ముగ్గురి జాతకాన్ని మార్చిన నోటామీట!

NOTA Effect On Future of candidates - Sakshi

మూడు నియోజకవర్గాల్లో మెజార్టీ కంటే నోటాకే ఎక్కువ 

అభ్యర్థుల భవితవ్యంపై చూపిన ప్రభావం 

వరంగల్‌లో అత్యధికం.. నిజామాబాద్‌లో అత్యల్పం

సాక్షి, హైదరాబాద్‌: ‘నోటా’ముగ్గురు అభ్యర్థుల జాతకాన్ని తారుమారు చేసింది. బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ చెల్లని ఓటు మార్చేసింది. పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చనప్పుడు (నన్‌ ఆఫ్‌ ది అబోవ్‌) ఓటర్లు ‘నో’చెప్పే ఆయుధం నోటా. ఈ ఓటు తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులకు చమటలు పట్టించింది. జహీరాబాద్, భువనగిరి, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల్లో మెజార్టీకన్నా..నోటా మీటకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. జహీరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బీబీ పాటిల్‌ స్వల్ప ఓట్ల తేడాతో సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌మోహన్‌రావుపై గెలుపొందారు. కేవలం 6,229 ఓట్లతో మదన్‌ మోహన్‌ ఓడిపోయారు. ఇక్కడ నోటాకు ఏకంగా 11,140 ఓట్లు పడ్డాయి.అలాగే, భువనగిరిలోను సేమ్‌ సీను చోటు చేసుకుంది. అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అతి స్వల్ప అంటే 5,219 ఓట్లతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ను ఓడించారు.

ఈ స్థానంలో నోటాకు 12,029 ఓట్లు వచ్చాయి. మల్కాజిగిరి లోక్‌సభ సెగ్మెంట్‌లోను నోటాకు భారీగా ఓట్లు పడ్డాయి. ఏకంగా 17,895 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎనుమల రేవంత్‌రెడ్డి 10,919 ఓట్లతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖరరెడ్డిని ఓడించారు. నోటాకు పోలయిన ఓట్లలో కొన్ని తమకు పడినా గెలిచే వాళ్లమన్న బెంగ పరాజితులకు పట్టుకుంది. స్వల్ప ఓట్లతో ఓడిపోవడం ఒక ఎత్తయితే.. మెజార్టీ ఓట్లను ప్రభావితం చేసే స్థాయిలో నోటాకు పడడం వారిని కుంగదీసింది. 2014 ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలలో ఈ ఆప్షన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. ఇలా నోటా ఆయుధం ఎలా ఉంటుందో అభ్యర్థులకు తెలిసివచ్చింది.  

వరంగల్‌లో అత్యధికం.. ఇందూరులో అత్యల్పం 
వరంగల్‌ పార్లమెంటరీ స్థానంలో నోటాకు అనూహ్యరీతిలో ఓట్లు పోలయ్యాయి. ఏకంగా 18,801 ఓట్లు రావడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా లేకపోవడంతోనే తటస్థ ఓటర్లు నోటావైపు మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. అలాగే, అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరిలోను నోటాకు గణనీయంగా ఓట్లు వచ్చాయి. 17,895 ఓట్లు రావడంతో ఇక్కడ అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రభావితం చేసింది. ఇక దేశంలోనే అత్యధిక అభ్యర్థులు బరిలో నిలిచిన నిజామాబాద్‌లో మాత్రం ఓటర్లు పరిణితితో వ్యవహరించారు. అక్కడ రాష్ట్రంలోనే అత్యల్పంగా అంటే కేవలం 2,031 ఓట్లు మాత్రమే నోటాకు వచ్చాయి. ఈ సెగ్మెంట్‌లో 185 మంది పోటీపడ్డ సంగతి తెలిసిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top