సమయానికే ‘స్థానికం’!

Notification issued by the State Election Commission - Sakshi

మే 17న గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా 

నోటిఫికేషన్‌ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం 

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకూ ఏర్పాట్లు 

వీటికి అనుగుణంగానే ఓటర్ల జాబితా తయారు 

కలెక్టర్లకు, డీపీవోలకు ఎన్నికల సంఘం ఆదేశం  

   కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఎన్నికలు 

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీ ఎన్నికలను గడువు లోపు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించి కీలక ప్రక్రియను మొదలుపెట్టింది. ఓటర్ల జాబితా విషయంలో కచ్చితమైన తేదీలను ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వి.నాగిరెడ్డి శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. మే 17న అన్ని గ్రామాల్లో ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను పంచాయతీ, మండల ప్రజా పరిషత్‌ కార్యాలయాల్లో నోటీసు బోర్డులో ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. వార్డుల వారీగా జాబితాలు ఉండాలని, అన్ని జిల్లాల పంచాయతీ అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన తాజా ఓటర్ల జాబితా ఆధారంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితా ముసాయిదాను ఏప్రిల్‌ 30 లోపు.. అభ్యంతరాలు, విజ్ఞప్తుల ప్రక్రియను మే 10లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. 

25 కాపీలు తప్పనిసరి 
సమగ్రంగా రూపొందించిన ఓటర్ల జాబితా ప్రచురణ బాధ్యతలను జిల్లా పంచాయతీ అధికారులు చేపడతారు. పంచాయతీ ఓటర్ల జాబితాను 25 కాపీలను తయారు చేస్తారు. గ్రామంలో సమాచారం కోసం నాలుగు కాపీలు ఇవ్వాలి. ఈ నాలుగు కాపీల్లో పంచాయతీ నోటీసు బోర్డులో ఒకటి, గ్రామంలోని మూడు ముఖ్యమైన ప్రదేశాల్లో మిగతావి ప్రదర్శించాల్సి ఉంటుంది. మండల ప్రజా పరిషత్‌కు ఒకటి, డీపీవో కార్యాలయానికి ఒకటి ఇస్తారు. గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీలకు ఒక్కొక్కటి చొప్పున ఇస్తారు. మిగతా కాపీలను రిజర్వులో పెట్టాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మండల పరిషత్, జిల్లా పరిషత్‌ ఓటర్ల జాబితాలను ఆయా కార్యాలయాల్లోని నోటీసు బోర్డులో పెడతారు. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం వెబ్‌సైట్‌లోనూ ఓటర్ల జాబితాను పొందుపరుస్తారు. 

జెడ్పీటీసీ, ఎంపీటీసీలకూ.. 
గ్రామ పంచాయతీ ఎన్నికలతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా గడువు లోపు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. మూడు ఎన్నికలకు అనుగుణంగా ఓటర్ల జాబితాను రూపొందించే ప్రక్రియను ప్రారంభించింది. పంచాయతీ ఎన్నికలకు అవసరమైన రీతితో ఓటర్ల జాబితాను రూపొందిస్తూ అవసరమైన పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేయాలని అధికారులకు సూచించింది. గ్రామ పంచాయతీలో వార్డుకు ఒకటి చొప్పున పోలింగ్‌ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు, జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, మండల ప్రజా పరిషత్, జెడ్పీటీసీ, జిల్లా ప్రజా పరిషత్‌ ఎన్నికలకు అనుగుణంగా ఓటర్ల జాబితా ఉండాలని పేర్కొన్నారు.

అన్ని స్థానిక సంస్థల ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ బాధ్యతలను జిల్లా పంచాయతీ అధికారులకు అప్పగించారు. మండల స్థాయిలో ఎంపీడీవో, ఈవో (పీఆర్‌ఆర్‌డీ)లు ఓటర్ల జాబితాను రూపొందించాల్సి ఉంటుంది. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ఈ విధులు నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. మరోవైపు గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా రూపకల్పన నమూనాను ఇప్పటికే జిల్లాలకు పంపించారు. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు పంచాయతీల సంఖ్య, ఫొటోతోపాటు ఓటరు వివరాలను పేర్కొనాలని ఆదేశించారు. ఎలక్ట్రోరల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఈఆర్‌ఎంఎస్‌) ఉపయోగించి ఓటర్ల స్లిప్పులను ఫొటోలు లేకుండా, ఫొటోలు ఉండేలా రెండు రకాలుగా తయారు చేయాలని పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top