ప్రశ్నార్థకంగా ‘కుడా’ భవితవ్యం

No Development In Kuda - Sakshi

నిధుల కొరతతో సతమతం

అభివృద్ధికి నోచుకోని పాతబస్తీ

హైదరాబాద్‌ : కులీకుతుబ్‌షా నగరాభివృద్ధి సంస్థ (కుడా) ఉనికి కోల్పోతోంది. గత కొంత కాలంగా నిధులు విడుదల కాకపోవడంతో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరుగక కుడా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఉద్యోగులకు చేతిలో పని లేకుండా పోయింది. పనులు లేక దారుషిఫాలోని కుడా ప్రధాన కార్యాలయం వెలవెలబోతోంది. అధికారులతో పాటు సిబ్బంది గదులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.  పాతబస్తీ అభివృద్ధి కోసం దివంగత ముఖ్యమంత్రి టి. అంజయ్య 1981లో దారుషిఫాలో ‘కుడా’ను ఏర్పాటు చేశారు.

1981-82 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 25 లక్షలతో ఏర్పాటైన కుడాకు అంచెలంచెలుగా బడ్జెట్‌ పెరుగుతూ అప్పట్లో రూ. 9 కోట్లకు చేరుకుంది. పాతబస్తీలోని మలక్‌పేట్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా, నాంపల్లి, కార్వాన్, గోషామహాల్‌ తదితర నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో  ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడమే లక్ష్యంగా కుడా పని చేసింది. పెరిగిన అవసరాల దృష్ట్యా ఏటా బడ్జెట్‌ పెరగాల్సి ఉన్నా కేటాయించిన నిధులే సకాలంలో విడుదల కాకపోవడంతో కుడా  భవిష్యత్‌ ప్రశ్నార్దకంగా మారింది.

ప్రత్యేక తెలంగాణలో కుడా పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని భావించిన సిబ్బంది, పాతబస్తీ ప్రజలకు నిరాశే మిగిలింది. కుడాకు నిధుల కేటాయింపుపై పాతబస్తీ ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేయకపోవడం కూడా ఇందుకు ఒక కారణం. దీంతో ఫిర్యాదులు, సమస్యలతో వచ్చే వారికి నిరాశే ఎదురవుతోంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ చార్మినార్‌ జోన్‌ జోనల్‌ కమిషనర్‌తో పాటు ఉన్నతాధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు మాత్రమే ప్రస్తుతం కుడా కార్యాలయాన్ని వాడుకుంటున్నారు.   
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top