాయంటే తెలంగాణలోనే అనే పేరు వస్తుంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top