గులాబీ ‘పురం’!

Nizamabad Municipal Corporation Elects New Chairman - Sakshi

బల్దియా పీఠాలన్నీ టీఆర్‌ఎస్‌ సొంతం

కొలువుదీరిన కొత్త పాలక వర్గాలు

ఆనందోత్సవాల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: జిల్లాలోని బల్దియా పీఠాలన్నీ టీఆర్‌ఎస్‌ వశమయ్యాయి.. దీంతో గులాబీ శ్రేణులు ‘పుర’వశంలో మునిగి తేలాయి.. బోధన్, నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మినహా ఆర్మూర్, భీమ్‌గల్‌ పురాధీశుల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. సోమవారం ఆయా బల్దియాల్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశాల్లో తొలుత సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మేయర్, చైర్‌పర్సన్లు, డిప్యూటీ మేయర్, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు నిర్వహించారు. దీంతో మున్సిపాలిటీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. ఇన్నాళ్లు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న బల్దియాలు ఇకపై ప్రజాప్రతినిధుల ఏలుబడిలో కొనసాగనున్నాయి.

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలోనూ గులాబీ జెండానే ఎగిరింది. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో ఎంఐఎం, కాంగ్రెస్‌ కార్పొరేటర్ల మద్దతుతో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ దండు నీతుకిరణ్‌ మేయర్‌ పదవి దక్కించుకోగా, డిప్యూటీ మేయర్‌ పదవి ఎంఐఎంకు దక్కింది. నాలుగు మున్సిపాలిటీలూ టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుని జిల్లాలో తనకు తిరుగులేదని గులాబీ పార్టీ మరోమారు చాటి చెప్పింది. బల్దియాలన్నీ టీఆర్‌ఎస్‌కు దక్కడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందోత్సవాల్లో మునిగి పోయారు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

ఆర్మూర్‌ చైర్‌ పర్సన్‌గా వినీత 
ఆర్మూర్‌: ఆర్మూర్‌ మున్సిపాలిటీ చైర్‌ పర్సన్‌గా పండిత్‌ వినీత ఎన్నికయ్యారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 33వ వార్డు నుంచి గెలిచిన వినీత పేరును 36వ వార్డు కౌన్సిలర్‌ రమేశ్‌ ప్రతిపాదించగా, 12వ వార్డు కౌన్సిలర్‌ కాటి హన్మంతు బలపరిచారు. ఆమెకు పోటీగా ఇంకెవరూ రాకపోవడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినీత మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా విజయం సాధించినట్లు ఆర్డీవో ప్రకటించారు. వైస్‌ చైర్మన్‌గా 20వ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ మున్ను కూడా ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు.

భీమ్‌గల్‌ చైర్‌ పర్సన్‌గా రాజశ్రీ 
భీమ్‌గల్‌: నూతనంగా ఏర్పడిన భీమ్‌గల్‌ మున్సిపాలిటీ చైర్‌ పర్సన్‌గా మల్లెల రాజశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన బల్దియా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించిన చైర్‌ పర్సన్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. 9వ వార్డు నుంచి ఎన్నికైన రాజశ్రీ తొలి చైర్‌ పర్సన్‌గా చిరస్థాయిలో నిలిచి పోనున్నారు. వైస్‌ చైర్మన్‌గా 4వ వార్డు కౌన్సిలర్‌ గున్నాల బాల భగత్‌ ఎన్నికయ్యారు.
బోధన్‌ బల్దియాపై మరోసారి గులాబీ జెండా.. 
బోధన్‌టౌన్‌: బోధన్‌ బల్దియా చైర్‌ పర్సన్‌గా తూము పద్మావతి ఎన్నికయ్యారు. 25వ వార్డు నుంచి గెలిచిన ఆమె టీఆర్‌ఎస్‌ చైర్‌ పర్సన్‌గా అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయగా, కాంగ్రెస్‌ నుంచి (24వ వార్డు) కౌన్సిలర్‌ సంధ్య కూడా పోటీలో నిలిచారు. దీంతో ఎన్నిక నిర్వహించగా టీఆర్‌ఎస్‌ (20), ఎంఐఎం(11), బీజేపీ(1), ఎక్స్‌అఫీషి యో సభ్యుడు సహా పద్మావతికి 33 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థికి ఆరుగురు కౌన్సిలర్ల మద్దతు మాత్రమే లభించడంతో, పద్మావతి చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. వైస్‌చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌కు చెందిన 34వ వార్డు కౌన్సిలర్‌ ఎత్తేశాం (సోహైల్‌) ఎన్నికయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top